వారాంతం నష్టాలతో ముగింపు

28 Apr, 2017 16:09 IST|Sakshi
ముంబై : మార్కెట్లో శుక్రవారం ట్రేడింగ్ లోనూ ప్రాఫిట్ బుకింగ్ చోటుచేసుకుంది. దీంతో వారాంతంలో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 111.34 పాయింట్ల నష్టంలో 29,918.40 వద్ద, నిఫ్టీ 38.10 పాయింట్ల నష్టంలో 9,304.05 వద్ద క్లోజ్ అయ్యాయి. నేటి ట్రేడింగ్ లో ఎస్బీఐ, మారుతీ సుజుకీ,  ఓఎన్జీసీ, ఐసీఐసీఐ బ్యాంకు, ఏషియన్ పేయింట్స్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా 1-3 శాతం లాభపడగా.. ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ లు 1-2 శాతం నష్టపోయాయి. ఈ వారంలో రికార్డుల మోత మోగించిన స్టాక్ మార్కెట్ లో ఈ రెండు రోజులుగా ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు పాల్పడ్డారు. 
 
రికార్డుల స్థాయిలో మార్కెట్లు ర్యాలీ జరుపడంతో ఈ వారంలో బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు కనీసం 2 శాతం మేర లాభపడ్డాయి. మార్చి నుంచి ఇదే మెరుగైన ప్రదర్శన. మంచి కార్పొరేట్ ఫలితాలు, ఆర్థిక వృద్ధి పెరగడం స్టాక్ మార్కెట్లను పైకి ఎగిసేలా దోహదం చేశాయి. ఐదు రోజులు రికార్డు లాభాల అనంతరం చోటుచేసుకున్న ప్రాఫిట్ బుకింగ్ తో బ్యాంకు నిఫ్టీ 0.6 శాతం మేర పడిపోయింది. నష్టాలు పాలైన కంపెనీల్లో ఎక్కువగా బయోఫార్మాస్యూటికల్ కంపెనీ బయోకాన్ లిమిటెడ్ 3.4 శాతం మేర నష్టపోయింది. కంపెనీ మార్చి క్వార్టర్ ఫలితాలు 62 శాతం క్షీణించడంతో కంపెనీ ఈ మేర నష్టపోయింది.  కాగ సోమవారం మార్కెట్లు సెలవును పాటించనున్నాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 12 పైసల నష్టంలో 64.28గా నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు అక్షయ తృతీయ సందర్భంగా 88 రూపాయల లాభంతో 28,857 రూపాయలుగా ఉన్నాయి. 
మరిన్ని వార్తలు