35 వేల పాయింట్లపైకి సెన్సెక్స్‌

1 May, 2018 00:43 IST|Sakshi

బ్యాంక్, ఐటీ షేర్ల బూస్ట్‌  

సానుకూలంగా అంతర్జాతీయ సంకేతాలు  

191 పాయింట్ల లాభంతో 35,160కు సెన్సెక్స్‌ 

47 పాయింట్లు పెరిగి 10,739కు నిఫ్టీ

బ్యాంక్, ఐటీ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరగడంతో స్టాక్‌ మార్కెట్‌ సోమవారం లాభాల్లో ముగిసింది. కంపెనీల ఆర్థిక ఫలితాలు అంచనాలను మించుతుండటం, అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండడం వంటి కారణాల వల్ల స్టాక్‌ సూచీలు కళకళలాడాయి. వరుసగా మూడో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ సెన్సెక్స్, నిఫ్టీలు లాభపడ్డాయి. మూడు నెలల గరిష్టానికి చేరాయి. సెన్సెక్స్‌  35 వేల పాయింట్లు, నిఫ్టీ 10,700 పాయింట్ల ఎగువున ముగిశాయి.

మరిన్ని రంగాల కంపెనీలు విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీ) పొందేలా నిబంధనలను ఆర్‌బీఐ సరళీకరించడం... ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది. సెన్సెక్స్‌ 191 పాయింట్లు లాభపడి 35,160 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 10,739 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ ఏడాది బడ్జెట్‌ రోజు తర్వాత సెన్సెక్స్‌కు ఇదే అధిక స్థాయి.

కొరియాల చారిత్రాత్మక సమావేశం కారణంగా ఆసియా మార్కెట్లు లాభపడటం, యూరప్‌ మార్కెట్లు లాభాల్లో ఆరంభం కావడం, ముడి చమురు ధరలు 1 శాతం మేర పతనం కావడం.. సానుకూల ప్రభావం చూపించాయి. లోహ, రియల్టీ, క్యాపిటల్‌ గూడ్స్, హెల్త్‌కేర్, పవర్, పీఎస్‌యూ, వాహన షేర్లు లాభపడ్డాయి.  

ఏప్రిల్‌లో 6 శాతం పెరిగిన నిఫ్టీ  
ఆరంభంలోనే 35,000 పాయింట్లపైకి చేరిన సెన్సెక్స్‌... రియల్టీ, క్యాపిటల్‌ గూడ్స్, ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరగడంతో 243 పాయింట్ల లాభంతో 35,213 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ట స్థాయిని తాకింది. గత మూడు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ మొత్తం 653 పాయింట్లు లాభపడింది. ఇక నిఫ్టీ గత నెలలో 6.2 శాతం ఎగసింది. అంతకు ముందటి రెండు నెలల్లో (ఫిబ్రవరి, మార్చి)ల్లో 8 శాతానికి పైగా పతనమైంది.

యస్‌ బ్యాంక్‌ 4 శాతం అప్‌..
అంచనాలను మించిన ఆర్థిక ఫలితాలను వెల్లడించడంతో యస్‌బ్యాంక్‌ లాభాల జోరు కొనసాగుతోంది. ఈ షేర్‌ 4 శాతం లాభంతో రూ.362ను తాకింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే. మార్కెట్‌ జోరుతో పలు షేర్లు ఆల్‌టైమ్‌ హైని తాకాయి.

అవెన్యూ సూపర్‌ మార్ట్స్, బయోకాన్, బ్రిటానియా ఇండస్ట్రీస్, డాబర్‌ ఇండియా, ఎస్కార్ట్స్, హిందుస్తాన్‌ యూనిలివర్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్, మహీంద్రా అండ్‌ మహీంద్రా, మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఎమ్‌ఆర్‌ఎఫ్, నెస్లే ఇండియా, ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్, ఎస్‌ఆర్‌ఎఫ్‌ తదితర షేర్లు ఆల్‌టైమ్‌ హైని తాకాయి. కేజీ–డీ6 చమురు క్షేత్రంలో చమురు ఉత్పత్తిని నిలిపేయనున్నామని ప్రకటించిన నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ 3.1 శాతం నష్టపోయి రూ.963 వద్ద ముగిసింది. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.20,000 కోట్లు తగ్గి రూ.6,10,134 కోట్లకు చేరింది.  

పీసీ జువెలర్‌ అప్‌ అండ్‌ డౌన్‌
పీసీ జువెలర్‌ పతనం కొనసాగుతోంది. షేర్ల బైబ్యాక్‌ విషయాన్ని కంపెనీ పరిశీలిస్తోందన్న వార్తలతో ఈ షేర్‌ ఇంట్రాడేలో 18% లాభంతో రూ.210ను తాకింది. కానీ ఆ తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో ఈ షేర్‌ భారీగా పతనమైంది. 18% నష్టంతో రూ. 145 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో మూడేళ్ల కనిష్ట స్థాయి, రూ.141ను తాకింది.

ఇంట్రాడే గరిష్ట స్థాయి నుంచి చూస్తే, మొత్తం 30%కి పైగా పతనమైంది. గత ఏడు ట్రేడింగ్‌ సెషన్లుగా ఈ షేర్‌ పతనం కొనసాగుతోంది. ఈ ఏడు రోజుల్లో ఈ షేర్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.5,975 కోట్లు  హరించకుపోయింది. గత నెల 19న రూ.297గా ఉన్న ఈ షేర్‌ సోమవారం నాడు సగానికి పైగా (51%) పతనమై  రూ.145కు క్షీణించింది.

నేడు సెలవు
మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు స్టాక్‌ మార్కెట్‌కు సెలవు.

మరిన్ని వార్తలు