బ్యాంక్ షేర్లలో పాజిటివ్ ట్రెండ్

10 Jul, 2013 04:17 IST|Sakshi

 ఒకవైపు నిరర్ధక ఆస్తులు పెరుగుతున్నాయి. మరోవైపు వడ్డీ రేట్లు తగ్గించాలంటూ ప్రభుత్వం, రిజర్వ్‌బ్యాంక్ ఒత్తిడి తెస్తున్నాయి. ఫలితంగా కొద్ది వారాలుగా పతనమవుతూ వస్తున్న బ్యాంకింగ్ షేర్లు... ముఖ్యంగా మిడ్‌క్యాప్ బ్యాంకు షేర్లు మంగళవారం కలిసికట్టుగా ర్యాలీ జరిపాయి. ఒకటి, రెండు ప్రైవేటు బ్యాంకుల ఫలితాలపై మార్కెట్లో సానుకూల అంచనాలున్నప్పటికీ, దాదాపు బ్యాంక్ షేర్లన్నీ పాజిటివ్‌గా ముగిశాయి. ట్రెండ్‌ను సూచిస్తూ సీఎన్‌ఎక్స్ బ్యాంక్ నిఫ్టీ 1.41 శాతం పెరుగుదలతో 11,442 పాయింట్ల వద్ద క్లోజయింది. విదేశీ మార్కెట్ల అనుకూల ప్రభావంతో గ్యాప్ అప్‌తో మొదలైన సెన్సెక్స్ రోజంతా 60 పాయింట్ల శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనై చివరకు 115 పాయింట్ల పెరుగుదలతో 19,439 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 47 పాయింట్లు ర్యాలీతో 5,859 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ రెండింటితో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ అధికం. లార్జ్‌క్యాప్ బ్యాంకింగ్ షేర్లలో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు 0.5-1 శాతం మధ్య పెరిగాయి.  విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.165 కోట్ల విలువైన నికర కొనుగోళ్లు జరిపారు.
 
 పెరిగిన లాంగ్ పొజిషన్లు...
 క్యాష్ మార్కెట్లో కొనుగోళ్లకు తోడు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగంలో బ్యాంకింగ్ కౌంటర్లలో ఒక్కసారిగా లాంగ్ పొజిషన్లు పెరిగాయి. రెండు నెలలుగా 30-40 శాతం పతనమైన మిడ్‌క్యాప్ బ్యాంకింగ్ కౌంటర్లలో లాంగ్ పొజిషన్ల జోరు పెరిగింది. బుధవారం ప్రైవేటు రంగ మిడ్‌సైజ్ బ్యాంక్ ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఆర్థిక ఫలితాలు వెల్లడించనుండటంతో ఈ ట్రెండ్ ఏర్పడి ఉండవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ షేరు 2.4 శాతం పెరుగుదలతో రూ. 504 వద్ద ముగిసింది. ఈ షేరు ఆల్‌టైమ్ గరిష్టానికిది కేవలం 5 శాతం తక్కువ. ఫ్యూచర్స్ విభాగంలో ఈ కౌంటర్లో ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 3.69 శాతం పెరుగుదలతో 47 లక్షలకు చేరింది. ఎంఎస్‌ఎంఈలకు రుణాలిచ్చేందుకు రిలయన్స్ క్యాపిటల్‌తో మంగళవారం ఒక ఒప్పందాన్ని ప్రకటించిన కర్నాటక బ్యాంక్ మిడ్‌క్యాప్ బ్యాంకింగ్ షేర్లన్నిటికన్నా అధికంగా 6 శాతానికిపైగా ర్యాలీ జరిపి రూ.115 వద్ద ముగిసింది. ఇదే రీతిలో యస్ బ్యాంక్, కోటక్‌బ్యాంక్ షేర్లు కూడా 3-4 శాతం మధ్య ఎగిశాయి. ఈ కౌంటర్లలో ఓపెన్ ఇంట్రస్ట్ 2.85 శాతం, 4.91 శాతం చొప్పున పెరిగింది. షేరు ధర పెరుగుతూ, ఓపెన్ ఇంట్రస్ట్ కూడా అధికమైతే సమీప భవిష్యత్‌లో సానుకూల అంచనాలున్నట్టుగా విశ్లేషకులు పరిగణిస్తుంటారు.
 
 పీఎస్‌యూ బ్యాంకింగ్ కౌంటర్లలోనూ....
 ప్రైవేటు బ్యాంకింగ్ షేర్లతో పాటే మిడ్‌క్యాప్ ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా, సిండికేట్, యూకో, విజయా, ఇండియన్ ఓవర్సీస్, ఐడీబీఐ బ్యాంకులు 2-3 శాతం మధ్య పెరిగాయి. కానీ ఈ కౌంటర్లన్నిటా ఓఐ యాడ్ కాలేదు. ఐడీబీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయా బ్యాంక్ కౌంటర్లలో షార్ట్ కవరింగ్‌ను సూచిస్తూ ఓఐ తగ్గింది. యూనియన్, సిండికేట్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కౌంటర్లలో 2-3 శాతం మధ్య ఓఐ యాడ్ అయింది.
 
 కర్నాటక బ్యాంక్ కౌంటర్లో ఆప్షన్ బిల్డప్....
 పైన ప్రస్తావించిన బ్యాంకింగ్ కౌంటర్లలో ఒక్క కర్నాటక బ్యాంక్ మినహా మిగిలిన వాటిలో ఆప్షన్ కాంట్రాక్టులు చురుగ్గా ట్రేడ్‌కావు. టేకోవర్ టార్గెట్‌గా కొద్ది నెలల నుంచి మార్కెట్లో నలుగుతున్న కర్నాటక బ్యాంక్ కౌంటర్లో రూ.110 వద్ద కాల్ ఓపెన్ ఇంట్రస్ట్ భారీగా 4.18 లక్షల షేర్ల మేర కట్ కావడంతో ఓఐ 2.88 లక్షల షేర్లకు పరిమిత మైంది. ఇదే ధర వద్ద పుట్ రైటింగ్ పెద్ద ఎత్తున జరగడంతో 3.02 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. పుట్ ఓఐ 6.08 లక్షలకు చేరింది. రూ.120 స్ట్రయిక్ వద్ద భారీగా 16.66 లక్షల కాల్ ఓఐ వుంది. ఈ స్ట్రయిక్ వద్ద తాజాగా 1.64 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. రూ. 110 మద్దతుతో రూ. 120 వరకూ పెరిగే సంకేతాల్ని ఈ డెరివేటివ్ డేటా వెల్లడిస్తున్నది.
 

మరిన్ని వార్తలు