సెన్సెక్స్‌ 386 పాయింట్లు అప్‌

30 Jun, 2018 00:59 IST|Sakshi

జూలై సిరీస్‌ లాభాల జోష్‌తో ఆరంభమైంది. గురువారం జీవిత కాల కనిష్ట స్థాయికి పడిపోయిన రూపాయి రికవరీ కావడంతో శుక్రవారం స్టాక్‌మార్కెట్‌ భారీ లాభాలతో ముగిసింది. పతన బాటలో ఉన్న ప్రపంచ మార్కెట్లు కోలుకోవడం, దిగువ స్థాయిల్లో వేల్యూ బయింగ్‌ చోటు చేసుకోవడంతో రెండు రోజుల నష్టాలకు బ్రేక్‌ పడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మళ్లీ 10,700 పాయింట్ల పైకి ఎగబాకింది. 125 పాయింట్ల లాభంతో 10,714 పాయింట్ల వద్ద ముగిసింది.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 386 పాయింట్లు ఎగబాకి 35,423 పాయింట్లకు చేరింది.  మే 31 తర్వాత సెన్సెక్స్‌ ఒక్క రోజులో ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. గత రెండు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ మొత్తం 452 పాయింట్లు పతనమైంది. వాణిజ్య యుద్ధ భయాలు తీరకపోయినా, ముడి చమురు ధరలు స్వల్పంగానే తగ్గినా, ప్రపంచ మార్కెట్లు రికవరీ కావడంతో  ఇక్కడి ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడింది.  

ఐదు వారాల లాభాలకు బ్రేక్‌: అయితే వారం పరంగా చూస్తే, రెండు సూచీలు నష్టపోయాయి. దీంతో ఐదు వారాలుగా కొనసాగుతున్న సూచీల లాభాల జైత్రయాత్రకు అడ్డుకట్ట పడింది. ఈ వారంలో సెన్సెక్స్‌ 266 పాయింట్లు, నిఫ్టీ 108 పాయింట్లు చొప్పున పడిపోయాయి.  

రోజంతా లాభాలే: సెన్సెక్స్‌ 35,128 పాయింట్ల వద్ద లాభాల్లో ఆరంభమైంది. కొనుగోళ్ల జోరుతో రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 421 పాయింట్ల లాభంతో 35,459 పాయింట్ల వద్ద గరిష్ట స్థాయిని తాకింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 134 పాయింట్లు లాభపడింది.

సోమవారం రీట్స్, ఫైన్‌ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌ లిస్టింగ్‌
రైల్వే కన్సల్టెన్సీ సంస్థ, రీట్స్‌ షేర్లు సోమవారం (జూలై 2న) స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కానున్నాయి. ఈ కంపెనీతో పాటు ఫైన్‌ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు కూడా అదే రోజు  లిస్టవుతాయి. ఈ 2 కంపెనీల ఐపీఓలు ఈ నెల 20న ఆరంభమై 22న ముగిశాయి.

మరిన్ని వార్తలు