తక్షణ అవరోధశ్రేణి 36,200–36,285

14 Jan, 2019 05:18 IST|Sakshi

మార్కెట్‌ పంచాంగం

జనవరి తొలివారంలో భారత్‌తో సహా ప్రపంచ ప్రధాన ఈక్విటీ మార్కెట్లన్నీ...వాటి ఇటీవలి గరిష్టస్థాయిల వద్ద పరిమితశ్రేణిలో కదిలాయి. అమెరికా–చైనా ట్రేడ్‌వార్‌ చర్చలు సానుకూలంగా ముగిసాయన్న వార్తలు కూడా మార్కెట్లను పెద్దగా ఉత్తేజపర్చలేకపోయాయి. ఇక్కడ ప్రధాన ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌లతో పాటు ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాలు సైతం మార్కెట్‌ అంచనాలకంటే దిగువస్థాయిలోనే వున్నాయి. ఇన్ఫోసిస్‌ భారీ బైబ్యాక్‌ ప్రకటించినందున, ఫలితాలు నిరుత్సాహపర్చినా, షేరు గరిష్టస్థాయిలోనే ట్రేడ్‌కావొచ్చు. అయితే ఇన్ఫోసిస్, ఐటీసీ, కొన్ని కార్పొరేట్‌ బ్యాంకులు మినహా మిగిలిన హెవీవెయిట్‌ షేర్లన్నీ ముందడుగు వేయలేకపోవడం ఇన్వెస్టర్లను ఆందోళనపర్చే అంశం. సంవత్సరాంతపు సెలవుల తర్వాత సాధారణంగా జనవరి రెండోవారం నుంచి మన మార్కెట్లో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహించే విదేశీ ఇన్వెస్టర్లు, ఫెడ్‌ తాజా ప్రకటనతో భారత్‌ మార్కెట్‌లో పెట్టుబడుల్ని పునఃప్రారంభిస్తారా, అమ్మకాలకు తెరతీస్తారా అనే అంశం సమీప భవిష్యత్తులో మన మార్కెట్‌ ట్రెండ్‌ను నిర్దేశించగలదు.   ఇక సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే,  

సెన్సెక్స్‌ సాంకేతికాలు..
జనవరి 11తో ముగిసిన వారంలో  36,270–35,750  పాయింట్ల గరిష్ట, కనిష్టస్థాయిల మధ్య ఊగిసలాడిన  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 315 పాయింట్ల లాభంతో 36,010  పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్‌ పెరిగితే సెన్సెక్స్‌కు 36,200–36,285 శ్రేణి గట్టిగా నిరోధించవచ్చు. గతవారంలో పలుదఫాలు అవరోధం కలిగించిన ఈ శ్రేణిపైన ముగిస్తే 36,285–36,560 పాయింట్ల నిరోధశ్రేణిని అధిగమించడం సెన్సెక్స్‌ భవిష్యత్‌ ట్రెండ్‌కు కీలకం. ఈ స్థాయిపైన ముగిస్తే క్రమేపీ 36,800–37,050 పాయింట్ల శ్రేణిని అందుకోవచ్చు. ఈ వారం పైన ప్రస్తావించిన తొలి నిరోధశ్రేణిని దాటలేకపోయినా, సోమవారం మార్కెట్‌ నిస్తేజంగా ప్రారంభమైనా 35750 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన ముగిస్తేక్రమేపీ  35,380 పాయింట్ల స్థాయికి తగ్గవచ్చు. ఈ లోపున ముగిస్తే తిరిగి 35000 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు.  

నిఫ్టీ నిరోధశ్రేణి 10830–10,870
గతవారం 10,870– 10,733 పాయింట్ల మధ్య పరిమితశ్రేణిలో ఊగిసలాడిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 68 పాయింట్ల లాభంతో 10,795 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ పెరిగితే 10830–10,870 శ్రేణి తొలుత తీవ్ర నిరోధాన్ని కల్పించవచ్చు.  అటుపైన కీలక నిరోధ శ్రేణి 10925–10,985 పాయింట్లు. గత మూడువారాలుగా పలుదఫాలు ఈ శ్రేణి అవరోధాన్ని కల్గించినందున, ఈ శ్రేణిని దాటితేనే తదుపరి అప్‌ట్రెండ్‌ సాధ్యపడుతుంది.  ఈ వారం పైన సూచించిన తొలి నిరోధశ్రేణిని దాటలేకపోయినా, ఈ సోమవారం నిఫ్టీ బలహీనంగా ప్రారంభమైనా 10,730 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. గత వారంరోజులుగా మద్దతునిచ్చిన ఈ స్థాయిలోపున ముగిస్తే 10,630 పాయింట్ల వద్ద క్రమేపీ తగ్గవచ్చు. ఈ స్థాయి దిగువన ముగిస్తే 10,535 పాయింట్ల స్థాయిని తిరిగి పరీక్షించవచ్చు.

– పి. సత్యప్రసాద్‌ 

మరిన్ని వార్తలు