బుల్ చల్!

7 Jun, 2014 00:35 IST|Sakshi
బుల్ చల్!

సెన్సెక్స్, నిఫ్టీ కొత్త ఆల్‌టైమ్ రికార్డులు
 
మరో 377 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్; 25,396 వద్ద ముగింపు
నిఫ్టీ కూడా 109 పాయింట్లు అప్; 7,583 పాయింట్ల వద్ద క్లోజ్
ఈ వారంలో 1,179 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్...
ఆర్థిక వ్యవస్థను మోడీ సర్కారు వేగంగా గాడిలోపెడుతుందన్న ఆశలు..
విదేశీ పెట్టుబడుల వెల్లువకు ఇదే ప్రధాన కారణం...
ఈసీబీ వడ్డీరేట్ల కోత ప్రకటన ఎఫెక్ట్...

 
దేశీ స్టాక్ మార్కెట్లు చెంగుచెంగున రోజుకో కొత్త శిఖరాలకు దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కూడా శుక్రవారం కొత్త ఆల్‌టైమ్ గరిష్టాలకు దూసుకెళ్లాయి. అంతేకాదు ముగింపులో కూడా కొత్త రికార్డులను సృష్టించాయి. నైరుతి రుతుపవనాల రాకతోపాటు వర్షాలు బాగుంటాయన్న అంచనాలు, సహజ వాయువు ధరల పెంపునకు త్వరలోనే కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందన్న వార్తలు సూచీలను పరుగులు పెట్టించాయి. దీంతో చమురు-గ్యాస్ షేర్లు సర్రున పైకి లేచాయి. మోడీ ప్రభుత్వం ఆర్థిక, విధాన పరమైన సంస్కరణలకు పూర్తిగా గేట్లు తెరుస్తుందన్న విశ్వాసం పెరుగుతుండటంతో విదేశీ  ఇన్వెస్టర్లు మన మార్కెట్లలోకి మరింత ఉత్సాహంగా క్యూ కడుతున్నారు. దీంతో విదేశీ నిధులు వెల్లువలా వచ్చిపడుతుండటం కూడా సూచీలు దూసుకెళ్లేందుకు దోహదం చేస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు.
 
ముంబై: వరుసగా రెండో రోజు కూడా మార్కెట్లలో దూకుడు కొనసాగింది. గురువారం ఇంట్రాడే, ముగింపులో కొత్త రికార్డులు సృష్టించిన సెన్సెక్స్... శుక్రవారం ఆ జోరును మరింత పెంచింది. క్రితం ముగింపు 25,020 పాయింట్లతో పోలిస్తే 185 పాయింట్ల భారీ లాభంతో 25,205 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. అక్కడినుంచీ ఏ దశలోనూ వెనక్కితిరిగి చూడకుండా సెన్సెక్స్ రయ్య్‌మ్రంటూ పైకి ఎగసింది. 25,419 పాయింట్ల గరిష్టాన్ని తాకి చివరకు 377 పాయింట్ల లాభంతో 25,396 పాయింట్ల వద్ద స్థిరపడింది. గురువారంనాటి కొత్త గరిష్టాన్ని దాటేయడమేకాకుండా ఇంట్రాడే, ముగింపులో సరికొత్త ఆల్‌టై మ్ రికార్డును నమోదు చేసింది. అంతక్రితం గత నెల ఎన్నికల ఫలితాల రోజు(16)న ఇంట్రాడేలో సెన్సెక్స్ 25,375 పాయింట్లను తాకింది. ఇదే ఇప్పటిదాకా ఆల్‌టైమ్ గరిష్టం. ఇప్పుడు దీన్ని అధిగమించడమేకాకుండా ఆపైస్థాయిలోనే ముగియడం విశేషం. నిఫ్టీ విషయానికొస్తే.. 109 పాయింట్లు లాభపడి 7,583 వద్ద క్లోజైంది. మళ్లీ 7,500 పాయింట్ల కీలక స్థాయిని అధిగమించింది. గత నెల 16న ఆల్‌టైమ్ ఇంట్రాడే హై అయిన 7,563 పాయింట్లను కూడా వెనక్కినెట్టి ఇంట్రాడే, క్లోజింగ్‌లో కొత్త రికార్డులను సృష్టించింది.  ఈ వారంలో(5 సెషన్లు) సెన్సెక్స్ మొత్తంమీద 1,179 పాయింట్లు(4.89%) దూసుకెళ్లడం విశేషం.

ఈసీబీ బూస్ట్...

గురువారం పొద్దుపోయాక యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్(ఈసీబీ) ప్రకటించిన వడ్డీరేట్ల కోత నిర్ణయం ప్రపంచ మార్కెట్లకు బూస్ట్ ఇచ్చింది. తీవ్ర మందగమనంలో ఉన్న అక్కడి ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో మన మార్కెట్లలోనూ సెంటిమెంట్‌ను మరింత పెంచేలా చేసిందని కోటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్(ప్రైవేటు క్లయింట్ గ్రూప్) దీపేన్ షా వ్యాఖ్యానించారు.

రిటైల్ ఇన్వెస్టర్లు, ఫండ్స్ ఉత్సాహం...

మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాన్ని తాకడంలో అటు విదేశీ ఇన్వెస్టర్ల నిధుల వెల్లువతోపాటు రిటైల్ ఇన్వెస్టర్లు, ఫండ్స్ ఉత్సాహంగా కొనుగోళ్లు జరపడం కూ డా ప్రధాన పాత్రపోషించిందని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ పేర్కొన్నారు. గురువారం విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,369 కోట్ల నికర కొనుగోళ్లు జరపగా... శుక్రవారం మరో రూ.1,283 కోట్లను స్టాక్స్‌లో నికరంగా కుమ్మరించడం గమనార్హం.

చక్కెర షేర్లలో జోష్...

విదేశాల నుంచి దిగుమతి చేసుకునే చక్కెరపై దిగుమతి సుంకం పెంచడంతోపాటు(ప్రస్తుతం సుంకం 15%గా ఉంది) ఈ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు లభించనున్నాయన్న వార్తలతో చక్కెర స్టాక్స్ రివ్వుమన్నాయి. ధాంపూర్ సుగర్స్ 15.21%, శ్రీరేణుక సుగర్స్ 13.44 శాతం, త్రివేణి ఇంజనీరింగ్ 10%, బజాజ్ హిందుస్థాన్ 9.82%,  బలరామ్‌పూర్ చినీ 7.82% చొప్పున భారీగా లాభపడిన వాటిలో ఉన్నాయి. భారీగా నిల్వలు పేరుకుపోతుండటంతో దేశీయంగా ధరపెరగాలంటే సుంకాన్ని 40 శాతం వరకూ పెంచాలనేది చక్కెర మిల్లుల డిమాండ్. దిగుమతి సుంకం గనుక పెరిగితే చక్కెర ధర 10 శాతంమేర పెరగవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చెరకు రైతుల బకాయిల చెల్లింపు కోసం మిల్లులకు రూ.4,400 కోట్ల మేర వడ్డీరహిత రుణాలిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆహార, వినియోగవ్యవహారాల శాఖ మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ చెప్పడం చక్కెర షేర్ల ర్యాలీకి దోహదం చేసింది.
 

సహజవాయువు ధర పెంపు....

 శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త ఆల్‌టై గరిష్ట రికార్డులు సృష్టించడానికి ప్రధాన కారణం ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు. ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు ఓఎన్‌జీసీ, భారత్ పెట్రోలియం, కెయిర్న్ ఇండియా, గెయిల్  షేర్లు పరుగులు తీసి, అత్యంత గరిష్టస్థాయిలో ముగిశాయి. ఈ ఐదు షేర్లకు సూచీల్లో భారీగా వెయిటేజి వుంది. దేశీయంగా ఉత్పత్తి చేసే సహజవాయువు ధరను 4.2 డాలర్ల నుంచి రెట్టింపు చేసే ప్రతిపాదనను జూలై1 నుంచి ప్రభుత్వం అమలు చేయొచ్చన్న వార్తలు ఈ షేర్లు పెరగడానికి కారణం. ఈ ధర పెంపుపై వచ్చేవారం ప్రధాని మోడీకి అధికారులు ప్రెజెంటేషన్ ఇస్తారని, అటుతర్వాత పెంపు నిర్ణయం లాంఛనప్రాయమేనని సంబంధిత వర్గాలు చెపుతున్నాయి. మోడీ ప్రభుత్వం ఆయిల్ అండ్ గ్యాస్ విభాగంలో సంస్కరణలు కొనసాగిస్తుందన్న అంచనాలు మార్కెట్లో ఉన్నాయి.
 
రుతుపవనాల రాక...

నైరుతి రుతుపవనాలు శుక్రవారం కేరళలో ప్రవేశించాయన్న వార్త మార్కెట్‌ను ఉత్సాహపరిచింది. వీటి రాకలో కొంత జాప్యం జరిగినా, ఎల్‌నినో భయాలు తొలగిపోవడంతో ద్రవ్యోల్బణం తగ్గవచ్చన్న అంచనాలు పెరిగాయి. ద్రవ్యోల్బణం దిగివస్తే వడ్డీ రేట్లు తగ్గిస్తామన్న హామీని రిజర్వుబ్యాంక్ గవర్నర్ రఘురామ్‌రాజన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది వర్షపాతం సగటుస్థాయిలో వుంటుందన్న వాతావరణ శాఖ అంచనాలు వాస్తవరూపం దాలిస్తే రిటైల్ ద్రవ్యోల్బణం 7% దిగువకు వస్తుందన్న ఆశాభావంతో మార్కెట్ వుండటం తాజా ర్యాలీకి మరో కారణం.

బడ్జెట్‌పై సానుకూల అంచనాలు...

 పారిశ్రామిక వర్గాలకు అనుకూలించే బడ్జెట్‌ను మోడీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అందించవచ్చన్న అంచనాలతో వారం రోజుల నుంచి రోజుకో రంగం షేర్లు పెరుగుతూ వస్తున్నాయి. జూలై మొదటివారంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ  తొలి బడ్జెట్ ప్రవేశపెట్టేంతవరకూ మార్కెట్లో ఇదే తరహా ఊపు వుంటుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. కొత్త ప్రభుత్వానికి ఈ బడ్జెట్ లిట్మస్ టెస్ట్‌గా వుంటుందని, అందులో సంస్కరణల గాలి కన్పిస్తే విదేశీ ఫండ్స్ మరింతగా భారత్ మార్కెట్లో నిధులు కుమ్మరిస్తాయని వారు భావిస్తున్నారు.
 
ఆ మూడు అంశాలతో..
 
మోడీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేవలం రెండు వారాలు మాత్రమే లాభాల స్వీకరణతో క్షీణించిన మార్కెట్ తాజాగా వారంరోజుల్లోనే 5 శాతం ర్యాలీ జరిపింది. స్టాక్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త రికార్డుస్థాయిల్ని చేరాయి. ర్యాలీ కొనసాగడానికి విశ్లేషకులు 3 ముఖ్య కారణాలివీ.

మరిన్ని వార్తలు