అమెరికా ఎన్నికల టెన్షన్-374 పాయింట్లు డౌన్

27 Sep, 2016 01:02 IST|Sakshi
అమెరికా ఎన్నికల టెన్షన్-374 పాయింట్లు డౌన్

అధ్యక్ష అభ్యర్థుల చర్చాగోష్టిపై ఇన్వెస్టర్ల దృష్టి
నెలరోజుల కనిష్టస్థాయికి సెన్సెక్స్ 
నిఫ్టీ 109 పాయింట్లు పతనం

 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపుఓటములు నిర్ణయించే అభ్యర్దుల తొలి చర్చాగోష్టి జరగనున్న నేపథ్యంలో సోమవారం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు పతనమయ్యాయి. ప్రపంచ ట్రెండ్‌కు అనుగుణంగా భారత్ బీఎస్‌ఈ సెన్సెక్స్ 374 పాయింట్లు క్షీణించి దాదాపు నెలరోజుల కనిష్టస్థాయి 28,294 పాయింట్ల వద్ద ముగి సింది. ఆగస్టు 29 తర్వాత సెన్సెక్స్‌కు ఇదే కనిష్ట ముగింపు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 109 పాయింట్ల తగ్గుదలతో 8,723 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.

ట్రంప్‌ది పైచేయి అవుతుందన్న అంచనాలు
అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్‌లో జరిగే ఎన్నికల నేపథ్యంలో డెమోక్రాటిక్ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌ల మధ్య సోమవారం రాత్రి (భారత్ కాలమాన ప్రకారం మంగళవారం ఉదయం) చర్చాగోష్టి కార్యక్రమం జరుగుతుంది. ఎన్నికలకు ముందు ఇటువంటి చర్చాగోష్టిలు మూడు జరుగుతాయి. ఈ సందర్భంగా అభ్యర్ధులిరువురి అభిప్రాయాలే 50% మంది అమెరికన్ల ఓటింగ్ సరళిని నిర్దేశిస్తుందని అంచనా. డోనాల్డ్ ట్రంప్ ఇప్పటివరకూ చేసిన ప్రకటనలను బట్టి, ఆయన గెలిస్తే ఈక్విటీ మార్కెట్లు పతనమవుతాయని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. చర్చాగోష్టిలో ట్రంప్‌ది పైచేయి కావొచ్చన్న అంచనాలతో తాజా మార్కెట్ పతనం జరిగిందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

 ఒపెక్ సమావేశంపైనా దృష్టి..
చమురు ధరలు ఇటీవల తగ్గిన కారణంగా ఉత్పత్తిని తగ్గించే అంశమై ఒపెక్ సభ్యదేశాల మధ్య ఒప్పందం కుదురుతుందా, లేదా అనే అంశాన్ని కూడా ఇన్వెస్టర్లు సునిశితంగా గమనిస్తున్నారని, ఇది కూడా మార్కెట్ తాజా క్షీణతకు ఒక కారణమని విశ్లేషకులు చెప్పారు. అల్జిరియాలో సోమవారం మొదలైన ఒపెక్ సదస్సు బుధవారం ముగుస్తుంది.

 ఓఎన్‌జీసీ 4 శాతం డౌన్... రెండేళ్ల గరిష్టస్థాయికి ఆర్‌ఐఎల్..
సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా ఓఎన్‌జీసీ షేరు 3.84% పతనమై రూ. 250 వద్ద ముగిసింది. టాటా మోటార్స్ 3.22% క్షీణించి రూ. 535 వద్ద క్లోజయ్యింది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్‌టీపీసీ, గెయిల్, భారతి ఎయిర్‌టెల్, ఐటీసీ, మహింద్రా, హీరో మోటో కార్ప్, హిందుస్తాన్ యూనీలీవర్‌లు 1-3 శాతం మధ్య తగ్గాయి. మరోవైపు కోల్ ఇండియా 1.2 శాతం పెరిగింది. ట్రేడింగ్ ఆరంభంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) షేరు 2 శాతం వరకూ పెరిగి రెండు సంవత్సరాల గరిష్టస్థాయి రూ. 1,129 వరకూ చేరినప్పటికీ, ముగింపులో చాలావరకూ లాభాల్ని కోల్పోయింది. చివరకు 0.58 శాతం పెరుగుదలతో రూ. 1,109 వద్ద ముగిసింది.

 జపాన్ నుంచి అమెరికా వరకూ..: అమెరికా ఎన్నికల ప్రకంపనలు ఇటు జపాన్ నుంచి అటు అమెరికా మార్కెట్ల వరకూ వ్యాపిం చాయి. జపాన్ నికాయ్ సూచి 1.25 శాతం పడిపోయింది. చైనా షాంఘై సూచి 1.76%, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ ఇండెక్స్ 1.58% చొప్పున తగ్గాయి. యూరప్ ప్రధాన మార్కెట్లయిన జర్మనీ డాక్స్ సూచి 2.2%, బ్రిటన్ ఎఫ్‌టీఎస్‌ఈ సూచి 1.32%, ఫ్రాన్స్ కాక్ ఇండెక్స్ 1.8% చొప్పున క్షీణించాయి. కడపటి సమాచారం అందేసరికి అమెరికా డోజోన్స్ ఇండస్ట్రియల్ ఏవరేజ్ 0.8%, టెక్నాలజీ ఇండెక్స్ నాస్‌డాక్ 0.8% క్షీణతతో ట్రేడవుతున్నాయి.

మరిన్ని వార్తలు