10800దిగువున నిఫ్టీ ప్రారంభం

14 Jul, 2020 09:30 IST|Sakshi

270 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్‌ ప్రారంభం

10800 స్థాయిని కోల్పోయిన నిఫ్టీ 

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు 

ఫార్మా, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు

అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ మంగళవారం నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్‌ 273 పాయింట్ల నష్టంతో 36419 వద్ద, నిఫ్టీ 70 పాయింట్లను కోల్పోయి 10732 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఐటీ, ఫార్మా రంగ షేర్లకు మాత్రమే కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. మిగిలిన అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1.40శాతం నష్టాన్ని చవిచూసి 22వేల దిగువున 21,788 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

నేడు టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడికానున్నాయి. అలాగే విప్రో, మైండ్‌ ట్రీ కంపెనీలతో సహా 35కంపెనీలు నేడు మొదటి త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తున్నారు. మన మార్కెట్‌ సమయానికి ఆసియాలో ప్రధాన దేశాలకు చెందిన సూచీలన్నీ నష్టాల్లో కదలాడుతుండటం సెంటిమెంట్‌ను మరింత బలహీనపరిచింది. కాగా నిన్నరాత్రి అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. 

బజాజ్‌ఫైనాన్స్‌, వేదాంత, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇం‍డస్‌ ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు 2శాతం నుంచి 2.50శాతం నష్టాన్ని చవిచూశాయి. ఏషియన్‌ పేయింట్స్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌, విప్రో షేర్లు అరశాతం నుంచి 1.50శాతం లాభపడ్డాయి.

మరిన్ని వార్తలు