మిశ్రమంగా ముగిసిన మార్కెట్‌

8 Aug, 2018 01:05 IST|Sakshi

ఆరంభంలో ఆల్‌టైమ్‌ హైలకు స్టాక్‌ సూచీలు

బ్యాంక్, ఇంధన షేర్లలో లాభాల స్వీకరణ

23 పాయింట్ల నష్టంతో 37,666కు సెన్సెక్స్‌

2 పాయింట్ల లాభంతో 11,389కు నిఫ్టీ

సోమవారం లాభపడిన బ్యాంక్, ఇంధన షేర్లలో మంగళవారం లాభాల స్వీకరణ జరిగింది. దీంతో శిఖర స్థాయిల నుంచి స్టాక్‌ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ సంకేతాలు బలంగా ఉన్నా, స్టాక్‌ సూచీలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనై,  పరిమిత శ్రేణిలో కదలాడాయి. స్టాక్‌ సూచీలు ఇంట్రాడేలో  జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. చివరకు సెన్సెక్స్‌ స్వల్ప నష్టాల్లో ముగియగా, నిఫ్టీ వరుసగా మూడో రోజూ ఆల్‌టైమ్‌ హై వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 23 పాయింట్లు పతనమై 37,666 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 2 పాయింట్ల లాభంతో 11,389 పాయింట్ల వద్ద ముగిశాయి. ఎఫ్‌ఎమ్‌సీజీ, ఇన్‌ఫ్రా షేర్లు బలహీనంగా ట్రేడయ్యాయి.

290 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌...
లాభాల్లోనే ఆరంభమైన సెన్సెక్స్‌ కొనుగోళ్ల జోరుతో ఇంట్రాడేలో 185 పాయింట్ల లాభంతో 37,877 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిని తాకింది. నిఫ్టీ కూడా 11,429 పాయింట్ల వద్ద ఆల్‌టైమ్‌ హైని చేరింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఇంట్రాడేలో 105 పాయింట్ల నష్టంతో 37,587 పాయింట్ల వద్ద కనిష్ట  స్థాయిని తాకింది. రోజంతా సెన్సెక్స్‌ తీవ్రమైన ఒడిదుడుకులకు లోనైంది. మొత్తం మీద 290 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.  

ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లు కుదేల్‌....
కొత్త రికార్డ్‌లను చేరిన తర్వాత మార్కెట్‌ తీవ్రమైన ఒడిదుడుకులకు గురైందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ వ్యాఖ్యానించారు. వాణిజ్య ఉద్రిక్తతలున్నా, ప్రపంచ మార్కెట్లు రాణించాయని వివరించారు. వరుసగా రెండు రోజుల ర్యాలీ అనంతరం ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుందని పేర్కొన్నారు. కాగా ఇరాన్‌పై అమెరికా తాజాగా ఆంక్షలు విధించడంతో ఆయిల్‌ షేర్లు జోరుగా పెరిగాయి. దీంతో ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి. యూరప్‌ మార్కెట్లు లాభాల్లో ఆరంభమై, లాభాల్లో ముగిశాయి.  

స్టాక్‌ సూచీలతో పాటే పలు షేర్లు ఇంట్రాడేలో ఆల్‌ టైమ్‌ హైలను తాకాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా, బాటా ఇండియా, డాబర్‌ ఇండియా, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్, హావెల్స్‌ ఇండియా, ఇండియాబుల్స్‌ వెంచర్స్, జుబిలంట్‌ ఫుడ్, సనోఫి ఇండియా, వినతీ ఆర్గానిక్స్‌ ఈ జాబితాలో ఉన్నాయి.  
 అంతర్జాతీయ మార్కెట్లో రాగి ధరలు పెరగడంతో లోహ షేర్లు మంచి లాభాలను సాధించాయి. ఎన్‌ఎమ్‌డీసీ 6 శాతం, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ 3.4 శాతం, వేదాంత 1.2 శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 1 శాతం చొప్పున పెరిగాయి. 

మరిన్ని వార్తలు