తీవ్ర హెచ్చుతగ్గుల్లో సూచీలు ఫెడ్‌ రేట్ల పెంపుతో నష్టాలు

16 Dec, 2016 01:03 IST|Sakshi
తీవ్ర హెచ్చుతగ్గుల్లో సూచీలు ఫెడ్‌ రేట్ల పెంపుతో నష్టాలు

330 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌
84 పాయింట్ల నష్టంతో 26,519 వద్ద ముగింపు
29 పాయింట్ల నష్టంతో 8,154కు నిఫ్టీ   


అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఫండ్‌ రేట్లను పెంచటంతో గురువారం స్టాక్‌మార్కెట్లు ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. వచ్చే ఏడాది మూడు రేట్ల పెంపులుండొచ్చన్న ఫెడ్‌ సంకేతాల కారణంగా లాభ, నష్టాల మధ్యదోబూచులాడిన సెన్సెక్స్‌... చివరకు 84 పాయింట్లు నష్టంతో 26,519 పాయింట్ల వద్ద, నిఫ్టీ 29 పాయింట్లు నష్టపోయి 8,154 పాయింట్ల వద్ద  ముగిశాయి. ఎఫ్‌ఎంసీజీ, టెలికం, వాహన షేర్లలో అమ్మకాల ఒత్తిడికనిపించింది.  

లాభ, నష్టాల మధ్య...: డాలర్‌తో రూపాయి మారకం 40 పైసలు క్షీణించి 67.83 వద్ద ముగియడం ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండటంతో స్టాక్‌ సూచీలు ఆద్యంతంహెచ్చుతగ్గులకు గురయ్యాయి. సెన్సెక్స్‌ నష్టాల్లో ప్రారంభమైంది. అమ్మకాల జోరు కారణంగా మరింత నష్టాల్లోకి జారిపోయి..ఒక దశలో 200 పాయింట్లు నష్టపోయింది. తర్వాత కోలుకొని 135 పాయింట్లు లాభపడింది.మొత్తంగా 330 పాయింట్ల రేంజ్‌లో కదలాడి చివరకు 84 పాయింట్ల పతనంతో 26,519 వద్ద ముగిసింది. నిఫ్టీ 8,122–8,226 పాయింట్ల కనిష్ట, గరిష్ట స్థాయి ల మధ్య కదలాడి చివరకు  29 పాయింట్ల నష్టంతో 8,154 వద్ద ముగిసింది.

అమెరికాకు విదేశీ నిధులు..
రేట్ల పెంపు అనంతరం అమెరికా బాండ్ల రాబడులు పెరిగాయని, డాలర్‌ బలపడిందని జియోజిత్‌ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ హెడ్‌(రీసెర్చ్‌) వినోద్‌ నాయర్‌ పేర్కొన్నారు. ఇది భారత్‌ వంటి  వర్థమానమార్కెట్లకు ప్రతికూలమన్నారు. అమెరికాలో అధిక వడ్డీ రేట్ల కారణంగా వర్థమాన దేశాల నుంచి విదేశీ పెట్టుబడులు అమెరికాకు తరలిపోతాయనే ఆందోళన పెరిగిందని బీఎన్‌పీ పారిబా మ్యూచువల్‌ ఫండ్‌ సీనియర్‌ ఫండ్‌మేనేజర్‌ కార్తీక్‌రాజ్‌ లక్ష్మణన్‌ పేర్కొన్నారు.

నవంబర్లో ఎగుమతులు ప్లస్‌లోనే! 
న్యూఢిల్లీ: ఒకవంక దిగుమతులు కూడా భారీగా పెరుగుతండగా... దేశీ ఎగుమతులు వరుసగా మూడవనెల కూడా వృద్ధి చెంది ప్రభుత్వానికి కాస్త ఉపశమనాన్నిచ్చాయి. నవంబర్లో ఇవి 2.29% వృద్ధి చెంది 20 బిలియన్‌డాలర్లకు చేరాయి. పెట్రోలియం, ఇంజనీరింగ్‌ ఉత్పత్తులు మొత్తం గణాంకాలను ప్లస్‌లో ఉంచాయి. ఇంజనీరింగ్‌ ఉత్పత్తుల ఎగుమతులు 14.10 శాతం పెరిగ్గా, పెట్రోలియం ఉత్పత్తులు 5.73% పెరిగాయి.  కెమికల్స్‌విభాగంలో ఎగుమతులు 8.3% ఎగశాయి.

మరోవంక దిగుమతులు కూడా నంబర్లో 10.44% ఎగసి 33 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఎగుమతులు–దిగుమతులకు మధ్య వ్యత్యాసం... వాణిజ్య లోటు రెండేళ్ల గరిష్ట స్థాయిలో13 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. దిగుమతుల్లో చమురు వాటా 89% పెరిగి, 6.83 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. ఇతర దిగుమతుల వాటా 11.7% పెరిగి 26.18 బిలియన్‌ డాలర్లుగా ఉంది. కాగా నవంబర్‌లో పసిడిదిగుమతులు భారీగా 23.24% పెరిగి 4.36 బిలియన్‌ డాలర్లకు చేరటం గమనార్హం.

మరిన్ని వార్తలు