9వ రోజూ మార్కెట్ దూకుడు

4 Sep, 2014 01:18 IST|Sakshi
9వ రోజూ మార్కెట్ దూకుడు

 ఇటీవల జోరుమీదున్న స్టాక్ మార్కెట్లలో నవవసంతం వెల్లివిరిసింది. సెన్సెక్స్ వరుసగా తొమ్మిదో రోజు లాభపడింది. 120 పాయింట్లు పెరిగి 27,140 వద్ద ముగిసింది. తద్వారా 9 రోజుల్లో 825 పాయింట్లు జమ చేసుకుంది. ఇక నిఫ్టీ కూడా 31 పాయింట్లు పుంజుకుని 8,115 వద్ద నిలిచింది. ఇవి సరికొత్త రికార్డులుకాగా, ఇంట్రాడేలోనూ కొత్త గరిష్టాలు నమోదయ్యాయి.

సెన్సెక్స్ 27,226వద్ద, నిఫ్టీ 8,142 వద్ద కొత్త రికార్డును నెలకొల్పాయి. ప్రధానంగా ఐటీ ఇండెక్స్ 2.5% పుంజుకోవడం ద్వారా మార్కెట్లకు అండగా నిలిచింది. సాఫ్ట్‌వేర్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ 3.5-2.5% మధ్య పురోగమించాయి. దీంతో నెల రోజుల తరువాత మళ్లీ టీసీఎస్ రూ. 5 లక్షల కోట్ల మార్కెట్ విలువను అందుకుంది. అమెరికాలో జూలై నెలకు కన్‌స్ట్రక్షన్ రంగ గణాంకాలు మెరుగుపడగా, ఆగస్ట్ నెలకు తయారీ రంగ వృద్ధి మూడున్నరేళ్ల గరిష్టానికి చేరడంతో ఐటీ షేర్లకు డిమాండ్ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు.

జీడీపీ పురోగమనం, కరెంట్ ఖాతా లోటు భారీగా తగ్గడం, విదేశీ పెట్టుబడులు కొనసాగుతుండటం వంటి అంశాలు పటిష్టర్యాలీకి కారణ మవుతున్నట్లు వివరించారు. వీటికితోడు రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ముడిచమురు ధరలు 16 నెలల కనిష్టానికి చేరాయి. దీంతో సెంటిమెంట్ మరింత మెరుగుపడిందని నిపుణులు చెప్పారు.

 రియల్టీ దూకుడు
 బుధవారం ట్రేడింగ్‌లో రియల్టీ ఇండెక్స్ సైతం 2% లాభపడింది. రియల్టీ షేర్లలో ఒబెరాయ్ 15% జంప్‌చేయగా, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఫీనిక్స్, హెచ్‌డీఐఎల్, శోభా 6-3% మధ్య ఎగశాయి. ఇక మరోవైపు సెన్సెక్స్‌లో కోల్ ఇండియా, భారతీ 3% స్థాయిలో పుంజుకోగా, గెయిల్, ఐటీసీ, ఓఎన్‌జీసీ 2-1.5% మధ్య తిరోగమించాయి.

మరిన్ని వార్తలు