8,400 దాటేసిన నిఫ్టీ

18 Nov, 2014 01:04 IST|Sakshi
8,400 దాటేసిన నిఫ్టీ

క్యూ3లో జపాన్ ఆర్థిక వ్యవస్థ ఊహించని రీతిలో మాంద్యంలోకి జారుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంట్ బలహీనపడింది. దీంతో జపాన్ మొదలు ఆసియా, యూరప్ మార్కెట్లు నష్టాలతో వెనుకంజ వేశాయి. దేశీయంగానూ ఈ ప్రభావం పడటంతో మార్కెట్లు తొలుత నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకుపైగా క్షీణించి 27,921 వద్ద కనిష్టాన్ని తాకింది.

అయితే అక్టోబర్ నెలలో దిగుమతుల భారం బాగా తగ్గి వాణిజ్యలోటు మరింత కట్టడికావడంతో మిడ్ సెషన్ నుంచీ సెంటిమెంట్ మెరుగైంది. ప్రధానంగా చమురు దిగుమతుల బిల్లు క్షీణించడం ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చిందని విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి నష్టాల నుంచి కోలుకున్న సెన్సెక్స్ 28,206 పాయింట్ల గరిష్టానికి చేరింది. చివరికి 131 పాయింట్ల లాభంతో 28,178 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త రికార్డులుకాగా, ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీ కూడా 41 పాయింట్లు పుంజుకుని 8,431 వద్ద ముగిసింది. అంతకుముందు ఇంట్రాడేలో 8,438ను చేరింది. మార్కెట్ చరిత్రలోనే ఇవి సరికొత్త గరిష్టాలుకావడం గమనార్హం.

 ఎస్‌బీఐ జోరు
 క్యూ2లో ప్రోత్సాహక ఫలితాల కారణంగా ఎస్‌బీఐ 5.5% జంప్‌చేసింది. రూ. 2,940 వద్ద ముగిసింది. ఇది ఏడాది గరిష్టంకాగా, 4% ఎగసిన టాటా మోటార్స్ రూ. 545 వద్ద కొత్త గరిష్టాన్ని తాకింది. ఈ బాటలో హీరోమోటో, ఎన్‌టీపీసీ, రిలయన్స్ సైతం 2-1.5% మధ్య పురోగమించాయి. అయితే మరోవైపు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు 1%పైగా నష్టపోయాయి. ఎఫ్‌ఐఐలు రూ. 656 కోట్లను ఇన్వెస్ట్ చేశారు.

 చిన్న షేర్లు ఓకే
 మార్కెట్‌ను మించుతూ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1% స్థాయిలో బలపడ్డాయి. బీఎస్‌ఈ-500లో గతి, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, బజాజ్ ఫైనాన్స్, కల్పతరు పవర్, అనంత్‌రాజ్, ఎన్‌సీసీ, ఎల్జీ ఎక్విప్‌మెంట్స్, స్టెరిలైట్ టెక్, వీగా ర్డ్, పీఎఫ్‌సీ 18-8% మధ్య దూసుకెళ్లాయి.

మరిన్ని వార్తలు