సెన్సెక్స్‌ తక్షణ మద్దతు 30,475

25 May, 2020 11:47 IST|Sakshi

మార్కెట్‌ పంచాంగం

వివిధ ప్రధాన దేశాల ఉద్దీపనల ఫలితంగా కోవిడ్‌ ఉత్పాతం నుంచి ఫైనాన్షియల్‌ మార్కెట్లు నెమ్మదిగా కోలుకుంటున్న తరుణంలో అమెరికా-చైనాల మధ్య తిరిగి తలెత్తిన ట్రేడ్‌వార్‌ మళ్లీ ఇన్వెస్టర్లను అనిశ్చితిలో పడవేసింది. భారత్‌కు సంబంధించి...లాక్‌డౌన్‌ను గణనీయంగా సడలించినా, డిమాండ్‌ కొరవడినందున, ఈక్విటీలు పురోగతి చూపించలేకపోతున్నాయి. కేంద్రం ప్రకటించిన తాజా ఉద్దీపన ప్యాకేజీ ఇన్వెస్టర్లను నిరుత్సాహపర్చడంతో పాటు రుణాలపై మారటోరియంను రిజర్వుబ్యాంక్‌ మరో మూడు నెలలు పొడిగించడంతో బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ప్రధాన సూచీల్లో అధిక వెయిటేజి కలిగిన బ్యాంకింగ్‌ షేర్ల పతనంతో బ్యాంక్‌ నిఫ్టీ...గత శుక్రవారం దాదాపు మార్చి కనిష్టస్థాయిల్ని సమీపించింది. బ్యాంక్‌ నిఫ్టీ కోలుకునేంతవరకూ ప్రధాన సూచీలు పరిమితశ్రేణిలోనే కదలవచ్చు. ఇక  స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా వున్నాయి.....

సెన్సెక్స్‌ సాంకేతికాంశాలు...
మే 22తో ముగిసినవారంలో తొలిరోజున 31,248 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి 29,968 పాయింట్ల కనిష్టస్థాయికి పతనమైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ... అటుతర్వాత మిగిలిన నాలుగు రోజుల్లోనూ పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యింది.   చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 425పాయింట్ల నష్టంతో 30,673 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సోమవారం సెలవు అనంతరం మంగళవారం మార్కెట్‌ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే 30,475 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది.  ఈ మద్దతును కోల్పోతే వేగంగా 29,970 పాయింట్ల వరకూ పతనం కొనసాగవచ్చు. ఈ దిగువన 29,500 పాయింట్ల వరకూ తగ్గవచ్చు.  ఈ వారం 30,475 పాయింట్ల మద్దతుస్థాయిని పరిరక్షించుకున్నా, గ్యాప్‌అప్‌తో మొదలైనా 31,250 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపైన 31,630 పాయింట్ల వద్దకు చేరవచ్చు. ఈ స్థాయిని సైతం అధిగమిస్తే 32,365 పాయింట్ల వరకూ పెరగవచ్చు.  

 నిఫ్టీ తక్షణ మద్దతు 8,970
గత మార్కెట్‌ పంచాంగంలో ప్రస్తావించిన 8,815 పాయింట్ల సమీపస్థాయిని క్రితం సోమవారం పరీక్షించిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ...అటుతర్వాత 9,178 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 78 పాయింట్ల నష్టంతో 9,039 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్‌ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే  నిఫ్టీకి 8,970 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే వేగంగా 8,860 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే తిరిగి  8,805పాయింట్ల వరకూ పతనం కొనసాగవచ్చు. 

మరిన్ని వార్తలు