విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల వరద 

16 Mar, 2019 01:30 IST|Sakshi

38,000 పాయింట్ల పైకి సెన్సెక్స్‌

ఏడు నెలల గరిష్టానికి రూపాయి 

ఐదో రోజూ కొనసాగిన లాభాలు 

ఆరు నెలల గరిష్టానికి సూచీలు 

269 పాయింట్ల లాభంతో 38,024కు సెన్సెక్స్‌

84 పాయింట్లు పెరిగి 11,427కు నిఫ్టీ 

స్టాక్‌ మార్కెట్లో లాభాల జైత్రయాత్ర కొనసాగుతోంది. కొనుగోళ్ల జోరుతో స్టాక్‌సూచీలు వరుసగా ఐదో రోజూ లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 38,000 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,400 పాయింట్లపైకి ఎగబాకాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వెల్లువలా వస్తుండటం, రూపాయి బలపడుతుండటం, సానుకూలంగా ఉన్న అంతర్జాతీయ సంకేతాలు... ఇవన్నీ స్టాక్‌ మార్కెట్‌ను లాభాల బాట నడిపిస్తున్నాయి. ముడి చమరు ధరలు పెరిగినా మన మార్కెట్‌ ముందుకే దూసుకుపోయింది. ఇంట్రాడేలో 500 పాయింట్ల వరకూ ఎగసిన సెన్సెక్స్‌ లాభాల స్వీకరణ కారణంగా ఆ లాభాల్లో సగం వరకూ పొగొట్టుకొని చివరకు 269 పాయింట్ల లాభంతో 38,024 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 144 పాయింట్లు ఎగసిన చివరకు  నిఫ్టీ 84 పాయింట్ల లాభంతో  11,427 పాయింట్ల వద్దకు చేరింది. సెన్సెక్స్, నిఫ్టీలు  ఆరు నెలల గరిష్ట స్థాయిలకు చేరాయి.  ఇక వారం పరంగా చూస్తే, స్టాక్‌ సూచీలు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్‌1,353 పాయింట్లు (3.68 శాతం), నిఫ్టీ 392 పాయింట్లు (3.54 శాతం) చొప్పున పెరిగాయి. 

14,000 కోట్ల విదేశీ పెట్టుబడులు...
పాక్, భారత్‌ల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గడం, మళ్లీ ఎన్‌డీయే ప్రభుత్వమే అధికారంలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయన్న అంచనాల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లో జోరుగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ నెలలో ఇప్పటిదాకా విదేశీ ఇన్వెస్టర్లు రూ. 14,000 కోట్ల మేర ఇన్వెస్ట్‌ చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన అనంతరం స్టాక్‌ మార్కెట్‌ వరుసగా ఐదు రోజులు లాభపడటం గత పదిహేనేళ్లలో ఇదే మొదటిసారి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరుతో రూపాయి బలపడుతోంది.  వరుసగా ఐదో రోజూ లాభపడ్డ రూపాయి ఏడు నెలల గరిష్టానికి చేరింది.బ్రెగ్జిట్‌  గడువు పొడిగింపు, చైనా–అమెరికాల మధ్య ఒప్పందానికి కూడా గడువును పొడిగించడంతో ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. 

ఆల్‌టైమ్‌ హైకి టైటాన్‌...
బ్యాంక్‌ షేర్ల లాభాలు కొనసాగుతున్నాయి. గత నెలలో రిటైల్, టోకు ద్రవ్యోల్బణాలు పెరిగినప్పటికీ, ఆర్‌బీఐ నిర్దేశిత స్థాయిల్లోనే ఉండటంతో రేట్ల కోత ఉండొచ్చన్న అంచనాలు బలం పుంజుకున్నాయి. దీంతో బ్యాంక్‌ షేర్లు పెరుగుతున్నాయి. ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ బ్యాంక్‌ నిఫ్టీ జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకింది. పలు షేర్లు జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. బాటా ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ట్రెంట్, యూపీఎల్, ట్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్, అర్‌వింద్‌ ఫ్యాషన్స్‌ ఈ జాబితాలో ఉన్నాయి.  

మరిన్ని వార్తలు