నాలుగోరోజూ లాభాలే..

5 Mar, 2016 01:24 IST|Sakshi
నాలుగోరోజూ లాభాలే..

సెన్సెక్స్ 39 పాయింట్లు అప్
ఇంట్రాడేలో 7500 దాటిన నిఫ్టీ
ఒక వారంలో సూచీలు ఇంత లాభపడడం నాలుగేళ్లలో ఇది తొలిసారి...

 సానుకూల అంతర్జాతీయ సంకేతాల దన్నుతో శుక్రవారం స్టాక్‌మార్కెట్ స్వల్ప లాభాల్లో ముగిసింది. స్టాక్ సూచీలు వరుసగా నాలుగో రోజూ లాభాల్లోనే ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 7,500 పాయింట్లపైకి ఎగసింది.  ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 39 పాయింట్ల లాభంతో 24,646 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 7,485 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, లోహ, కొన్ని వాహన షేర్లు లాభపడ్డాయి.  ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియడం, కీలక రేట్ల కోత అవకాశాలు మరింత మెరుగుపడడం,  రూపాయి రెండున్నర నెలల గరిష్ట స్థాయి అయిన 67.08కు చేరడం(వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్‌లోనూ రూపాయి బలపడింది) సానుకూల ప్రభావం చూపాయి. ఈ వారంలో సెన్సెక్స్ 1,492 పాయింట్లు(6.44 శాతం), ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 456 పాయింట్లు(6.48 శాతం) చొప్పున లాభపడ్డాయి. ఒక వారంలో స్టాక్ సూచీలు ఈ స్థాయిలో లాభపడడం నాలుగేళ్లలో ఇదే మొదటిసారి. బ్యాంక్ నిఫ్టీ 11 శాతం, ప్రభుత్వ రంగ బ్యాంక్ సూచీ 18 శాతం చొప్పున  లాభపడ్డాయి. పాయింట్ల రీత్యా బ్యాంక్ నిఫ్టీకి  పదేళ్లలో ఇదే అత్యధిక లాభాల వారం. బ్యాంకింగ్ రంగంపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు వెలువడతాయన్న అంచనాలు దీనికి కారణం.

 మహా శివరాత్రి సందర్భంగా సోమవారం స్టాక్ మార్కెట్‌కు సెలవు.

>
మరిన్ని వార్తలు