మార్కెట్‌ అక్కడక్కడే

8 Feb, 2019 06:06 IST|Sakshi

అంచనాలకు అనుగుణంగానే  ఆర్‌బీఐ వైఖరి

ఆశ్చర్యకరంగా రేట్ల కోత

ఐదు రోజుల పరుగు నేపథ్యంలో లాభాల స్వీకరణ

4 పాయింట్ల నష్టంతో 36,971కు సెన్సెక్స్‌

7 పాయింట్లు పెరిగి 11,069కు నిఫ్టీ

అంచనాలకు అనుగుణంగానే ఆర్‌బీఐ పాలసీ వైఖరి మారడం, అనూహ్యూంగా రేట్ల కోత చోటు చేసుకోవడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేశారు. దీంతో గురువారం స్టాక్‌ మార్కెట్‌ ఒడిదుడుకుల మధ్య ట్రేడై, మిశ్రమంగా ముగిసింది. ఇంట్రాడేలో 197 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ చివరకు 4 పాయింట్లు నష్టపోయి 36,971 పాయింట్ల వద్ద, నిఫ్టీ 7 పాయింట్లు పెరిగి 11,069 వద్ద ముగిశాయి. ఆర్‌బీఐ పాలసీ నేపథ్యంలో వడ్డీరేట్ల ప్రభావిత షేర్లు ఒడుదుడుకులకు గురై మిశ్రమంగా ముగిశాయి. వాహన షేర్లు లాభపడగా, బ్యాంక్, రియల్టీ షేర్లలో షేర్లు కొన్ని లాభాల్లో, కొన్ని నష్టాల్లో ముగిశాయి. రెపో తగ్గింపువల్ల  ఈ ప్రభావితమైన వాహన షేర్లు లాభపడ్డాయి.

273 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌...
సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. ఆర్‌బీఐ పాలసీ వెలువడక ముందు వరకూ పరిమిత లాభాల్లో ట్రేడైన స్టాక్‌ సూచీలు ఆ తర్వాత హెచ్చుతగ్గులకు గురయ్యాయి. డాలర్‌తో రూపాయి మారకం పుంజుకోవడం, ముడి చమురు ధరలు తగ్గడం సానుకూల ప్రభావం చూపించాయి.  గత ఐదు రోజుల్లో స్టాక్‌ మార్కెట్‌ లాభపడినందున లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. చివరి అరగంటలో అమ్మకాలు జోరుగా సాగాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 197 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 76 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 273 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. కాగా అనిల్‌ కంపెనీల షేర్ల క్షీణత కొనసాగింది.

ఛాలెట్‌ లిస్టింగ్‌...స్వల్ప లాభం
ఛాలెట్‌ హోటల్స్‌ షేర్‌ స్వల్ప లాభాలతో స్టాక్‌ మార్కెట్లో లిస్టయింది. బీఎస్‌ఈలో ఈ షేర్‌ ఇష్యూ ధర, రూ.280తో పోలిస్తే 3.9 శాతం లాభంతో రూ.291 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో 5.4 శాతం లాభంతో రూ.292 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 3.7  శాతం లాభంతో రూ.290 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో 9.45 లక్షల షేర్లు, ఎన్‌ఎస్‌ఈలో 94 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. గురువారం మార్కెట్‌ ముగిసే సమయానికి ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.5,954 కోట్లుగా నమోదైంది. మెట్రో నగరాల్లో లగ్జరీ హోటళ్లు నిర్వహించే ఈ కంపెనీ గత నెల 29–31 మధ్య ఐపీఓకు వచ్చింది.


 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా