జోష్‌నిచ్చిన ఆర్థిక సర్వే

30 Jan, 2018 01:32 IST|Sakshi

ఇంట్రాడేలో, ముగింపులో సూచీలకొత్త రికార్డ్‌లు

233 పాయింట్ల లాభంతో 36,283కు సెన్సెక్స్‌

61 పాయింట్లు పెరిగి 11,130కు నిఫ్టీ  

ఆర్థిక సర్వే వృద్ధి అంచనాలు ఆశావహంగా ఉండటంతో స్టాక్‌ మార్కెట్‌ రికార్డ్‌ల ర్యాలీ ఒక్క రోజు విరామం తర్వాత మళ్లీ కొనసాగింది. విదేశీ నిధులు వరద కొనసాగుతుండడం, కంపెనీల క్యూ3 ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండడం, సానుకూల అంతర్జాతీయ సంకేతాలు.. ఇవన్నీ స్టాక్‌మార్కెట్‌ను లాభాల్లో కొనసాగించాయి.

స్టాక్‌ సూచీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్‌లను సృష్టించాయి. జీఎస్‌టీ  వసూళ్లు మెరుగుపడడం, వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రణాళిక ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 233 పాయింట్ల లాభంతో 36,283 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 61 పాయింట్ల లాభంతో 11,130 పాయింట్ల వద్ద ముగిశాయి.

ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 394 పాయింట్ల లాభంతో 36,444 పాయింట్ల, నిఫ్టీ 102 పాయింట్ల లాభంతో 11,172 పాయింట్ల గరిష్ట స్థాయిలను తాకాయి. ఇవి ఆయా సూచీలకు జీవిత కాల గరిష్ట స్థాయిలు. ఆ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి.  ఆర్థిక సంస్కరణలు వెన్నుదన్నుగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ది మరింత పటిష్టమవుతుందని ఆర్థిక సర్వే పేర్కొంది.

అగ్రస్థానంలో టీసీఎస్‌..
టీసీఎస్‌ షేర్‌ 2.4 శాతం లాభంతో రూ.3,195 వద్ద  ముగిసింది. టీసీఎస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 6.11 లక్షల కోట్లకు ఎగసింది. దీంతో అత్యధిక మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఉన్న భారత కంపెనీగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ను తోసిరాజని టీసీఎస్‌ అగ్రస్థానానికి ఎగబాకింది.

బడ్జెట్‌పై అంచనాలతోనే...
మంచి బడ్జెట్‌ రాగలదని మార్కెట్‌ అంచనా వేస్తున్నట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. ఇండెక్స్‌ ప్రధాన కంపెనీలు మంచి ఫలితాలు వెల్లడించడంతో మార్కెట్‌ కొత్త గరిష్టాలకు చేరుతోందని వివరించారు. వేల్యుయేషన్లు అధికంగా ఉండటంతో ఇన్వెస్టర్లు మిడ్, స్మాల్‌ క్యాప్‌ షేర్ల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

మారుతీ జోరు..
ఇక నుంచి కొత్త మోడళ్లపై తక్కువ రాయల్టీ చెల్లించగలమని ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా మారుతీ సుజుకీ పేర్కొనడంతో ఆ షేర్‌ 4 శాతం వరకూ పెరిగి రూ.9,634 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్‌ ఇదే.  


సూచీ       ఇంట్రాడే    ముగింపు
సెన్సెక్స్‌      36,444    36,283
నిఫ్టీ          11,172    11,130

మరిన్ని వార్తలు