36000 పైన సెన్సెక్స్‌ ప్రారంభం

3 Jul, 2020 09:23 IST|Sakshi

10600పైన మొదలైన నిఫ్టీ

3రోజూ లాభాల ప్రారంభమే

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు 

కలిసొచ్చిన క్రూడాయిల్‌ క్షీణత

దేశీయ ఈక్విటీ మార్కెట్‌ వరుసగా 3రోజూ లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 250 పాయింట్ల లాభంతో 36095  వద్ద, నిఫ్టీ 75  పాయింట్లు పెరిగి 10626 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సాంకేతాలు, క్రూడాయిల్‌ పతనం, డాలర్‌ మారకంలో రూపాయి 3నెలల గరిష్టానికి చేరుకోవడం, దేశీయ ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల పరంపర కొనసాగుతుండటం తదితర కారణాలు మార్కెట్ లాభాల ప్రారంభానికి కారణమయ్యాయి. అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. అత్యధికంగా బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగ షేర్లు లాభపడుతున్నాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 0.68శాతం లాభంతో 22,101.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

లాభాల్లో అంతర్జాతీయ మార్కెట్లు:
అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లో సానుకూల సెంటిమెంట్‌ నెలకొంది. అమెరికా నిన్నరాత్రి ఉద్యోగ గణాంకాలను విడుదల చేసింది. ఈ జూన్‌లో అంచనాలకు మించి 4.8 మిలియన్‌ ఉద్యోగాల కల్పన జరిగినట్లు కార్మిక శాఖ వెల్లడించింది. ఫలితంగా అక్కడి మార్కెట్లు అరశాతం లాభంతో ముగిశాయి. యూఎస్‌ ఫార్మా దిగ్గజం ఫైజర్‌ ఇంక్‌ కోవిడ్‌-19 చికిత్సకు అభివృద్ధి చేస్తున్న ఔషధంపై ఆశలతో నిన్నటి రోజున యూరప్‌ మార్కెట్లు‌ 3శాతం లాభంతో ముగిశాయి.  ఇక నేడు ఆసియా మార్కెట్ల విషయానికోస్తే.., లాక్‌డౌన్‌ సడలింపులతో చైనా సర్వీస్‌ సెక్టార్‌ ఈ జూన్‌లో గత పదేళ్లలో ఎన్నడూ లేనంత అత్యంత వేగంగా విస్తరించినట్లు ఒక ప్రైవేట్‌ రంగ సర్వే తెలిపింది. దీంతో ఆసియాలోని ప్రధాన దేశాలకు చెందిన ఈక్విటీ సూచీలు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. మన మార్కెట్‌ ప్రారంభ సమయానికి చైనా ఇండెక్స్‌ షాంఘైతో పాటు కొరియా, హాంగ్‌కాంగ్‌, తైవాన్‌ దేశాలకు చెందిన సూచీలు సైతం 1శాతం లాభాల్లో కదులుతున్నాయి. అలాగే జపాన్‌, ఇండోనేషియా, థాయిలాండ్‌ దేశాల సూచీలు అరశాతం ట్రేడ్‌ అవుతున్నాయి.

ఎల్‌అండ్‌టీ, బీపీసీఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, యూపీఎల్‌, టాటామోటర్స్‌ షేర్లు 1.50శాతం నుంచి 2శాతం లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా స్టీల్‌, మహీంద్రాఅండ్‌మహీంద్రా, ఇన్ఫోసిస్‌, మారుతి సుజుకీ షేర్లు అరశాతం నష్టాన్ని చవిచూశాయి.

మరిన్ని వార్తలు