36 వేల దిగువకు సెన్సెక్స్‌

15 Feb, 2019 01:28 IST|Sakshi

ఆరో రోజూ కొనసాగిన నష్టాలు 

ఎగసిన ముడి చమురు ధరలు 

బలహీనపడిన రూపాయి 

158 పాయింట్లు తగ్గి35,876కు సెన్సెక్స్‌

48 పాయింట్లు పతనమై 10,746కు నిఫ్టీ 

అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో మన మార్కెట్లో గురువారం కూడా నష్టాలు కొనసాగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌  36 వేల పాయింట్ల దిగువకు పడిపోయింంది. 158 పాయింట్ల నష్టంతో 35,876 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 48 పాయింట్లు పతనమై 10,746 పాయింట్ల వద్ద ముగిసింది. వరుసగా ఆరో రోజూ సెన్సెక్స్‌ నష్టాల్లోనే ముగిసింది. ఈ ఆరు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ మొత్తం 1,099 పాయింట్లు నష్టపోయింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉండటంతో అమ్మకాల జోరు పెరిగింది. యూరప్‌ మార్కెట్లు లాభాల్లో ఆరంభం కావడంతో స్టాక్‌ సూచీల నష్టాలు పరిమితమయ్యాయి. ఐటీ, లోహ, ఇంధన, పీఎస్‌యూ షేర్లు క్షీణించాయి.
 
310 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌ 
ముడి చమురు ఉత్పత్తి, సరఫరాల్లో కోత విధిస్తామని ప్రపంచ అతి పెద్ద చమురు ఉత్పత్తి దేశం సౌదీ అరేబియా వెల్లడించడంతో ముడిచమురు ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. దీంతో  ఇంధన షేర్లు క్షీణించాయి. ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ షేర్లు–ఐఓసీ, బీపీసీఎల్‌లు 4 శాతం వరకూ నష్టపోయాయి. టోకు ధరల ద్రవ్యోల్బణం పది నెలల కనిష్ట స్థాయి, 2.76 శాతానికి పడిపోయింది. టోకు ధరల ద్రవ్యోల్బణం తగ్గడం ఆర్థిక వ్యవస్థ,  కంపెనీ లాభాల మందగమనాన్ని సూచిస్తోందని నిపుణులు అంటున్నారు. సెన్సెక్స్‌ స్వల్ప లాభాల్లో ఆరంభమైంది. ఆరంభ కొనుగోళ్ల జోరుతో 75 పాయింట్లు లాభపడింది. అమ్మకాలు పెరగడంతో నష్టాల్లోకి జారిపోయింది. ఇంట్రాడేలో 235 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 310 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 75 పాయింట్ల వరకూ నష్టపోయింది. డాలర్‌తో రూపాయి మారకం బలహీనపడటం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. 

యస్‌ బ్యాంక్‌ జోరు... 
మొండి బకాయిల విషయంలో దాపరికాలేవీ లేవంటూ ఆర్‌బీఐ క్లీన్‌చిట్‌ ఇవ్వడంతో యస్‌ బ్యాంక్‌ షేర్‌ 31 శాతం పెరిగి రూ.221 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్‌ 32 శాతం ఎగసి రూ.224ను తాకింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో అత్యధికంగా పెరిగిన షేర్‌ ఇదే. 2005, జూలై 12న ఈ షేర్‌ స్టాక్‌ మార్కెట్లో లిస్టయింది. స్టాక్‌ మార్కెట్లో లిస్టయిన తర్వాత ఈ షేర్‌ ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. షేర్‌ జోరుగా పెరగడంతో బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.12,025 కోట్లు పెరిగి రూ.51,114 కోట్లకు చేరింది. 
►ఇంట్రాడేలో 6 శాతం నష్టంతో రూ.104కు పడిపోయిన  డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్‌ చివరకు 16 శాతం లాభంతో రూ.128 వద్ద ముగిసింది.  
► ఆరు రోజుల నష్టాల కారణంగా  ఇన్వెస్టర్ల సంపద రూ.3.63 లక్షల కోట్లు హరించుకుపోయింది.  

కార్పొబ్రీఫ్‌...
ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌: జర్మనీకి చెందిన నీల్సన్‌ ప్లస్‌ పార్ట్‌నర్‌ కంపెనీని రూ.224 కోట్లకు కొనుగోలు చేయనున్నది. హాంబర్గ్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నీల్సన్‌ ప్లస్‌ పార్ట్‌నర్‌ కంపెనీని తమ జర్మనీ అనుబంధ సంస్థ, లార్సెన్‌ అండ్‌ టుబ్రో ఇన్ఫోటెక్‌ జీఎమ్‌బీహెచ్‌ కొనుగోలు చేయడానికి ఒక ఒప్పందం కుదుర్చుకుందని వివరించింది. ఆరు వారాల్లో ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తవ్వగలదని అంచనా.    

మరిన్ని వార్తలు