కోలుకున్న మార్కెట్లు

18 Oct, 2014 01:00 IST|Sakshi
కోలుకున్న మార్కెట్లు

109 పాయింట్లు అప్  
26,108 వద్దకు సెన్సెక్స్
కుప్పకూలిన ఐటీ షేర్లు

 
రెండు రోజుల నష్టాల తరువాత మళ్లీ మార్కెట్లు కుదుటపడ్డాయి. సెన్సెక్స్ 109 పాయింట్లు పుంజుకుని 26,108 వద్ద ముగిసింది. తద్వారా 26,000 పాయింట్ల కీలక స్థాయికి ఎగువన నిలిచింది. ఇక నిఫ్టీ కూడా 31 పాయింట్లు లాభపడి 7,780 వద్ద స్థిరపడింది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో సెంటిమెంట్ మెరుగైందని నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఆర్థిక సంస్కరణలు వేగమందుకుంటాయన్న ఆశలు ఇన్వెస్టర్లలో ఏర్పడ్డాయని తెలిపారు. ప్రధానంగా బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, వినియోగ వస్తు రంగాలు 2.5-2% మధ్య పురోగమించాయి.

టీసీఎస్ నేలచూపులు: ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో ప్రకటించిన ఫలితాలు నిరుత్సాహపరచడంతో ఐటీ దిగ్గజాలు టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ అమ్మకాలతో కుప్పకూలాయి. ఈ షేర్లు 9% చొప్పున పతనంకాగా, కేపీఐటీ, మైండ్‌ట్రీ సైతం 2.5% చొప్పున నీరసించాయి. టీసీఎస్‌లో విలీనంకానున్న సీఎంసీ 14%పైగా దిగజారింది. దీంతో బీఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్ 4% పడిపోయింది. కాగా, మిగిలిన  సెన్సెక్స్ దిగ్గజాలలో సెసాస్టెరిలైట్, హిందాల్కో 2.5% స్థాయిలో నష్టపోయాయి. అయితే మరోవైపు భెల్, హీరోమోటో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎంఅండ్‌ఎం, ఐసీఐసీఐ, సిప్లా, ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ, భారతీ, యాక్సిస్ 3.5-2% మధ్య పురోగమించడంతో మార్కెట్లు లాభాలతో ముగిశాయి.

మరిన్ని వార్తలు