మార్కెట్‌ అక్కడక్కడే

9 May, 2018 00:58 IST|Sakshi

బలహీనంగా అంతర్జాతీయ సంకేతాలు

8 పాయింట్ల లాభంతో 35,216కు సెన్సెక్స్‌

2 పాయింట్లు పెరిగి 10,718కు నిఫ్టీ   

అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో మంగళవారం స్టాక్‌ మార్కెట్‌ ఎక్కడిదక్కడే ముగిసింది. ఇరాన్‌ అణు ఒప్పందంపై అమెరికా అధ్యక్షడు డొనాల్ట్‌ ట్రంప్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఫలితంగా చమురు సరఫరాల్లో ఆటంకాలేర్పడి ధరల్లో ఒడిదుడుకులకు చోటు చేసుకుంటాయేమోనన్న ఆందోళన ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. సెన్సెక్స్‌ 8 పాయింట్ల లాభంతో 35,216 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 2 పాయింట్ల లాభంతో 10,718 పాయింట్ల వద్ద ముగిశాయి.

253 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌
సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. కొనుగోళ్ల జోరుతో 181 పాయింట్ల లాభంతో 35,389 పాయింట్ల వద్ద ఇంట్రాడేలో గరిష్ట స్థాయిని తాకింది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, ముఖ్యంగా ఐటీ, లోహ, వాహన షేర్లలో అమ్మకాల జోరుగా సాగడంతో నష్టాల్లోకి జారిపోయింది.  72 పాయింట్ల నష్టంతో 35,136 పాయింట్ల వద్ద ఇంట్రాడేలో కనిష్టానికి పడిపోయింది. రోజంతా   253 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 43 పాయింట్లు లాభపడగా, మరో దశలో 26 పాయింట్లు నష్టపోయింది.  

ఐసీఐసీఐ బ్యాంక్‌ 7 శాతం అప్‌...
ఐసీఐసీఐ బ్యాంక్‌ 7 శాతం లాభంతో రూ.309 వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.  గత క్యూ4లో నికర లాభం 45 శాతం తగ్గినా, ఒత్తిడి రుణాలు భారీగా తగ్గడం, మొండి బకాయిల సమస్య తీరినట్లేనని, రికవరీలపై దృష్టి సారించనున్నట్లు బ్యాంక్‌ వెల్లడించడం  సానుకూలప్రభావం చూపించాయి.

మరిన్ని వార్తలు