వాణిజ్య యుద్ధ భయాలతో నష్టాలు

19 Jun, 2018 01:40 IST|Sakshi

అమెరికా– చైనా మధ్య సుంకాల పోరు

నష్టాల్లో ఆరంభమైన యూరప్‌ మార్కెట్లు

74 పాయింట్లు పతనమై 35,548కు సెన్సెక్స్‌

18 పాయింట్ల నష్టంతో 10,800కు నిఫ్టీ  

అమెరికా– చైనా మధ్య వాణిజ్య యుధ్దం మరింత ముదరడంతో సోమవారం స్టాక్‌  మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. లోహ, బ్యాంక్, ఐటీ షేర్లలో అమ్మకాలు జోరుగా సాగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌  74 పాయింట్ల నష్టంతో 35,548 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 18 పాయింట్ల నష్టంతో 10,800 పాయింట్ల వద్ద ముగిశాయి. ఆయిల్, గ్యాస్, వాహన, పీఎస్‌యూ, బ్యాంకింగ్, హెల్త్‌కేర్‌ రంగాల షేర్లు లాభపడ్డాయి.

అమెరికా–చైనా వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నాయని దీంతో మన మార్కెట్‌ పరిమిత శ్రేణిలోనే కదలాడిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. 5,000 కోట్ల డాలర్ల విలువైన చైనా వస్తువులపై అమెరికా 25 శాతం సుంకాలు విధించింది. దీనికి ప్రతిగా చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై ఈ స్థాయిలోనే సుంకాలు విధించింది.

సెన్సెక్స్‌ 35,698 పాయింట్ల వద్ద లాభాల్లోనే ఆరంభమైంది. ఆరంభ కొనుగోళ్ల కారణంగా వంద పాయింట్ల లాభంతో 35,722 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత హెచ్చుతగ్గులకు లోనైంది. చాలా ఆసియా మార్కెట్లు సెలవు కారణంగా పనిచేయకపోవడం, యూరప్‌ మార్కెట్లు నష్టాల్లో ఆరంభం కావడం మరింత ప్రతికూల ప్రభావం చూపించింది. దీంతో 103 పాయింట్ల నష్టంతో 35,519 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయిని తాకింది. మొత్తం మీద రోజంతా 203 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. నిఫ్టీ 10,788 –10,830  కనిష్ట, గరిష్ట స్థాయిల మధ్య కదలాడింది.

చమురు షేర్లకు లాభాలు....
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పతనం కారణంగా ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు భారీగా లాభపడ్డాయి. హెచ్‌పీసీఎల్‌ 5 శాతం, ఐఓసీ 3.5 శాతం, బీపీసీఎల్‌ 2.7 శాతం చొప్పున పెరిగాయి. విమానయాన రంగ షేర్లు ఇండిగో, స్పైస్‌జెట్, జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు కూడా 2.5 శాతం వరకూ లాభపడ్డాయి.

ఐసీఐసీఐ బ్యాంక్‌ 4% అప్‌:  ఐసీఐసీఐ బ్యాంక్‌ ఉన్నత స్థాయి మేనేజ్‌మెంట్‌లో పునర్వ్యవస్థీకరణ జరగనున్నదన్న వార్తల కారణంగా ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్‌ 3.6 శాతం లాభంతో రూ.293 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్‌ ఇదే. బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.6,631 కోట్లు పెరిగింది.

మరిన్ని వార్తలు