లాభ, నష్టాల మధ్య సయ్యాట

10 Nov, 2018 02:10 IST|Sakshi

ఫెడ్‌ రేట్ల పెంపు భయాలతో  ప్రపంచ మార్కెట్ల పతనం 

తీవ్ర హెచ్చుతగ్గుల్లో  స్టాక్‌ సూచీలు 

79 పాయింట్ల నష్టంతో 35,159కు సెన్సెక్స్‌

13 పాయింట్లు పడి   10,585కు నిఫ్టీ 

ప్రపంచ మార్కెట్ల పతనం కారణంగా మన స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం నష్టాల్లో ముగిసింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వచ్చే నెలలో రేట్లను పెంచనున్నదని సంకేతాలివ్వడంతో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి.  అయితే ముడి చమురు ధరలు దిగిరావడం, డాలర్‌తో రూపాయి మారకం పుంజుకోవడం వంటి సానుకూలాంశాలు కూడా ప్రభావం చూపడంతో స్టాక్‌ సూచీలు రోజంతా తీవ్రమైన హెచ్చుతగ్గులకు గురయ్యాయి. బలి పాడ్యమి సందర్భంగా గురువారం సెలవు కావడంతో ఒక రోజు విరామం అనంతరం ఆరంభమైన స్టాక్‌ మార్కెట్‌ చివరకు నష్టాల్లో ముగిసింది.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 79 పాయింట్లు నష్టంతో 35,159 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 13 పాయింట్లు తగ్గి 10,585 పాయింట్ల వద్ద ముగిశాయి. వాహన, ఫార్మా, మౌలిక రంగ షేర్లు లాభపడగా, ఐటీ,  లోహ, రియల్టీ, ఎఫ్‌ఎమ్‌సీజీ రంగ  షేర్లు నష్టపోయాయి.  కాగా జలవిద్యుదుత్పత్తి కంపెనీ ఎన్‌హెచ్‌పీసీ... షేర్లను బైబ్యాక్‌ చేసే అవకాశాలున్నాయి. ఈ నెల 14న(వచ్చే బుధవారం) జరిగే బోర్డ్‌ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం వెలువడనుంది.  

మరిన్ని వార్తలు