చతికిలపడ్డ చిన్న షేర్లు 

16 Aug, 2018 00:29 IST|Sakshi

11 శాతం పెరిగిన సెన్సెక్స్‌  

 9–13 శాతం రేంజ్‌లో పతనమైన స్మాల్, మిడ్‌ క్యాప్‌ సూచీలు  

అనిశ్చితిలో చిన్న షేర్లకు కష్టాలు తప్పవంటున్న నిపుణులు  

న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్‌ రోజురోజుకూ కొత్త శిఖరాలకు చేరుతున్నా చిన్న షేర్లు మాత్రం చతికిల పడుతున్నాయి. బీఎస్‌ఈ ప్రధాన సూచీ, లార్జ్‌ క్యాప్‌ షేర్లతో కూడిన సెన్సెక్స్‌ ఈ ఏడాది ఇప్పటి వరకూ 11% పెరిగి రికార్డ్‌ల మోత మోగిస్తున్నా, బీఎస్‌ఈ స్మాల్, మిడ్‌ క్యాప్‌ సూచీలు మాత్రం 9–13 శాతం రేంజ్‌లో పతనమయ్యాయి. దేశీ ఇన్వెస్టర్లు చిన్న షేర్లను అధికంగా కొనుగోలు చేస్తుండగా, విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద షేర్లకు ప్రాముఖ్యత ఇస్తారని మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు. అనిశ్చిత పరిస్థితుల్లో చిన్న షేర్లకు కష్టాలు తప్పవని వారంటున్నారు.  

2,488 పాయింట్లు పడిన స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 
ఈ ఏడాది ఇప్పటిదాకా సెన్సెక్స్‌ 3,795 పాయింట్లు (11 శాతం) పెరిగింది. కానీ బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 1,581 పాయింట్లు (9 శాతం), స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 2,488 పాయింట్లు(13 శాతం) చొప్పున క్షీణించాయి. గత ఏడాది మాత్రం మిడ్, స్మాల్‌ క్యాప్‌ సూచీలు దుమ్ము రేపాయి. గత ఏడాది సెన్సెక్స్‌ 28 శాతం లాభపడితే, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 60 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 48 శాతం చొప్పున పెరిగాయి. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో సెన్సెక్స్‌ జోరుకు బ్రేక్‌ పడింది. జనవరిలో 6 శాతం ఎగసిన సెన్సెక్స్‌ ఫిబ్రవరిలో 5 శాతం, మార్చిలో 3 శాతం చొప్పున క్షీణించింది. ఏప్రిల్‌లో 6 శాతం ఎగసిన సెన్సెక్స్‌ మే, జూన్‌ల్లో స్వల్పంగానే లాభపడింది. జూలైలో మాత్రం 7 శాతం పెరిగింది.  

 సెన్సెక్స్‌ ఈ నెల 9న 38,076 పాయింట్లకు చేరి జీవిత కాల  గరిష్ట స్థాయిని తాకింది. ఇక మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 18,321 పాయింట్ల వద్ద, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 20,183 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. ఈ రెండు సూచీలు ఈ ఏడాది జనవరి 15న ఈ రికార్డ్‌లను సాధించాయి.   బ్లూ చిప్‌లు, లార్జ్‌ క్యాప్‌ కంపెనీల మార్కెట్‌ విలువలో ఐదోవంతు మార్కెట్‌ క్యాప్‌ ఉన్న కంపెనీల షేర్లను మిడ్‌ క్యాప్‌ షేర్లుగా పరిగణిస్తారు. అలాగే లార్జ్‌క్యాప్‌ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌లో పదో వంతు మార్కెట్‌ క్యాప్‌ ఉన్న షేర్‌ను స్మాల్‌ క్యాప్‌ షేర్‌గా వ్యవహరిస్తారు.

మరిన్ని వార్తలు