‘రికార్డ్‌’తో వీడ్కోలు

30 Dec, 2017 01:29 IST|Sakshi

గరిష్ట స్థాయిల వద్ద ముగిసిన స్టాక్‌  సూచీలు

ద్రవ్యలోటును లెక్కచేయని ఇన్వెస్టర్లు

209 పాయింట్ల లాభంతో 34,057కు సెన్సెక్స్‌

53 పాయింట్లు అప్‌; 10,531కు నిఫ్టీ

స్టాక్‌ మార్కెట్‌ మంచి లాభాలతో ఈ ఏడాదికి ఘనంగా వీడ్కోలు పలికింది. కొత్త సంవత్సరం (2018) తొలి నెల జనవరి సిరీస్‌ ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ తొలి రోజు కూడా అయిన శుక్రవారం... స్టాక్‌ సూచీలు రికార్డ్‌ స్థాయిలో ముగిసి ఈ ఏడాదికి మంచి ముగింపునిచ్చాయి. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నప్పటికీ, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 209 పాయింట్ల లాభంతో 34,057 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 53 పాయింట్ల లాభంతో 10,531 పాయింట్ల వద్ద ముగిశాయి. విద్యుత్తు, ఐటీ, వాహన, మౌలిక రంగ షేర్లలో కొనుగోళ్లు జోరుగా జరిగాయి. ఇక వారం పరంగా చూస్తే, వరుసగా నాలుగో వారమూ స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్‌ 117 పాయింట్లు, నిఫ్టీ 38 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

సెబీ సంస్కరణలకు జై...
క్యూ3లో కంపెనీలు మంచి ఫలితాలనే ప్రకటిస్తాయన్న అంచనాలు, డాలర్‌తో రూపాయి మారకం బలపడడం సానుకూల ప్రభావం చూపాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–నవంబర్‌ కాలానికే ద్రవ్యలోటు రూ.6,12,000 కోట్లకు(ఈ ఏడాది బడ్జెట్‌ అంచనాల్లో ఇది 112 శాతానికి సమానం, ఏడాది మొత్తానికి రూ.5.46 లక్షల కోట్లు ద్రవ్యలోటునే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది) పెరిగినా ఇన్వెస్టర్లు పెద్దగా పట్టించుకోలేదు.

గురువారం జరిగిన సెబీ డైరెక్టర్ల  సమావేశం తీసుకున్న సానుకూల సంస్కరణలు, బడ్జెట్‌పై అంచనాలు స్టాక్‌ సూచీలను లాభాల వైపు నడిపించాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ మార్కెట్‌ స్ట్రాటజిస్ట్‌ ఆనంద్‌ జేమ్స్‌ చెప్పారు. కేంద్ర బడ్జెట్, రానున్న సంస్కరణల కారణంగా ఇక ఇన్వెస్టర్లు రంగాల వారీ షేర్లకు ప్రాధాన్యత ఇస్తారని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు.

ఆగని ఆర్‌కామ్‌ పరుగు..
వరుసగా నాలుగో రోజూ రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ షేర్‌ లాభాల్లోనే ముగిసింది. ఆర్‌కామ్‌ టెలికం ఆస్తులను రిలయన్స్‌ జియో కొనుగోలు చేస్తుందన్న వార్తల కారణంగా ఈ షేర్‌ ఇంట్రాడేలో 35 శాతం లాభపడి తాజా ఏడాది గరిష్ట స్థాయి, రూ.42ను తాకింది. చివరకు 17 శాతం లాభంతో రూ. 32వద్ద ముగిసింది. గత నాలుగు రోజుల్లో ఈ షేర్‌ 122%, గత ఎనిమిది ట్రేడింగ్‌ సెషన్లలో ఈ షేర్‌ రెట్టింపునకు పైగా పెరిగింది. ఈ నెల 22న రూ.16.31గా ఉన్న ఈ షేర్‌ 156%కి పైగా లాభపడింది. మార్కెట్‌ క్యాప్‌ రూ.5,507 కోట్లు పెరిగి, రూ.10,017 కోట్లకు చేరింది.

వాహన షేర్ల హవా
టాటా మోటార్స్‌ 3 శాతం లాభపడి రూ.431 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే. ఈ నెల వాహన విక్రయ గణాంకాలను వచ్చే నెల 1న (సోమవారం) వాహన కంపెనీలు వెల్లడించనున్న నేపథ్యంలో టాటా మోటార్స్‌తో పాటు ఐషర్‌ మోటార్స్, మారుతీ సుజుకీ, హీరో మోటొకార్ప్, బజాజ్‌ ఆటో 1–3 శాతం రేంజ్‌లో పెరిగాయి. సెన్సెక్స్‌లో 24 షేర్లు లాభాల్లో ముగిశాయి. 

యాక్సిస్‌ బ్యాంక్‌ టీసీఎస్, అదానీ పోర్ట్స్, విప్రో, ఏషియన్‌ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, హిందుస్తాన్‌ యూనిలివర్‌ షేర్లు 1–3% రేంజ్‌లో పెరిగాయి. బ్రెంట్‌ ముడి చమురు ధర బ్యారెల్‌కు 66 డాలర్లపైన ట్రేడవుతుండటంతో ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ షేర్లు–హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీలు 1–2 శాతం రేంజ్‌లో నష్టపోయాయి. డేటెడ్‌ సెక్యూరిటీల ద్వారా రూ.50,000 కోట్లు సమీకరించనున్నామని ప్రభుత్వం ప్రకటించడంతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లు 3 శాతం వరకూ పడిపోయాయి.


రూ.45.50 కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద...
ఈ ఏడాది సెన్సెక్స్‌ 7,430 పాయింట్లు (28 శాతం) లాభపడింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.45,50,867 కోట్లు పెరిగి రూ.1,51,73,867 కోట్లకు చేరింది.  

మరిన్ని వార్తలు