10,900 పాయింట్ల పైకి నిఫ్టీ

18 Jan, 2019 04:57 IST|Sakshi

మిశ్రమంగా అంతర్జాతీయ సంకేతాలు

తగ్గిన చమురు ధరలు

మూడో రోజూ లాభాల్లోనే మార్కెట్‌

53 పాయింట్లు పెరిగి 36,374కు సెన్సెక్స్‌

15 పాయింట్ల లాభంతో 10,905కు నిఫ్టీ  

అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ, షేర్ల వారీ కదలికల కారణంగా గురువారం స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. స్టాక్‌ సూచీలు వరుసగా మూడో రోజూ లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10,900 పాయింట్లపైకి ఎగబాకింది. 15 పాయింట్లు పెరిగి 10,905 పాయింట్లకు చేరింది.  300 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌ చివరకు 53 పాయింట్ల లాభంతో 36,374 పాయింట్ల వద్ద ముగిసింది. మరో మూడు వారాల్లో మధ్యంతర బడ్జెట్‌ రానుండటం, కీలక కంపెనీల క్యూ3 ఫలితాల నేపథ్యంలో అనిశ్చితి నెలకొనడంతో స్టాక్‌ సూచీలు లాభ, నష్టాల మధ్య దోబూచులాడాయి. ఇటీవల పుంజుకున్న ముడి చమురు ధరలు 1% మేర పతనం కావడం, గత ఐదు రోజులుగా పతనమవుతున్న రూపాయి పుంజుకోవడం  సానుకూల ప్రభావం చూపించాయి.  ఫార్మా, ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లు నష్టపోగా, ప్రైవేట్‌ బ్యాంక్, ఐటీ, వాహన షేర్లు లాభపడ్డాయి.  

297 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌...
సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. మధ్యాహ్నం వరకూ లాభాల్లోనే కొనసాగింది. ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. చివరి గంటలో కొనుగోళ్ల మద్దతులో మళ్లీ లాభాల్లోకి వచ్చింది. ఒక దశలో 147 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ మరొక దశలో 150 పాయింట్లవ వరకూ పతనమైంది. మొత్తం మీద రోజంతా 297 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. కొరియా సూచీ మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. యూరప్‌ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ముగిశాయి.  

► క్యూ3 ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలతో యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్‌ లాభపడింది. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.679ను తాకిన ఈ షేర్‌ చివరకు 2 శాతం లాభంతో రూ.676 వద్ద ముగిసింది. గత రెండు వారాల్లో ఈ షేర్‌ 12 శాతం పెరిగింది.  

► సన్‌ ఫార్మా షేర్‌ 5.7% నష్టపోయి రూ.427 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే.  

► ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్, హిందుస్తాన్‌ యూనిలివర్‌ షేర్లు చెరో 1 శాతం నష్టపోయాయి. మార్కెట్‌  ముగిసిన తర్వాత ఈ రెండు కంపెనీల ఫలితాలు వెలువడ్డాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు