రోజంతా అమ్మకాలే

12 Apr, 2014 01:14 IST|Sakshi
రోజంతా అమ్మకాలే

ప్రపంచ మార్కెట్ల నష్టాలు దేశీయ స్టాక్స్‌పైనా ప్రభావం చూపాయి. మరోవైపు మార్చి నెలకు వాణిజ్య లోటు 10.5 బిలియన్ డాలర్లకు చేరడంతో సెంటిమెంట్ బలహీనపడింది. దీంతో ఇటీవల భారీగా లాభపడుతూ వ చ్చిన మార్కెట్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలకు దిగారు. వెరసి సెన్సెక్స్ రోజంతా నష్టాలలోనే కదిలింది. ఒక దశలో 190 పాయింట్ల వరకూ క్షీణించి 22,526 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. చివర్లో షార్ట్ కవరింగ్ కారణంగా కొంత కోలుకుని 86 పాయింట్ల నష్టంతో 22,629 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ కూడా 20 పాయింట్లు తగ్గి 6,776 వద్ద నిలిచింది. గత రెండు రోజుల్లో సెన్సెక్స్ 372 పాయింట్లు ఎగసిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఆయిల్, బ్యాంకింగ్, ఆటో రంగాలు 1% స్థాయిలో నీరసించగా, ఐటీ ఇండెక్స్ 1.5%, హెల్త్‌కేర్ 1% చొప్పున పుంజుకున్నాయి.
 
 వెలుగులో సాఫ్ట్‌వేర్ షేర్లు
 వచ్చే వారం మొదట్లో ఫలితాలు ప్రకటించనున్న సాఫ్ట్‌వేర్ దిగ్గజాల షేర్లు వెలుగులో నిలిచాయి. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ 2-1%  మధ్య పుంజుకోగా, హెల్త్‌కేర్ దిగ్గజాలు సన్ ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ సైతం అదే స్థాయిలో లాభపడ్డాయి. కాగా, మరోవైపు ఆటో దిగ్గజాలు ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్, హీరోమోటో, మారుతీ సహా ఆర్‌ఐఎల్, ఎస్‌బీఐ, హిందాల్కో, హెచ్‌యూఎల్, ఎల్‌అండ్‌టీ 1.5% స్థాయిలో క్షీణించాయి.
 
 ఎఫ్‌ఐఐల అమ్మకాలు
 శుక్రవారం కూడా చిన్న షేర్లకు డిమాండ్ కొనసాగింది. దీంతో ట్రేడైన షేర్లలో 1,539 పురోగమిస్తే, 1,267 నష్టపోయాయి. ఇటీవల నికర పెట్టుబడులకే కట్టుబడుతున్న ఎఫ్‌ఐఐలు తొలిసారి 362 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీ ఫండ్స్ రూటగు మార్చి రూ. 365 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి.

మరిన్ని వార్తలు