చమురు తెచ్చిన లాభాలు

14 Nov, 2018 02:44 IST|Sakshi

దిగివచ్చిన చమురు ధరలు      

బలపడిన రూపాయి

జోష్‌నిచ్చిన గణాంకాలు

మళ్లీ విదేశీ కొనుగోళ్లు

35,000 పాయింట్లు దాటిన సెన్సెక్స్‌

332 పాయింట్ల లాభంతో 35,144 వద్ద ముగింపు

10,500 పాయింట్లపైకి ఎగబాకిన నిఫ్టీ

వంద పాయింట్లు పెరిగి 10,583 వద్ద ముగింపు

ముడి చమురు ధరలు తగ్గడం, రూపాయి బలపడటంతో మంగళవారం స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. సోమవారం మార్కెట్‌ను పడగొట్టిన ఇంధన, బ్యాంక్‌ షేర్లు ర్యాలీ జరపడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మళ్లీ 35,000 పాయింట్లకు ఎగువన, ఎన్‌ఎస్‌ఈ నిప్టీ 10,500 పాయింట్ల పైన ముగిశాయి. మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్లు జోరుగా సాగడంతో ఆరంభ నష్టాలు రికవరీ అయ్యాయి. సెన్సెక్స్‌ 332 పాయింట్లు లాభపడి 35,144 పాయింట్ల వద్ద, నిఫ్టీ 100 పాయింట్లు పెరిగి 10,583 పాయింట్ల వద్ద ముగిశాయి.   

గణాంకాల ఉత్సాహం: అమెరికా ఆంక్షల కారణంగా, చైనాతో పాటు ఆసియా ప్రాంతం వృద్ధి కూడా మందగమనంగా ఉండగలదన్న ఆందోళనతో ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు నష్టపోయినప్పటికీ, చివర్లో నష్టాలు తగ్గడం, యూరప్‌ మార్కెట్లు లాభాలతో ఆరంభం కావడం సానుకూల ప్రభావం చూపించాయి.

మన మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు మళ్లీ పుంజుకోవడం కలసి వచ్చింది. అక్టోబర్‌ నెల రిటైల్‌  ద్రవ్యోల్బణం ఏడాది కనిష్ట స్థాయికి, 3.31 శాతానికి పడిపోవడం, పారిశ్రామికోత్పత్తి నిలకడగా ఉండడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడింది. సోమవారం 2 శాతం పెరిగిన ముడి చమురు ధరలు మంగళవారం 1 శాతం తగ్గాయి. దీంతో డాలర్‌తో రూపాయి మారకం ఇంట్రాడేలో 37 పైసలు బలపడి 72.52ను తాకింది. ఈ రెండు అంశాల కారణంగా కొనుగోళ్లు జోరుగా సాగాయి.
 
ఆసియా మార్కెట్లు నష్టాల కారణంగా సెన్సెక్స్‌ నష్టాలతోనే ఆరంభమైంది. ఇంట్రాడేలో 141 పాయింట్ల నష్టంతో 34,672 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఆ తర్వాత కొనుగోళ్లు పుంజుకోవడంతో లాభాల బాట పట్టింది. ఇంట్రాడేలో 375 పాయింట్ల లాభంతో 35,188 పాయింట్ల వద్ద గరిష్ట స్థాయిని తాకింది. రోజంతా 516 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దవలో 41 పాయింట్లు పతనం కాగా, మరో దశలో 114 పాయింట్లు లాభపడింది.  

ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగా ఉండటంతో అలహాబాద్‌ బ్యాంక్‌ 10 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 7 శాతం, అరబిందో ఫార్మా షేర్లు 3 శాతం వరకూ నష్టపోయాయి.  
ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.4 శాతం లాభంతో రూ.361  వద్ద ముగిసింది.
క్రూడ్‌ ధరలు తగ్గడంతో ప్రభుత్వ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు లాభపడ్డాయి.

మరిన్ని వార్తలు