బుల్‌ రికార్డుల రంకె..!

25 Jul, 2018 00:33 IST|Sakshi

జీవిత కాల గరిష్టాలకు సూచీలు

మార్కెట్లలో కొనసాగిన లాభాలు

ఆశాజనక ఫలితాలతో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు

106 పాయింట్ల లాభంతో సెన్సెక్స్‌ 36,825

49 పాయింట్ల లాభంతో నిఫ్టీ 11,134

మిడ్, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లలో రికవరీ  

ముంబై: స్టాక్‌ మార్కెట్లలో బుల్లిష్‌ ధోరణి కొనసాగుతోంది. కీలక సూచీలు మంగళవారం జీవిత కాల గరిష్ట స్థాయిలకు చేరుకున్నాయి. సెన్సెక్స్‌ ఇప్పటికే నూతన జీవిత కాల గరిష్ట స్థాయిల్లో ఉండగా, తాజాగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా తోడయ్యింది. కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉండడం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగారు.

అదే సమయంలో ఎఫ్‌ఐఐల పెట్టుబడుల రాక కాస్త మెరుగుపడడం, చమురు ధరలు తగ్గడం, ఇటీవలి కాలంలో బాగా దెబ్బతిన్న మిడ్‌క్యాప్, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లలో కాస్త రికవరీ తోడవడం ర్యాలీకి దోహదపడినట్టు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ పేర్కొన్నారు. ఎఫ్‌ఐఐలకు తోడు దేశీయ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల తాజా కొనుగోళ్ల సూచీలు రికార్డు స్థాయిల్లో ముగియడానికి కారణంగా బ్రోకర్లు తెలిపారు.  

సత్తా చాటిన హెవీ వెయిట్స్‌
సెన్సెక్స్‌ వరుసగా రెండో రోజు రికార్డులను తిరగరాసింది. ఇంట్రాడేలో కొత్త రికార్డు 36,902.06ను నమోదు చేసింది. సూచీలో అధిక వెయిటేజీ కలిగిన ఎల్‌అండ్‌టీ, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీలు లాభపడడం కలిసొచ్చింది. అటు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఈ ఏడాది జనవరి 29న నమోదు చేసిన జీవితకాల గరిష్ట స్థాయి 11,130.40 పాయింట్లను అధిగమించి 11,134.30 వద్ద క్లోజయింది.

తన ఐటీ అనుబంధ కంపెనీ ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ లాభం జూన్‌ క్వార్టర్లో 35 శాతం పెరగడంతో ఎల్‌అండ్‌టీ కౌంటర్లలో కొనుగోళ్లు చోటు చేసుకున్నాయి. దీంతో స్టాక్‌ 3.36 శాతం లాభపడింది. ఏషియన్‌ పెయింట్స్, వేదాంత లిమిటెడ్, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్‌ సైతం 2 శాతం వరకు పెరిగాయి.

టాటా స్టీల్, కోల్‌ ఇండియా, ఎంఅండ్‌ఎం, మారుతి సుజుకి, యాక్సిస్‌ బ్యాంకు, పవర్‌గ్రిడ్, ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్, సన్‌ ఫార్మా, ఐటీసీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎస్‌బీఐ 2% వరకు లాభపడ్డాయి. అదే సమయంలో టీసీఎస్, ఆర్‌ఐఎల్, కోటక్‌ బ్యాంకు, హెచ్‌యూఎల్‌ అమ్మకాల కారణంగా నష్టపోయాయి. ఆటోమొబైల్‌ స్టాక్స్‌ రెండో రోజూ దిగజారాయి. హీరో మోటో 1.97%, బజాజ్‌ ఆటో 1.4%, కోటక్‌ బ్యాంకు 1.71% తగ్గాయి.


వెలుగులో సిమెంట్‌ స్టాక్స్‌
సిమెంట్‌ స్టాక్స్‌లోనూ భారీగా కొనుగోళ్లు జరిగాయి. ఏసీసీ అంచనాలకు మించి జూన్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించడం ప్రధానంగా సానుకూలతకు దారితీసింది. ఏసీసీ 13 శాతం, ఇండియా సిమెంట్స్‌ 9.35 శాతం, అంబుజా సిమెంట్స్, దాల్మియా భారత్‌ సిమెంట్, బిర్లా కార్పొరేషన్‌ 7.50 శాతం వరకు పెరిగాయి. గ్రాసిమ్‌ 8.34 శాతం, జేకే సిమెంట్‌ 2.53 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 3.30 శాతం, శ్రీ సిమెంట్‌ 5.53 శాతం మేర లాభపడ్డాయి.

లిక్కర్‌స్టాక్స్‌ రాడికో ఖైతాన్, యునైటెడ్‌ స్పిరిట్స్‌ కూడా పెరిగాయి. మెటల్‌ సూచీ అత్యధికంగా 2.87 శాతం లాభపడగా, రియాలిటీ 2.80 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ 2.56 శాతం, ఇన్‌ఫ్రా 2.22 శాతం చొప్పున పెరిగాయి. ఆసియాలోని షాంఘై, హాంగ్‌కాంగ్, జపాన్‌ మార్కెట్లు కూడా లాభపడ్డాయి.

మరిన్ని వార్తలు