40,000 దాటిన సెన్సెక్స్‌

31 Oct, 2019 05:32 IST|Sakshi

220 పాయింట్ల లాభం

57 పాయింట్లు పెరిగి 11,844కు నిఫ్టీ  

ఆదాయపు పన్ను విషయంలో, ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించిన పన్ను అంశాల్లో కూడా ఊరటనిచ్చే నిర్ణయాలను కేంద్రం తీసుకోనున్నదన్న వార్తల కారణంగా బుధవారం స్టాక్‌ మార్కెట్‌ లాభపడింది. కంపెనీల సానుకూల క్యూ2 ఫలితాలు, షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు కలసివచ్చాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 40,000 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,800 పాయింట్ల ఎగువకు ఎగబాకాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల నిర్ణయం నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో అప్రమత్తత నెలకొన్నా, మన మార్కెట్‌ మాత్రం ముందుకే దూసుకుపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు పతనమై 70.91కు చేరినా, ఆ ప్రభావం కనిపించలేదు.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 220 పాయింట్ల లాభంతో 40,052 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 57 పాయింట్లు పెరిగి 11,844 పాయింట్ల వద్ద ముగిశాయి. ప్రభుత్వ రంగ కంపెనీలు, ఐటీ, ఆయిల్, గ్యాస్‌ షేర్లు పెరిగాయి. సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా నాలుగో రోజూ లాభపడ్డాయి. ఆల్‌టైమ్‌ హై స్థాయిలకు ఈ రెండు సూచీలు చెరో 250 పాయింట్ల దూరంలోనే ఉన్నాయి.  

ఈక్విటీ పన్ను సంస్కరణలు..
డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ (డీడీటీ)ను రద్దు చేయనున్నారని, దీర్ఘకాల మూలధన లాభాల పన్ను(ఎల్‌టీసీజీ), సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌(ఎస్‌టీటీ)ల్లో కూడా మార్పులు, చేర్పులు చేయనున్నారన్ని వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయని మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు కారణంగా కంపెనీల క్యూ2 ఫలితాలు అంచనాలను మించుతుండటం,  ప్రభుత్వ కంపెనీల్లో వాటా విక్రయం, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల తగ్గింపు అంచనాలు.. ఇవన్నీ సానుకూల ప్రభావం చూపించాయి.

► భారీ రుణభారంతో ఇప్పటికే కుదేలైన టెలికం కంపెనీలకు తాజాగా ఏజీఆర్‌ విషయమై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో కష్టాలు మరింతగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ రంగానికి బెయిలవుట్‌ ప్యాకేజీ నిమిత్తం  కార్యదర్శుల సంఘాన్ని కేంద్రం నియమించింది. ఈ నేపథ్యంలో టెలికం షేర్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఆరంభంలో 8.5% ఎగసిన వొడాఫోన్‌ ఐడియా షేర్‌ చివరకు 1% నష్టంతో రూ.3.81 వద్ద ముగిసింది.  ఎయిర్‌టెల్‌ షేర్‌ 2.3% లాభంతో రూ.368 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు