11,500 పాయింట్లపైకి నిఫ్టీ

20 Mar, 2019 01:13 IST|Sakshi

ఏడో రోజూ కొనసాగిన లాభాలు 

అడ్డేలేని విదేశీ నిధుల ప్రవాహం 

268 పాయింట్ల లాభంతో 38,363కు సెన్సెక్స్‌

70 పాయింట్లు పెరిగి 11,510కు నిఫ్టీ 

స్టాక్‌ మార్కెట్లో లాభాల జోరు కొనసాగుతోంది. దేశీయ సానుకూల సంకేతాలకు తోడు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ప్రవాహం కారణంగా వరుసగా ఏడో రోజూ స్టాక్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఐటీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్‌ వంటి హెవీ వెయిట్‌ షేర్ల జోరుతో స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం లాభపడింది. నిఫ్టీ తాజాగా 11,500 పాయింట్ల పైకి ఎగబాకింది. 70 పాయింట్లు పెరిగి 11,510 పాయింట్ల వద్దకు చేరింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 268 పాయింట్లు లాభపడి 38,363 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ ఏడు రోజుల్లో సెన్సెక్స్‌ మొత్తం 1,688 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్, నిఫ్టీలు ఆరు నెలల గరిష్ట స్థాయికి చేరాయి. బ్యాంక్, ఐటీ, ఇంధన షేర్లు లాభపడ్డాయి.

318 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌...
నిధులు జోరుగా వస్తుండటం, రూపాయి పుంజుకుంటుండటం, ప్రపంచ మార్కెట్లు కూడా లాభపడుతుండటంతో మన స్టాక్‌ మార్కెట్‌ దూసుకుపోతోందని ఎమ్‌కే వెల్త్‌ మేనేజ్‌మెంట రీసెర్చ్‌ హెడ్‌  జోసెఫ్‌ థామస్‌ చెప్పారు. ప్రస్తుత స్థాయిల వల్ల స్పెక్యులేటర్లు లాభాల స్వీకరణ జరిపినప్పటికీ, ఇన్వెస్టర్లు జోరుగానే కొనుగోళ్లు చేస్తున్నారు. సెన్సెక్స్‌ లాభాల్లోనే మొదలైంది. ఆరు రోజుల రూపాయి లాభాలకు బ్రేక్‌ పడటం ప్రతికూల ప్రభావం చూపించింది. మధ్యాహ్నం వరకూ స్టాక్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ మందకొడిగానే  సాగింది. ఆ తర్వాత  పుంజుకుంది. యూరప్‌ మార్కెట్లు లాభాల్లో ఆరంభం కావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడింది. కొనుగోళ్లు జోరుగా సాగడంతో ఒటిగంట తర్వాత మార్కెట్‌ కూడా జోరుగా పెరిగింది. ఉదయం 17 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ ఒక దశలో 301 పాయింట్ల వరకూ లాభపడింది. మొత్తం మీద రోజంతా 318 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.  బుధవారం ఫెడ్‌ ఫండ్‌ రేటు నిర్ణయం నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. 

ఏడాదిలో 12,500కు నిఫ్టీ ! : గోల్డ్‌మన్‌ శాక్స్‌
స్టాక్‌ మార్కెట్లో ముందస్తు ఎన్నికల ర్యాలీ ఉంటుందని అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ, గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనా వేస్తోంది. ఎన్నికల అనంతరం స్థిరమైన ప్రభుత్వమే ఏర్పడే అవకాశాలున్నాయని, ఏడాది కాలంలో నిఫ్టీ 12,500 పాయింట్ల స్థాయికి చేరుతుందని ఈ సంస్థ పేర్కొంది. గత నెల కాలంలో నిఫ్టీ 8 శాతం ఎగసిందని తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్‌లో మార్కెట్‌వెయిట్‌గా ఉన్న రేటింగ్‌ను ప్రస్తుతం ఓవర్‌వెయిట్‌కు అప్‌గ్రేడ్‌ చేస్తున్నామని పేర్కొంది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్‌ అండ్‌ టీ, ఎంఅండ్‌ఎం, అదానీ పోర్ట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అశోక్‌ లేలాండ్, టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్, పీఎన్‌బీ, అమర రాజా బ్యాటరీస్, కమ్మిన్స్‌ ఇండియా, క్రాంప్టన్‌ గ్రీవ్స్, గుజరాత్‌స్టేట్‌ పెట్రోనెట్, గ్లెన్‌మార్క్‌ ఫార్మా షేర్లు మంచి రాబడులను ఇవ్వగలవని తెలిపింది.  

>
మరిన్ని వార్తలు