నష్టాల్లోకి లాక్కెళ్లిన టర్కీ లీరా

14 Aug, 2018 02:12 IST|Sakshi

కొనసాగిన టర్కీ కరెన్సీ లీరా పతనం  

ఫలితంగా ప్రపంచ కరెన్సీ, స్టాక్‌ మార్కెట్ల పతనం

మన రూపాయినీ పడగొట్టిన టర్కీ లీరా  

ఈ ప్రభావంతో మన దగ్గర లాభాల స్వీకరణ  

11,400 దిగువకు నిఫ్టీ  

74 పాయింట్ల నష్టంతో 11,356 వద్ద ముగింపు  

224 పాయింట్లు పతనమై 37,645కు సెన్సెక్స్‌

టర్కీ కరెన్సీ, రూపాయి పతనంతో  స్టాక్‌సూచీలు వరుసగా రెండో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ నష్టపోయాయి. భారత బ్యాంకింగ్‌ రంగం భవిష్యత్‌ చిత్రం ఏమంత ఆశావహంగా లేదని ఫిచ్‌ రేటింగ్స్‌ పేర్కొనడం ప్రతికూల ప్రభావం చూపించింది. దీనితో బ్యాంక్‌ షేర్లు కుదేలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 224 పాయింట్ల నష్టంతో 37,645 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 74 పాయింట్లు పతనమై 11,356 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది రెండు వారాల కనిష్ట స్థాయి.

ఇంట్రాడేలో 310 పాయింట్లు పడిన సెన్సెక్స్‌
నష్టాల్లో ఆరంభమైన సెన్సెక్స్‌.. రోజంతా నష్టాల్లోనే ట్రేడయింది. ఇంట్రాడేలో 310 పాయింట్ల నష్టంతో 37,559 పాయింట్ల వద్ద కనిష్ట స్థాయిని తాకింది. అయితే ఆ తర్వాత వేల్యూ బయింగ్, షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు చోటు చేసుకోవడంతో నష్టాలు ఒకింత రికవరీ అయ్యాయి.  

ఐఐపీ బాగున్నా....
టర్కీ–అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపించాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు. జూన్‌ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు బాగా ఉన్నప్పటికీ, బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు, రూపాయి పతనం... ఇన్వెస్టర్లను లాభాల స్వీకరణకు పురికొల్పాయని పేర్కొన్నారు. అయితే కంపెనీల ఆర్థిక ఫలితాలు మెరుగ్గా ఉండటం, చమురు ధరలు తక్కువ స్థాయిలోనే ఉండటం, దేశీయంగా స్థూల ఆర్థికాంశాలు మెరుగుపడటం...ఇవన్నీ మార్కెట్‌ పతనాన్ని అడ్డుకోగలవని ఆయన అంచనా వేస్తున్నారు. టర్కీ కరెన్సీ లీరా పతనంతో ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, యూరప్‌ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ఆరంభమై, నష్టాల్లోనే ముగిశాయి.  

ఆల్‌టైమ్‌ హైకి ఇన్ఫోసిస్‌...
స్టాక్‌ మార్కెట్‌ భారీగా నష్టపోయినప్పటికీ, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,411కు చేరింది. చిరవకు 1.7 శాతం లాభంతో రూ. 1,409 వద్ద ముగిసింది. రూపాయి పతనం ఈ షేర్‌కు కలసివచ్చింది. ఈ షేర్‌తో పాటు మరికొన్ని షేర్లు కూడా ఆల్‌టైమ్‌ హైలను తాకాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా, బాటా ఇండియా, 3ఎమ్‌ ఇండియా, బెర్జర్‌ పెయింట్స్, ఇండియాబుల్స్‌ వెంచర్స్, జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్, ఫైజర్‌ షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

ఈ క్యూ1లో రూ.4,876 కోట్ల నికర నష్టాలు ప్రకటించడంతో ఎస్‌బీఐ షేర్‌ 3.1 శాతం నష్టపోయి రూ. 295 వద్ద ముగిసింది. ఎస్‌బీఐతో పాటు ఇతర బ్యాంక్‌ షేర్లూ నష్టపోయాయి.
ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో గెయిల్‌ షేర్‌ 3.5 శాతం లాభపడి రూ.376 వద్దకు చేరింది.
అంతర్జాతీయ అమ్మకాలు 5% తగ్గడంతో టాటా మోటార్స్, టాటా మోటార్స్‌(డీవీఆర్‌) షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఇంట్రాడేలో 3 శాతం వరకూ నష్టపోయిన ఈ షేర్లు చివరకు 0.6–2.6 శాతం నష్టాలతో ముగిశాయి. గత మూడు నెలల కాలంలో ఈ షేర్లు చెరో పాతిక శాతం వరకూ పతనమయ్యాయి.  

లాభాల్లో ఐటీ షేర్లు  
రూపాయి పతనంతో ఐటీ, టెక్నాలజీ షేర్లు లాభపడ్డాయి. ఐటీ కంపెనీల ఆదాయం అధికంగా ఇతర దేశాల నుంచి(డాలర్ల రూపంలో) వస్తోంది. డాలర్‌ బలపడితే ఆ మేరకు ఐటీ కంపెనీల ఆదాయాలూ పెరుగుతాయి.  టెక్‌ మహీంద్రా, మైండ్‌ ట్రీ, విప్రో, కేపీఐటీ టెక్నాలజీస్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, టాటా ఎలెక్సీ, ఇన్ఫోసిస్,  టీసీఎస్‌లు 3 శాతం వరకూ లాభపడ్డాయి.  


అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన బంగారం ధరలు
న్యూయార్క్‌: టర్కీ ఆర్థిక సంక్షోభం బంగారం మార్కెట్‌పైనా ప్రభావం చూపింది. అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో  న్యూయార్క్‌ కామెక్స్‌ గోల్డ్‌ ఫ్యూచర్స్‌ సంబంధించిన కాంట్రాక్టు సోమవారం రాత్రి 11.30 గంటలకు  1.5 శాతం తగ్గి 1,200 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా, టర్కీ మధ్య ఉద్రిక్తతలు సోమవారం కూడా కొనసాగాయి. గత శుక్రవారం టర్కీ స్టీల్, అల్యూమినియంపై అమెరికా టారిఫ్‌లను రెట్టింపు చేసిన విషయం తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు