మార్కెట్లో దివాలీ బొనాంజా : ఎయిర్‌టెల్‌కు షాక్‌

29 Oct, 2019 11:27 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. సంవత్‌ 2076కు శుభారంభాన్నిచ్చిన ఇన్వెస్టర్లు మంగళవారం కూడా  కొనుగోళ్లకు క్యూ కట్టడంతో దలాల్‌ స్ట్రీట్‌ దీపావళి మతాబులా వెలిగిపోతోంది. యుఎస్-చైనా వాణిజ్య చర్చలలో పురోగతి, ఫెడరల్ రిజర్వ్ పాలసీ రివ్యూ సమావేశాలు, 25 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీ కోత ఉండనుందని అంచనాలతోపాటు , ఉద్దీపన ప్యాకేజీ వుంటుందనే ఊహాగానాలతో వాల్ స్ట్రీట్ ఆల్-టైమ్ గరిష్టానికి చేరింది. అలాగే ఇతర ఆసియా మార్కెట్ల సానుకూల ధోరణితో మూడు నెలల గరిష్టాన్ని తాకాయి.

సెన్సెక్స్ 430 పాయింట్లు పెరిగి 39,680 వద్ద, నిఫ్టీ 123పాయింట్లు ఎగిసి 11,751 వద్దకు చేరుకుంది. ఆరంభంలో ఫ్లాట్‌గా ఉన్న సూచీలు  రికార్డు స్థాయిలను అధిగమించేందుకు చేరువలో ఉన్నాయి.  దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. అయితే ఏజీఆర్‌ ఫీజు సుప్రీం తీర్పు నేపధ్యంలో  టెలికాం  రంగం నష్టపోతోంది.  దీనికి తోడు ఫలితాల ప్రకటనను నవంబరు 14 కు వాయిదా వేసింది. ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో సర్దుబాటు తదుపరి స్థూల ఆదాయం మదింపు అంశంలో స్పష్టత రావలసి ఉన్నట్లు ఎయిర్‌టెల్‌ పేర్కొంది. ఈ అంశంలో టెలికం నియంత్రణ సంస్థ(ట్రాయ్‌)ను సంప్రదిస్తున్నట్లు తెలియజేసింది. ఈ దెబ్బతో ఎయిర్‌టెల్‌ 4 శాతానికిపైగా నష్టపోయింది.

ప్రదానంగా బ్యాంకు, ఆటో, మెటల్‌ రంగ లాభాలు మార్కెట్‌ను లీడ్‌ చేస్తున్నాయి.  టాటా మోటార్స్‌ టాప్‌ విన్నర్స్‌గా కొనసాగుతుండగా,  ఎం అండ్‌ ఎం, టాటా స్టీల్‌, రిలయన్స్‌, టీసీఎస్‌, మారుతి,  ఐసీఐసీఐ, బజాజ్‌ లాభపడుతుండగా, మరోవైపు ఎస్‌బ్యాంకు, నెస్లే,  భారతి ఇన్‌ఫ్రాటెల్‌,కోల్‌ ఇండియా, గ్రాసిం, కోట్‌మహీంద్ర, నష్టపోతున్నాయి. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా