3రోజూ లాభాల ప్రారంభమే..!

23 Jun, 2020 09:26 IST|Sakshi

10350పైన మొదలైన నిఫ్టీ

130 పాయింట్ల లాభంతో సెన్సెక్స్‌ ప్రారంభం

ఐటీ షేర్లకు హెచ్‌1బీ వీసాల రద్దు నష్టాలు 

భారత ఈక్విటీ మార్కెట్‌ మంగళవారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 130 పాయింట్లు పెరిగి 35041 వద్ద, నిఫ్టీ 43 పాయింట్ల లాభంతో 10354 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సూచీలకిది వరుసగా మూడోరోజూ లాభాల ప్రారంభం కావడం విశేషం. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలు ఇన్వెసర్టకు ఉత్సాహానిచ్చినట్లు మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక్క ఐటీ తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు హెచ్‌-1బి వీసాలకు అనుమతిని ఇవ్వమంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటనతో ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. గత కొంతకాలంగా మార్కెట్‌ ర్యాలీని నడిపిస్తున్న బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగ షేర్లకు నేడు కూడా కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతానికి పైగా లాభపడి 21,847.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

కరోనా వైరస్‌తో దెబ్బతిన్న భారత ఎకానమీకి కేంద్రం మరోసారి  ఆర్థిక ఉద్దీపన చర్యలు ప్రకటించే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ సోమవారం తెలిపింది. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) సుమారు 1 శాతం మేర ఉండవచ్చని అంచనా వేసింది. అలాగే దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఎఫ్‌ఐఐల పెట్టుబడులు కొనుగోళ్ల పరంపర కొనసాగుతుంది. ఇక అంతర్జాతీయ అంశాలను పరిశీలిస్తే.., నిన్నరాత్రి టెక్నాలజీ షేర్ల అండతో అమెరికా మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. నేడు ఆసియా మార్కెట్లు సైతం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ప్రధాన ఉత్పత్తిదేశాలు సప్లైను తగ్గించడంతో క్రూడాయిల్‌ ధరలు స్థిరంగా కదులుతున్నాయి.

బజాజ్‌ ఫిన్‌ సర్వీసెస్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, యూపీఎల్‌, బజాజ్‌ఫైనాన్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 2శాతం నుంచి 4శాతం లాభపడ్డాయి. హెచ్‌సీఎల్‌టెక్‌, సన్‌ఫార్మా, టీసీఎస్‌, విప్రో, ఇన్ఫోసిస్‌ షేర్లు 0.10శాతం నుంచి అరశాతం నష్టపోయాయి.  

మరిన్ని వార్తలు