రేట్ల పెంపు భయాలు...

5 Jun, 2018 00:47 IST|Sakshi

రేపు ఆర్‌బీఐ నిర్ణయం

వడ్డీరేట్లతో ప్రభావితమయ్యే షేర్లకు నష్టాలు

215 పాయింట్లు క్షీణించి 35,012కు సెన్సెక్స్‌

68 పాయింట్ల పతనంతో 10,629కు నిఫ్టీ  

ఆర్‌బీఐ వడ్డీరేట్లను పెంచవచ్చన్న ఆందోళనల కారణంగా ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో సోమవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయింది. వడ్డీ రేట్ల ప్రభావిత బ్యాంక్, ఆర్థిక రంగ, రియల్టీ కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 215 పాయింట్ల నష్టంతో 35,012 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 68 పాయింట్లు పతనమై 10,629 పాయింట్ల వద్ద ముగిశాయి.

బ్యాంక్‌ షేర్ల పతనం కారణంగా నిఫ్టీ బ్యాంక్‌ సూచీ 435 పాయింట్లు నష్టపోయి 26,258 పాయింట్ల వద్ద ముగిసింది. ఆర్‌బీఐ పాలసీ సమావేశం సోమవారం ఆరంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశం అనంతరం  బుధవారం ఆర్‌బీఐ రేట్లపై తన నిర్ణయాన్ని వెల్లడిస్తుంది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆర్‌బీఐ రేట్లను పెంచడానికి సిద్ధమవుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వడ్డీరేట్ల పెంపు భయాలు మార్కెట్‌ను పడగొట్టాయి.

573 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌
సానుకూల అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. ఆరంభంలోనే కొనుగోళ్ల జోరుతో 328 పాయింట్ల లాభంతో 35,556 పాయింట్ల వద్ద ఇంట్రాడేలో గరిష్ట స్థాయిని తాకింది. వడ్డీ రేట్ల పెంపు భయాలకు తోడు, పెద్ద కంపెనీల షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో నష్టాల్లోకి జారిపోయింది. 245 పాయింట్ల నష్టంతో 34,982 పాయింట్ల వద్ద ఇంట్రాడేలో కనిష్ట స్థాయిని తాకింది.

మొత్తం మీద రోజంతా 573 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 74 పాయింట్లు లాభపడగా, మరో దశలో 78 పాయింట్లు పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉన్నప్పటికీ, ఆర్‌బీఐ రేట్లను పెంచుతుందనే అంచనాలతో మన మార్కెట్‌ ఆరంభ లాభాలను కోల్పోయి నష్టాల్లో ముగిసిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌  చెప్పారు.

డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ 3 శాతం అప్‌..
డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం ప్లాంట్‌ తనిఖీని అమెరికా ఎఫ్‌డీఏ పూర్తి చేయడంతో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్‌ 3 శాతం లాభంతో రూ.1,997 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్‌  ఇదే. సెయిల్‌ రేటింగ్‌ను అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ, సిటీ అమ్మొచ్చు నుంచి తటస్థానికి మార్చడం, టార్గెట్‌ ధరను రూ.50 నుంచి రూ.83కు పెంచడంతో సెయిల్‌ షేర్‌ 4.6 శాతం ఎగసి రూ.75 వద్ద ముగిసింది.

ఎగసి పడిన హెచ్‌డీఎఫ్‌సీ...
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్‌లో లాభాల స్వీకరణ జరగడంతో ఈ షేర్‌ 3 శాతం నష్టపోయి రూ.2,047  వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే. ఇంట్రాడేలో రూ.2,170 వద్ద ఈ షేర్‌ ఆల్‌ టైమ్‌ హైని తాకింది. తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో ఆల్‌ టైమ్‌ హై నుంచి 4.6 శాతం నష్టపోయింది. సెన్సెక్స్‌ 215 పాయింట్ల నష్టంలో హెచ్‌డీఎఫ్‌సీ షేర్‌ పతనం సగానికి మించి (130 పాయింట్లు) ఉంది.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఐడీబీఐ బ్యాంక్, సెంట్రల్‌ బ్యాంక్, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌లు విలీనం కానున్నాయన్న వార్తలతో ఈ బ్యాంక్‌లన్నీ  1.4 శాతం నుంచి 4.5 శాతం రేంజ్‌లో పతనమయ్యాయి. రూ.312 కోట్ల ఓఎన్‌జీసీ కాంట్రాక్ట్‌ను దీప్‌ ఇండస్ట్రీస్‌కు అక్రమంగా కేటాయించిన కేసులో ఓఎన్‌జీసీ తాజా, మాజీ అధికారులపై సీబీఐ చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. దీంతో దీప్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ 20 శాతం పతనమై తాజా ఏడాది కనిష్ట స్థాయి, రూ.107 వద్ద ముగిసింది. ఈ కాంట్రాక్ట్‌ కారణంగా ఓఎన్‌జీసీకి రూ.80 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా.

>
మరిన్ని వార్తలు