బ్లాక్ మండే: బ్యాంకింగ్ షేర్లు ఢమాల్ 

23 Mar, 2020 13:00 IST|Sakshi

సాక్షి, ముంబై: ఆర్థిక మాంద్య భయాలతో ఆసియా మార్కెట్లు కుప్పకూలాయి. దీంతో దేశీయ  ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలాయి. 10శాతం పతనంతో లోయర్ సర్క్యూట్‌ను తాకడంతో  45 నిమిషాలు నిలిపివేయబడింది. విరామం తరువాత స్వల్పంగా కోలుకున్నా, అనంతరం మరింత దిగజారి బెంచ్ మార్క్ సెన్సెక్స్ 3,499,( 11.7శాతం) 26,417 వద్ద, నిఫ్టీ 50 ఇండెక్స్ 1,008(11.5శాతం) నష్టంతో 7737.25 పాయింట్లకు పడిపోయి మరో బ్లాక్ మండే నమోదైంది.  ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ 12 శాతం పతనమై ఎన్నడూ కనీవిని ఎరుగని స్థాయిలో నష్టాలను నమోదు చేసుకుంటోంది. ముఖ్యంగా దేశీయ ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు  భారీగా నష్టపోతున్నాయి. ఏడాది గరిష్ట స్థాయి నుంచి కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే ఈ స్టాక్స్ ఏకంగా 45 శాతం పైగా పతనం అయ్యాయంటే.. అమ్మకాల ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో  ఊహించుకోవచ్చు.

ఐసీఐసీఐ బ్యాంక్ 52 వారాల గరిష్ట స్థాయి రూ. 552 కాగా.. ఇవాల్టి ట్రేడింగ్‌లో 15 శాతం క్షీణించి రూ. 293.85కు పడిపోయింది.  యాక్సిస్ బ్యాంక్ పరిస్థితి మరీ దారుణం ఈ స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయి రూ. 827 నుంచి రూ. 342కు పడిపోయింది. ఈ ఒక్క రోజే యాక్సిస్ బ్యాంక్ షేర్ ధర 20 శాతం క్షీణించింది. ఇండస్ఇండ్ బ్యాంక్ 14 శాతానికి పైగా కుప్పకూలింది.  దీంతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 11 శాతం బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆర్‌బిఎల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ 5 నుంచి 11 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.

కాగా  ప్రపంచ మాంద్యం  నెలకొనే అవకాశం, ఆయా దేశాల సెంట్రల బ్యాంకుల తీవ్ర చర్యలు,  లాక్‌డౌన్ల ఆటుపోట్ల కారణంగా ఆసియా షేర్లు పడిపోయాయని రాయిటర్స్ నివేదిక తెలిపింది. అలాగే ఆర్థిక వ్యవస్థలో తగినంత ద్రవ్యతను నిర్ధారించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బహిరంగ మార్కెట్ కార్యకలాపాలతో సహా అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ  ఇన్వెస్టర్ల ఆందోళన అప్రతిహతంగా కొనసాగుతోంది. రూ .30,000 కోట్ల ప్రభుత్వ బాండ్లను బహిరంగ మార్కెట్  ద్వారా  రెండుసార్లు( మార్చి 24,  మార్చి 30)  కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే.

చదవండి: 12 ఏళ్లలో మొదటిసారి...

మరిన్ని వార్తలు