ట్రేడ్‌ వార్‌ : వరుసగా రెండో రోజు నష్టాలే

26 Jun, 2018 09:41 IST|Sakshi

ముంబై : ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య ట్రేడ్‌ వార్‌ రోజురోజుకి తీవ్రతరమవుతుండటంతో, ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. దీంతో దేశీయంగా స్టాక్‌ మార్కెట్లు పతన దిశగా పయనిస్తున్నాయి. సోమవారం ట్రేడింగ్‌లోనే భారీగా పతనమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు, నేటి ట్రేడింగ్‌లోనూ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో 100 పాయింట్లు పడిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ప్రస్తుతం 34 పాయింట్ల నష్టంలో 35,436 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 11 పాయింట్ల నష్టంలో 10,751 వద్ద కొనసాగుతోంది.  ట్రేడింగ్‌ ప్రారంభంలో టాటా మోటార్స్‌, వేదంత, ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ ఎక్కువగా నష్టపోయాయి. 

నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌, నిఫ్టీ బ్యాంక్‌లు కూడా 55 పాయింట్లు, 95 పాయింట్లు చొప్పున కోల్పోయాయి. మరోవైపు అరబిందో ఫార్మా, ఏసియన్‌ పేయింట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీ, లుపిన్‌, టీసీఎల్‌, ఇండియాబుల్స్‌ హౌజింగ్‌లు ట్రేడింగ్‌ ప్రారంభంలో లాభపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా 5 పైసలు బలహీనపడి 68.18 వద్ద ప్రారంభమైంది. అటు జూన్‌ నెల డెరివేటివ్‌ కాంట్రాక్ట్‌ల గడువు కూడా మరో రెండు రోజుల్లో ముగియబోతుంది. ఈ గడువు ముగింపుతో పాటు, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు పతన దిశగా పయనిస్తుండటం దేశీయ స్టాక్‌ మార్కెట్లను దెబ్బకొడుతుందని మార్కెట్‌ విశ్లేషకులన్నారు. క్రూడ్‌ ఆందోళనలూ మార్కెట్లకు ప్రతికూలంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు