బ్యాంక్‌ షేర్ల ర్యాలీ

4 Apr, 2018 00:37 IST|Sakshi

బాండ్ల నష్టాల సర్దుబాటుతో బ్యాంక్‌ షేర్లకు లాభాలు

వరుసగా రెండో రోజూ లాభాలు  

115 పాయింట్లు పెరిగి 33,371కు సెన్సెక్స్‌  

33 పాయింట్ల లాభంతో 10,245కు నిఫ్టీ

బాండ్ల నష్టాలను తర్వాతి నాలుగు క్వార్టర్ల వరకూ సర్దుబాటు చేసుకునే వెసులుబాటును ఆర్‌బీఐ ఇవ్వడంతో బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. రోజంతా ఒడిదుడుకులమయంగా సాగిన  మంగళవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. స్టాక్‌ సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నప్పటికీ, తయారీ రంగ గణాంకాలు నీరసంగా ఉన్నప్పటికీ, డాలర్‌తో రూపాయి మారకం బలపటడం సానుకూల ప్రభావం చూపించింది.

బ్యాంక్‌ షేర్లతో పాటు వాహన, పీఎస్‌యూ, విద్యుత్తు షేర్లు పెరిగాయి.  ట్రేడింగ్‌ చివరి గంటలో   కొనుగోళ్ల జోరుతో సెన్సెక్స్‌ 115 పాయింట్ల లాభంతో 33,371 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో 10,245 పాయింట్ల వద్ద ముగిశాయి.  టెక్నాలజీ షేర్ల పతనం, చైనా, అమెరికాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కారణంగా సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్‌ భారీగా నష్టపోవడం, ఈ ప్రభావంతో ఆసియా మార్కెట్లు పతన బాటలో ఉండటంతో సెన్సెక్స్‌ నష్టాల్లో ఆరంభమైంది.

ఆ తర్వాత కోలుకొని లాభాల బాట పట్టినప్పటికీ,  102  పాయింట్ల నష్టంతో 33,154 పాయింట్ల వద్ద ఇంట్రాడేలో కనిష్ట స్థాయిని తాకింది. బ్యాంక్‌ షేర్ల దన్నుతో  తర్వాత నష్టాలన్నీ అధిగమించి లాభాల బాట పట్టింది. 148 పాయింట్ల లాభంతో ఇంట్రాడేలో 33,403 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. మొత్తం మీద రోజంతా 250 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.

ఇక నిఫ్టీ ఒక దశలో 33 పాయింట్లు లాభపడగా, మరో దశలో 41 పాయింట్లు నష్టపోయింది. ప్రపంచ మార్కెట్లలో ఒడిదుడుకుల కారణంగా మార్కెట్‌ పరిమిత శ్రేణిలో కదలాడిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. బాండ్ల నష్టాలను సర్దుబాటు చేసుకునే వెసులుబాటును ఆర్‌బీఐ ఇవ్వడంతో బాంక్‌ షేర్లు లాభాల బాటన నడిచాయి.


ఎంఆర్‌ఎఫ్‌@  ముప్పావు లక్ష
స్టాక్‌ మార్కెట్‌ ఒడిదుడుకులమయంగా సాగినప్పటికీ, టైర్ల షేర్లు మాత్రం దూసుకుపోయాయి. ట్రక్కు, బస్‌  రేడియల్‌ టైర్లపై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 15 శాతానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పెంచడం దీనికి కారణం. ఎమ్‌ఆర్‌ఆఫ్‌ షేర్‌ 3.4 శాతం లాభంతో రూ.75,600 వద్ద ముగిసింది.

ఇంట్రాడేలో ఈ షేర్‌ జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.75,764ను తాకింది. భారత స్టాక్‌ మార్కెట్లో అత్యంత ఖరీదైన షేర్‌ ఇదే. అపోలో టైర్స్, సియట్, టీవీఎస్‌ శ్రీచక్ర, జేకే టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్, గుడ్‌ ఇయర్‌ ఇండియా, గోవింద్‌ రబ్బర్, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ షేర్లు 3 శాతం వరకూ పెరిగాయి.

మరిన్ని వార్తలు