సెన్సెక్స్ రయ్ రయ్....

3 Jun, 2014 03:37 IST|Sakshi
సెన్సెక్స్ రయ్ రయ్....

468 పాయింట్లు జూమ్...; 24,685 పాయింట్లకు చేరిక
 
* ఆర్‌బీఐ పాలసీపై సానుకూల అంచనాల ప్రభావం
* విదేశీ మార్కెట్ల పటిష్టత కూడా...
* 133 పాయింట్లు ఎగబాకిన నిఫ్టీ, 7,362 పాయింట్ల వద్ద ముగింపు
* ఆకర్షణీయమైన ఫలితాలతో 6.4% ఎగసిన ఎల్‌అండ్‌టీ షేరు

 
 
 ముంబై: మార్కెట్లలో మరోసారి ‘బుల్’ రంకేసింది. ఆర్‌బీఐ  పరపతి విధాన సమీక్షలో వడ్డీరేట్ల తగ్గింపు ఆశలు... మరోపక్క విదేశీ స్టాక్ మార్కెట్ల జోరుతో దేశీ సూచీలు కదంతొక్కాయి. కన్సూమర్ గూడ్స్, చమురు-గ్యాస్, విద్యుత్, మెటల్స్ రంగాల షేర్లతో పాటు బ్యాంకింగ్ స్టాక్స్ కూడా మెరుపులు మెరిపించాయి. దీంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 468 పాయింట్లు దూసుకెళ్లి... 24,685 పాయింట్ల వద్ద స్థిరపడింది. గడచిన మూడు వారాల్లో సెన్సెక్స్‌కు ఇదే అతిపెద్ద లాభం, వారం రోజుల గరిష్టస్థాయి కావడం గమనార్హం. కాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 133 పాయింట్ల భారీ లాభంతో 7,363 పాయింట్ల వద్ద ముగిసింది.
 
 రోజంతా దూకుడే...

 దేశీ మార్కెట్లు సోమవారం రోజంతా లాభాలతో పైపైకి ఎగబాకుతూనే ఉన్నాయి. గత ముగింపు 24,217 పాయింట్లతో పోలిస్తే సెన్సెక్స్ 152 పాయింట్ల లాభంతో 24,369 వద్ద ప్రారంభమైంది. ఆతర్వాత లాభాల జోరును అంతకంతకూ కొనసాగిస్తూ... 24,709 పాయింట్ల గరిష్టాన్ని కూడా తాకింది. చివరకు 1.83 శాతం లాభంతో పటిష్టస్థాయిలో 24,685 వద్ద స్థిరపడింది. జీడీపీ గణాంకాలు నిరాశాజనకంగానే(2013-14లో వృద్ధిరేటు 4.7 శాతం) ఉన్న నేపథ్యంలో.. మార్కెట్లలో రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) వడ్డీరేట్ల తగ్గింపు ఆశలు చిగురించాయి.

అయితే, చాలావరకూ బ్యాంకర్లు, నిపుణులు మాత్రం ఆర్‌బీఐ నేడు చేపట్టనున్న సమీక్షలో పాలసీ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచొచ్చని అభిప్రాయపడుతున్నారు. మరోపక్క, మే నెలకు సంబంధించి హెచ్‌ఎస్‌బీసీ భారత్ తయారీ రంగ సూచీ(పీఎంఐ)లో పరిశ్రమలు కాస్త పుంజుకున్న సంకేతాలు కనబడటం కూడా మార్కెట్లలో సానుకూల సెంటిమెంట్‌కు దోహదం చేసిందని బ్రోకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, మోడీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం... వృద్ధిని తిరిగి గాడిలోపెట్టగల సమర్థ నిర్ణయాలు తీసుకోగలదన్న విశ్వాసం పెరుగుతుండటం కూడా దేశీయ మార్కెట్లో బుల్లిష్ ధోరణిని పెంచుతోందని కోటక్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ సంజీవ్ జర్బాడే చెప్పారు. ఇక చైనా తయారీ రంగం పుంజుకోవడం ఆసియా మార్కెట్లకు టానిక్‌లా పనిచేసింది. జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఇక సెలవు కారణంగా చైనా, హాంకాంగ్, తైవాన్ మార్కెట్లు పనిచేయలేదు.
 
రెండు రంగాలు మినహా...
బీఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్ రంగాల సూచీల్లో స్వల్ప నష్టాలు మినహా మిగతా అన్ని రంగాల సూచీలూ లాభాల్లోనే నిలిచాయి. ప్రధానంగా కన్సూమర్ గూడ్స్ సూచీ అత్యధికంగా 4.93 శాతం ఎగబాకింది. ఇక బ్యాంకింగ్ 3.28 శాతం, చమురు-గ్యాస్ సూచీ 2.85 శాతం, విద్యుత్ సూచీ 2.38 శాతం, మెటల్స్ 1.86 శాతం, రియల్టీ 1.43 శాతం చొప్పున లాభపడ్డాయి. ఆర్‌బీఐ పాలసీ సమీక్ష నేపథ్యంలో బ్యాంకింగ్ షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా అంచనాలకంటే ముందే ఆర్‌బీఐ రేట్ల కోత ఉండొచ్చని, తాజా పాలసీలో ఈ మేరకు నిర్దిష్ట సంకేతాలు ఉంటాయన్న అభిప్రాయంతో బ్యాంకింగ్, రేట్లతో సంబంధం ఉన్న రంగాల షేర్లు పుంజుకున్నాయని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ జిగ్నేష్ చౌదరి చెప్పారు.
 
ఇతర ముఖ్యాంశాలివీ...
ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్‌అండ్‌టీ అంచనాలను మించిన ఫలితాలతో బంపర్ లాభాలను ప్రకటించడంతో కంపెనీ షేరు రివ్వున ఎగసింది. 6.23 శాతం జంప్ చేసి రూ.1,645 వద్ద స్థిరపడింది.
     
ప్రాథమిక గణాంకాల ప్రకారం ఎఫ్‌ఐఐలు సోమవారం నికరంగా రూ.234 కోట్ల విలువైనస్టాక్స్‌ను కొనుగోలు చేసినట్లు అంచనా.
     
 భారతీ ఎయిర్‌టెల్ 5.52%, ఓఎన్‌సీజీ 5.17%, టాటా స్టీల్ 4.42%, ఎస్‌బీఐ 4.23%, యాక్సిస్ బ్యాంక్ 3.59%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 3.26%, మారుతీ 3.06%, గెయిల్ 2.86%, హెచ్‌డీఎఫ్‌సీ 2.31%, ఇన్ఫోసిస్ 1.92%, రిలయన్స్ 1.84%, టాటా మోటార్స్ 1.58% చొప్పున ఎగబాకాయి.
     
 బీఎస్‌ఈ సెన్సెక్స్ జాబితాలోని మొత్తం 30 స్టాక్స్‌లో 24 లాభాలతో ముగిశాయి.
     
 బీఎస్‌ఈలో నగదు విభాగంలో టర్నోవర్ రూ.3,619 కోట్లకు పరిమితమైంది. గత శుక్రవారం ఈ మొత్తం రూ.10,538 కోట్లు కావడం విశేషం. ఇక ఎన్‌ఎస్‌ఈ క్యాష్ విభాగంలో రూ.17,718 కోట్లు, డెరివేటివ్స్‌లో రూ.1.33 లక్షల కోట్ల టర్నోవర్ నమోదైంది.

మరిన్ని వార్తలు