వెలుగులో బ్యాంకింగ్‌ షేర్లు

17 Jan, 2017 01:18 IST|Sakshi
వెలుగులో బ్యాంకింగ్‌ షేర్లు

50 పాయింట్ల లాభంతో 27,288కు సెన్సెక్స్‌
12 పాయింట్ల లాభంతో 8,413కు నిఫ్టీ


ఆర్థిక రంగ షేర్ల జోరుతో సోమవారం స్టాక్‌  మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నప్పటికీ, స్టాక్‌ సూచీలు రెండు నెలల గరిష్ట స్థాయిలో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 50 పాయింట్ల లాభంతో 27,288 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 8,413 పాయింట్ల వద్ద ముగిశాయి. లోహ, రియల్టీ, బ్యాంక్, ఆర్థిక రంగ,  ఐటీ షేర్లు నష్టపోయాయి.

మార్కెట్‌ ముందుకే.. పెద్ద కరెన్సీ నోట్ల రద్దుతో కుదేలైన కంపెనీలకు ఉపశమనం కలిగించడానికి రానున్న బడ్జెట్లో కార్పొరేట్‌ ట్యాక్స్‌ రేట్లను తగ్గించే అవకాశాలున్నాయన్న వార్తలతో స్టాక్‌ సూచీలకు లాభాలు వచ్చాయి.    కంపెనీల క్యూ3 ఫలితాలు ఆశావహంగా ఉండడం ఒకింత సానుకూల ప్రభావం చూపిందని జియోజిత్‌ బీఎన్‌పీ పారిబా  ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ హెడ్‌ (రీసెర్చ్‌) వినోద్‌ నాయర్‌ చెప్పారు. జీఎస్‌టీ మండలి సమావేశం ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉంటే, మార్కెట్‌ ముందుకేనని పేర్కొన్నారు.      

లాభాల్లో బ్యాంక్‌ షేర్లు..
ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన కేటాయింపుల ప్రణాళికను ఆర్థిక శాఖ ఖరారు చేయనున్నదన్న వార్తలతో బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. బడ్జెట్లో ప్రతిపాదించిన రూ.25,000 కోట్ల కంటే అధికంగా బ్యాంక్‌లకు ప్రభుత్వం నిధులందించనున్నదని సమాచారం. పంజాబ్‌ నేషనల్‌  బ్యాంక్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యాక్సిస్‌ బ్యాంక్‌  1–3 శాతం రేంజ్‌లో లాభపడ్డాయి.

మరిన్ని వార్తలు