సెన్సెక్స్‌ 2,476 పాయింట్లు అప్‌

8 Apr, 2020 01:42 IST|Sakshi

కరోనా కేసులు, మరణాల్లో తగ్గుదల!

ప్రపంచ మార్కెట్ల పరుగులు 

బ్లూ చిప్‌షేర్లలో వేల్యూ బయింగ్‌  

2,476 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌  

30,067 వద్ద ముగింపు

708 పాయింట్లు ఎగసిన నిఫ్టీ  

 8,792 వద్ద ముగింపు 

బేర్‌ మార్కెట్లో ఇలాంటి పుల్‌ బ్యాక్‌ లేదా ట్రేడింగ్‌ ర్యాలీలు సహజమే. కోవిడ్‌–19 తీవ్రత నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులు పుంజుకోవడానికి ఇంకా కొంత కాలం పడుతుంది.  
–నీలేశ్‌ షా, ఎన్‌విజన్‌ క్యాపిటల్‌

సెన్సెక్స్, నిఫ్టీలు ఒక్క రోజులో రికార్డ్‌ స్థాయి లాభాలను మంగళవారం సాధించాయి. ఇటలీ, స్పెయిన్, అమెరికాల్లో కరోనా వైరస్‌ కొత్త కేసులు, మరణాలు తగ్గడంతో ప్రపంచ మార్కెట్లు లాభపడటం దీనికి ప్రధాన కారణం.  ఇటీవల బాగా పతనమై కొనుగోళ్లకు ఆకర్షణీయంగా ఉన్న బ్లూచిప్‌ షేర్లలో వేల్యూ బయింగ్‌ చోటు చేసుకోవడం, ఈ నెల 14 తర్వాత దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను దశలవారీగా ఉపసంహరించనున్నారన్న అంచనాలు కలసివచ్చాయి. సెన్సెక్స్‌ 30,000 పాయింట్లకు, నిఫ్టీ 8,750 పాయింట్లపైకి ఎగబాకాయి. అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి. వరుస రెండు సెషన్ల నష్టాలకు మంగళవారం బ్రేక్‌ పడింది.  

 ‘ఒక్క రోజు’ రికార్డ్‌ లాభాలు... 
మహావీర్‌ జయంతి సందర్భంగా సోమవారం స్టాక్‌ మార్కెట్‌ పనిచేయలేదు. ఆసియా మార్కెట్ల జోష్‌తో మన మార్కెట్‌ భారీ లాభాలతో ఆరంభమైంది. సెన్సెక్స్‌ 1,307 పాయింట్లు, నిఫ్టీ 362 పాయింట్ల లాభాలతో మొదలయ్యాయి. రోజు గడుస్తున్న కొద్దీ లాభాలు పెరుగుతూనే పోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 2,567 పాయింట్లు, నిఫ్టీ 735 పాయింట్ల మేర లాభపడ్డాయి. చివరకు  సెన్సెక్స్‌ 2,476 పాయింట్ల లాభంతో 30,067 పాయింట్ల వద్ద, నిఫ్టీ 708 పాయింట్లు పెరిగి 8,792 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలు ఒక్క రోజులో ఇన్నేసి పాయింట్లు పెరగడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఇక శాతం పరంగా చూస్తే సెన్సెక్స్‌ 8.97 శాతం, నిఫ్టీ 8.76 శాతం చొప్పున ఎగిశాయి. శాతం పరంగా చూస్తే, 2009, మే తర్వాత ఈ రెండు సూచీలు ఒక్క రోజులో ఈ రేంజ్‌లో పెరగడం కూడా ఇదే మొదటిసారి. ఆర్థిక, ఇంధన, వాహన రంగ షేర్లు బాగా పెరిగాయి. 

ఫార్మా షేర్ల పరుగులు...
24 ఔషధాల ఎగుమతులపై ఉన్న ఆంక్షలను కేంద్రం ఎత్తివేసింది. మొత్తం ఔషధాల ఎగుమతుల్లో వీటి వాటా 10 శాతం మేర ఉంటుందని అంచనా. దీంతో ఫార్మా షేర్లు జోరుగా పెరిగాయి. 

లాభాలకు కారణాలు...
కరోనా కేసుల ప్రభావం...
కరోనా వైరస్‌కు హాట్‌స్పాట్‌లైన ఇటలీ, స్పెయిన్, అమెరికాలో ఆదివారం నుంచి కొత్త కేసులు, మరణాలు తగ్గుతూ వచ్చాయి. కరోనా సంక్షోభం తగ్గుముఖం పడుతుందన్న అంచనాలతో కొనుగోళ్లు జోరుగా సాగాయి.  

లాభాల్లో ప్రపంచ మార్కెట్లు
సోమవారం ఆసియా, యూరప్‌ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. అమెరికా స్టాక్‌ సూచీలు 6 శాతం మేర ఎగిశాయి.  ఈ జోష్‌తో మంగళవారం ఆసియా మార్కెట్లు 2–4 శాతం రేంజ్‌లో, యూరప్‌ మార్కెట్లు 2 శాతం మేర లాభపడటం మన మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపించింది.  

ఎమ్‌ఎస్‌సీఐలో భారత వెయిటేజీ 
వివిధ కంపెనీల్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల పరిమితి పెంచే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటిఫై చేసింది. దీంతో ఎమర్జింగ్‌ మార్కెట్‌ ఇండెక్స్‌(ఈఎమ్‌ఐ)లో భారత కంపెనీల వెయిటేజీని ఎమ్‌ఎస్‌సీఐ(మోర్గాన్‌ స్టాన్లీ క్యాపిటల్‌ ఇంటర్నేషనల్‌) పెంచనున్నది. ఫలితంగా భారత కంపెనీల్లో 700 కోట్ల డాలర్ల మేర విదేశీ నిధులు వస్తాయని అంచనా.  

త్వరలో రెండో ప్యాకేజీ! 
కరోనా వైరస్‌ కల్లోలం, లాక్‌డౌన్‌ విధింపుతో కుదేలైన పారిశ్రామిక రంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్యాకేజీని సిద్ధం చేస్తోందన్న  వార్తలు.. సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి.  

బ్యాం‘కింగ్‌’ సెంటిమెంట్‌..
బ్యాంక్‌ రుణాల వృద్ధి ఆరోగ్యకరంగా ఉందని, డిపాజిట్లు సౌకర్యవంతమైన స్థాయిలోనే ఉన్నాయన్న నివేదిక బ్యాంక్‌ షేర్ల కొనుగోళ్లకు ఊపునిచ్చింది.  

దశలవారీగా లాక్‌డౌన్‌ తొలగింపు  
లాక్‌డౌన్‌ ముగిసే  ఈ నెల 14 తర్వాత వ్యాపార కొనసాగింపు ప్రణాళికలను సిద్ధం చేయాలని అన్ని మంత్రిత్వ శాఖలను ప్రధాని మోదీ కోరారు. దీంతో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ పాక్షికంగా తొలగే అవకాశాలున్నాయన్న అంచనాలు... ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి.  

వేల్యూ బయింగ్‌  
ఈ ఏడాది గరిష్టం నుంచి సూచీలు 30% పడిన నేపథ్యంలో ఆకర్షణీయ కొనుగోళ్లు.

రూ.7.7 లక్షల కోట్లు ఎగసిన ఇన్వెస్టర్ల సంపద  
స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.7.7 లక్షల కోట్లు ఎగసింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.7,71,377 కోట్లు పెరిగి రూ.116.38 లక్షల కోట్లకు చేరింది.

>
మరిన్ని వార్తలు