సెన్సెక్స్ టార్గెట్ 30,000!

21 May, 2014 00:08 IST|Sakshi
సెన్సెక్స్ టార్గెట్ 30,000!

* ఏడాదిలో చేరే అవకాశం...
* స్టాక్ మార్కెట్లపై నిపుణుల అంచనా..
* మోడీ-బీజేపీ అఖండ విజయంతో
* ఇక సంస్కరణలకు జోష్
* అభివృద్ధిపైనే మోడీ పూర్తిగా దృష్టిసారించే చాన్స్
* ఆర్థిక వ్యవసపై విశ్వాసం పెరుగుతోందని వెల్లడి

 
 న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ తాజా ఎన్నికల్లో సాధించిన అపూర్వ విజయం దేశ ఆర్థిక వ్యవస్థకు దివ్వ ఔషధంగా పనికొస్తుందా? అవుననే అంటున్నారు నిపుణులు. ఎన్‌డీఏ కూటమి సాధారణ మెజారిటీ కంటే భారీగా సీట్లను కైవసం చేసుకోవడం... బీజేపీ ఒక్కటే సొంతంగా మేజిక్ ఫిగర్ 272 సీట్లను అధిగమించడంతో ఇక ఆర్థిక సంస్కరణలు కొంత పుంతలు తొక్కుతాయనే అంచనాలు సర్వత్రా బలపడుతున్నాయి.

ఈ ప్రభావంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఇప్పటికే రోజుకో కొత్త ఆల్‌టైమ్ గరిష్టాలను తాకుతున్నాయి కూడా. అయితే, మోడీ నేతృత్వంలోని సుస్థిర సర్కారు తీసుకోబోయే సాహసోపేత పాలసీ చర్యలతో మార్కెట్లు మరింత పరుగు తీస్తాయనేది విశ్లేషకుల అభిప్రాయం. సంస్కరణలకు గనుక చేయూత లభిస్తే... సెన్సెక్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15) చివరినాటికి అంటే వచ్చే ఏడాది మార్చికల్లా 30,000 పాయిం ట్లను తాకొచ్చని నిపుణులు చెబుతున్నారు.
 
 ఇంకా పెరుగుతుంది...
 ప్రస్తుతం సెన్సెక్స్ గత రికార్డులన్నీ చెరిపేసి 24,500 స్థాయిలో కదలాడుతోంది. మోడీ విజయం రోజున ఏకంగా 25,000 పాయింట్లనూ అధిగమించింది. అయితే, చరిత్రాత్మక గరిష్టాల వద్దే సెన్సెక్స్ ఇప్పుడు ఉన్నప్పటికీ... మరింత దూసుకెళ్లేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని యాంబిట్ క్యాపిటల్ అభిప్రాయపడింది. మార్చినాటికి తమ సెన్సెక్స్ లక్ష్యాన్ని 30,000 పాయింట్లకు పెంచుతున్నట్లు పేర్కొంది. అంతక్రితం ఏడాది జనవరిలో ఈ లక్ష్యం 24,000 పాయింట్లుగా ఉంది.

గత దశాబ్దపు కాలానికి పైగా సంకీర్ణ ప్రభుత్వాల పాలన కారణంగా ఆర్థిక, విధానపరమైన నిర్ణయాల్లో జడత్వం నెలకొందని.. ఇప్పుడు మోడీ నేతృత్వంలో 30 ఏళ్ల తర్వాత తొలిసారిగా బీజేపీ సొంతంగా సంపూర్ణ మెజారిటీ సాధించడంతో పారిశ్రామిక రంగానికి సానుకూల పరిస్థితులు నెలకొంటాయన్న విశ్వాసాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్‌లోని మోడీ సర్కారు విజయాలు.. తాజా ఎన్నికల ప్రచారంలో అభివృద్ధిపైనే మోడీ దృష్టిసారించడం కూడా ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచుతోందంటున్నారు.
 
 ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగింది...

 విదేశీ సంస్థ డాయిష్ బ్యాంక్ కూడా ఈ ఏడాది డిసెంబర్‌నాటికి సెన్సెక్స్ 28,000 పాయింట్లకు, నిఫ్టీ 8,000 పాయింట్లకు ఎగబాకవచ్చని అంచనా వేసింది. ‘దేశీ, విదేశీ ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరుగుతోంది. పెట్టుబడులకు భారత్ మెరుగైన గమ్యంగా భావిస్తున్నారు. దీంతో మరిన్ని నిధులు ఇక్కడకు తరలనున్నాయి’ అని డీబీఎస్ బ్యాంక్ హెడ్(ట్రెజరీ-మార్కెట్స్) విజయన్ ఎస్ పేర్కొన్నారు.
 
ఇక మోర్గాన్ స్టాన్లీ కూడా తన తాజా రీసెర్చ్ నోట్‌లో మార్కెట్లు మరింత దూకుడును కనబరుస్తాయని అంచనా వేసింది. వచ్చే ఏడాది జూన్‌నాటికి సెన్సెక్స్ టార్గెట్‌ను 26,300 పాయింట్లకు పెంచింది. గతంలో ఈ టార్గెట్ 21,280 పాయింట్లుగా ఉంది. ‘మోడీ సాధించిన భారీ విజయం, ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై దృష్టిపెడుతూ ఆయన సాగించిన ప్రచారంతో సంస్కరణలు, ప్రస్తుత పాలసీ చర్యలు మరింత ముందుకెళ్తాయన్న నమ్మకం పెరుగుతోంది. భారత్ ఈక్విటీ మార్కెట్‌పై మా బులిష్ ధోరణి కొనసాగుతోంది. ఇప్పుడప్పుడే లాభాలను స్వీకరించడం తొందరపాటే’ అని యూబీఎస్ తన నివేదికలో పేర్కొంది.
 
 సంస్కరణలు, సరైన ఆర్థిక మంత్రే కీలకం: డీబీఎస్
 ముంబై: మోడీ ప్రభుత్వం చేపట్టబోయే సంస్కరణల ఎజెండా... ఆర్థిక మంత్రి ఎంపిక, ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను కొనసాగించడం... ఈ అంశాలే మార్కెట్ సెంటిమెంట్‌ను ముందుకు నడిపిస్తాయని సింగపూర్‌కు చెందిన బ్రోకరేజి దిగ్గజం డీబీఎస్ అభిప్రాయపడింది. గతేడాది జపాన్‌లో షింజో అబే నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అప్పుడు అక్కడి మార్కెట్లు దూసుకెళ్లిన అంశానికీ... ఇప్పుడు మోడీ భారీ విజయంతో భారత్ మార్కెట్లలో దూకుడుకు ఎలాంటి పోలికలూ లేవని కూడా డీబీఎస్ పేర్కొంది. తక్షణం మార్కెట్ల సెంటిమెంట్‌కు బూస్ట్ ఇచ్చేది సరైన ఆర్థిక మంత్రి నియామకమేనని, రాజన్‌ను కొనసాగించడం కూడా రూపాయి విలువకు మద్దతుగా నిలుస్తుందని తన రీసెర్చ్ నివేదికలో వెల్లడించింది.

మరిన్ని వార్తలు