ఐదు రోజుల నష్టాలకు బ్రేక్‌

26 Sep, 2018 00:59 IST|Sakshi

స్టాక్‌ మార్కెట్లో కొనుగోళ్ల కళకళ

కలసివచ్చిన షార్ట్‌ కవరింగ్‌

మళ్లీ 11,000 పాయింట్లపైకి నిఫ్టీ

100 పాయింట్ల లాభంతో 11,067 వద్ద ముగింపు

347 పాయింట్లు పెరిగి 36,652కు సెన్సెక్స్‌  

స్టాక్‌ మార్కెట్‌ ఐదు రోజుల నష్టాలకు మంగళవారం బ్రేక్‌ పడింది. గత 5 రోజుల పతనం కారణంగా కుదేలైన బ్యాంక్, ఎఫ్‌ఎమ్‌సీజీ, ఫార్మా, వాహన రంగ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరగడం, సెప్టెంబర్‌ సిరీస్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు మరో మూడు రోజుల్లో ముగియనుండటంతో షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు జరగడం కలసివచ్చాయి.

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మళ్లీ 11,000 పాయింట్లపైకి ఎగబాకింది. అయితే వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగడం, ముడి చమురు ధరలు నాలుగేళ్ల గరిష్ట స్థాయిలకు చేరడం వంటి ప్రతికూలతల కారణంగా స్టాక్‌ సూచీలు రోజంతా తీవ్రమైన హెచ్చుతగ్గులకు గురయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 347 పాయింట్లు పెరిగి 36,652 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 100 పాయింట్లు పెరిగి 11,067 పాయింట్ల వద్ద ముగిశాయి.

642 పాయింట్ల రేంజ్‌లో కదిలిన సెన్సెక్స్‌...
సెన్సెక్స్‌ స్వల్ప లాభాల్లోనే ఆరంభమైంది. ఆసియా మార్కెట్ల బలహీనత, రూపాయి పతనం కారణంగా ఆ తర్వాత వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. ఇంట్రాడేలో 241 పాయింట్ల నష్టంతో 36,064 పాయింట్ల వద్ద కనిష్ట స్థాయిని తాకింది. వేల్యూ బయింగ్‌ కొనుగోళ్లతో మళ్లీ లాభాల్లోకి వచ్చింది. ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో మళ్లీ నష్టపోయింది. చివరి గంటలో షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు జరగడంతో మళ్లీ లాభాల బాట పట్టింది.

ఇంట్రాడేలో 401 పాయింట్ల లాభంతో 36,652 పాయింట్ల వద్ద గరిష్ట స్థాయిని తాకింది. రోజంతా మొత్తం 642 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 85 పాయింట్లు నష్టపోగా, మరో దశలో 113  పాయింట్లు లాభపడింది. స్టాక్‌ సూచీలు తీవ్రమైన ఒడిదుడుకులకు గురైనా  చివరకు మంచి లాభాలు సాధించాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు.

లాభాలు ఎందుకంటే..
1. వేల్యూ బయింగ్‌: గత ఐదు రోజుల నష్టాల కారణంగా ధరలు తగ్గి ఆకర్షణీయంగా ఉన్న పలు రంగాల ముఖ్యంగా ఆర్థిక రంగ షేర్లలో కొనుగోళ్లు జోరుగా జరిగాయి.  
2. షార్ట్‌ కవరింగ్‌: సెప్టెంబర్‌ సిరీస్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు మరో మూడు రోజుల్లో ముగియనుండటంతో ట్రేడర్లు తమ షార్ట్‌ పొజిషన్లను కవర్‌ చేసుకోవడానికి కొనుగోళ్లు జరిపారు.  
3.ఎల్‌ఐసీ అభయం: ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ కంపెనీని కూలిపోనివ్వమని, తిరిగి పుంజుకోవడానికి తగిన మార్గాలను అన్వేషిస్తున్నామని ఆ కంపెనీలో 25 శాతానికి పైగా వాటా ఉన్న ఎల్‌ఐసీ చైర్మన్‌ వి.కె. శర్మ వ్యాఖ్యానించడం సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది.  
4. ఇండియాబుల్స్‌ నిధుల సమీకరణ: ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ విజయవంతంగా నిధుల సమీకరించడం కూడా కలసివచ్చింది.  
5. హెవీ వెయిట్స్‌కు లాభాలు: కోటక్‌ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, ఇన్ఫోసిస్, యాక్సిస్‌ బ్యాంక్‌లు 1–3 శాతం రేంజ్‌లో లాభపడ్డాయి.

త్వరలో ‘ఫ్లెయిర్‌’ ఐపీఓ
కాగా, పెన్నులు తయారు చేసే ఫ్లెయిర్‌ రైటింగ్‌ ఇండస్ట్రీస్‌ త్వరలో ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) వస్తోంది. ఐపీఓ ముసాయిదా పత్రాలను ఈ కంపెనీ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి ఇటీవలే సమర్పించింది. ఈ ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ రూ.330 కోట్లు విలువ గల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. అంతేకాకుండా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) మార్గంలో షేర్లు జారీ చేసి రూ.120 కోట్లు సమీకరించనుంది. మొత్తం మీద ఈ ఇష్యూ సైజు రూ.450 కోట్ల రేంజ్‌లో ఉంటుందని అంచనా.

మరిన్ని వార్తలు