బ్యాంకింగ్ షేర్ల ర్యాలీ

22 Nov, 2014 01:24 IST|Sakshi

 దేశీ బ్యాంకింగ్ రంగానికి ఊపునిస్తూ కొటక్ మహీంద్రా, ఐఎన్‌జీ వైశ్యా మధ్య జరిగిన విలీన ఒప్పందం ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చింది. మరోవైపు చైనాసహా, యూరోపియన్ దేశాలు నామమాత్ర వడ్డీ రేట్లకే కట్టుబడటంతోపాటు సహాయక ప్యాకేజీలకు తెరలేపడం సెంటిమెంట్‌కు బలాన్నిచ్చింది. దీంతో మరిన్ని విదేశీ పెట్టుబడులకు అవకాశముంటుందన్న అంచనాలు దేశీ స్టాక్ మార్కెట్లను మళ్లీ కొత్త రికార్డులవైపు పరుగు పెట్టించాయి. వెరసి 75 పాయింట్లు ఎగసిన నిఫ్టీ 8,477 వద్ద నిలవగా, సెన్సెక్స్ 267 పాయింట్లు జంప్‌చేసి 28,335 వద్ద ముగిసింది.

ఇంట్రాడేలోనూ సెన్సెక్స్ గరిష్టంగా 28,361కు చేరగా, నిఫ్టీ 8,490ను తాకింది. తద్వారా మార్కెట్ చరిత్రలో తొలిసారి నిఫ్టీ 8,500, సెన్సెక్స్ 28,500 పాయింట్ల మైలురాళ్ల సమీపానికి చేరాయి. బీఎస్‌ఈలో బ్యాంకింగ్ రంగం అత్యధికంగా 2.5% ఎగసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం మరిన్ని సంస్కరణలకు తెరలేపుతుందన్న అంచనాలు కూడా కొనుగోళ్లకు కారణమైనట్లు నిపుణులు పేర్కొన్నారు.

 మరిన్ని విశేషాలివీ....
 ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్‌ను విలీనం చేసుకోనున్న కొటక్ మహీంద్రా షేరు మరోసారి 4% పుంజుకోవడం ద్వారా రూ. 1,200 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 9% జంప్‌చేసి రూ. 1,261కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకావడం విశేషం!
 బ్యాంకింగ్ దిగ్గజాలు హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సి స్, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, పీఎన్‌బీ, ఫెడరల్ బ్యాంక్ 1.5-4% మధ్య పురోగమించాయి. ఈ బాటలో సౌత్ ఇండియా బ్యాంక్, కర్టాటక బ్యాంక్, యస్ బ్యాంక్ సైతం 5.5-4% మధ్య ఎగశాయి.
 గతంలో నిలిపివేసిన కేటాయింపులను విడుదల చేసేందుకు రైల్వే బోర్డు నిర్ణయించడంతో రైలు షేర్లు లాభాల పరుగందుకున్నాయి. సిమ్కో 20%, టిటాగఢ్ వ్యాగన్స్ 11%, టెక్స్‌మాకో 5%, కాళిందీ రైల్ 4% చొప్పున దూసుకెళ్లాయి.
 మరిన్ని విలీనాలకు అవకాశముందన్న అంచనాలతో ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ షేర్లు పుంజుకుంటే, అవసరమైనమేర పెట్టుబడులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించడంతో ప్రభుత్వ బ్యాంకింగ్ షేర్లు పురోగమించాయి. ఇక ఎఫ్‌ఐఐల తాజా పెట్టుబడులకు ఆర్‌బీఐ అనుమతించడంతో యస్ బ్యాంక్ షేరు ఊపందుకోగా, రూ. 10 ముఖవిలువగల షేరుని రూ. 2 ముఖ విలుగల 5 షేర్లుగా విభజించేందుకు డిసెంబర్ 5ను రికార్డు డేట్‌గా ప్రకటించడంతో ఐసీఐసీఐ బ్యాంక్ జంప్ చేసింది. యస్ బ్యాంక్‌లో పరిమితికంటే దిగువకు ఎఫ్‌ఐఐల పెట్టుబడులు చేరుకోవడంతో తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది.

 స్పైస్‌జెట్ షేరు జూమ్
 స్పైస్‌జెట్‌లో ప్రమోటర్లకున్న వాటాను పూర్తిగా లేదా కొంతమేర విక్రయించనున్నట్లు మీడియాలో వార్తలు వెలువడ్డాయి. కంపెనీలో సన్ గ్రూప్‌నకు 53.4% వాటా ఉంది. అయితే స్పైస్‌జెట్ ప్రమోటర్ కళానిధి మారన్ ఎంతమేర వాటా విక్రయించేదీ స్పష్టంకాలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ వార్తల నేపథ్యంలో స్పైస్‌జెట్ షేరు 15% జంప్‌చేసింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా