173 పాయింట్లు డౌన్

4 Mar, 2014 01:54 IST|Sakshi
173 పాయింట్లు డౌన్

 ఎట్టకేలకు ఐదు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. క్యూ3లో అంచనాలను అందుకోని జీడీపీ, చైనా ఆర్థిక మందగమనం, ఉక్రెయిన్-రష్యా యుద్ధ భయాలు కలసి సెంటిమెంట్‌ను దెబ్బకొట్టాయి. దీంతో సెన్సెక్స్ 173 పాయింట్లు పడి 21,000 దిగువన 20,947 వద్ద ముగిసింది. ఈ బాటలో నిఫ్టీ కూడా 56 పాయింట్లు క్షీణించి 6,221 వద్ద నిలిచింది. ఇది వారం రోజుల కనిష్టంకాగా, హెల్త్‌కేర్, ఐటీ, విద్యుత్, ఆటో రంగాలు 1%పైగా నీరసించాయి. గత ఐదు రోజుల్లో సెన్సెక్స్ 583 పాయింట్లు ఎగసిన సంగతి తెలిసిందే. యుద్ధ భయాల కారణంగా చమురు ధరలు పుంజుకోవడంతో దేశీయంగా ద్రవ్యలోటు పెరుగుతుందన్న ఆందోళనలు ఇన్వెస్టర్లలో వ్యాపించాయని నిపుణులు పేర్కొన్నారు. దీంతో డాలరుతో మారకంలో రూపాయి విలువ సైతం 62 స్థాయికి బలహీనపడిందని పేర్కొన్నారు. ఇటీవల భారీగా లాభపడ్డ హెల్త్‌కేర్, ఐటీ షేర్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలు చేపట్టగా, ఫిబ్రవరి నెలకు అమ్మకాలు తగ్గడంతో ఆటో షేర్లు డీలాపడ్డాయని విశ్లేషించారు.

 మరిన్ని విశేషాలివీ...
     సెన్సెక్స్ దిగ్గజాలలో ఆర్‌ఐఎల్, టాటా స్టీల్, హిందాల్కో, ఐటీసీ, కోల్ ఇండియా మాత్రమే అదికూడా నామమాత్రంగా లాభపడ్డాయి.
     హెల్త్‌కేర్ షేర్లలో పిరమల్ ఎంటర్‌ప్రైజెస్, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, సిప్లా తదితరాలు 3-2% మధ్య నష్టపోయాయి.

 ఇతర బ్లూచిప్స్‌లో హెచ్‌సీఎల్ టెక్ 4.5% పతనంకాగా, భెల్, ఎంఅండ్‌ఎం, సెసాస్టెరిలైట్, విప్రో, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, టీసీఎస్, ఐసీఐసీఐ, హెచ్‌యూఎల్, ఎల్‌అండ్‌టీ 3-1% మధ్య తిరోగమించాయి.

 డీలిస్టింగ్ వార్తలతో ఆస్ట్రాజెనెకా 20% దూసుకెళ్లి రూ. 1,111 వద్ద ముగిసింది. కంపెనీలో స్వీడిష్ మాతృ  సంస్థకు 75% వాటా ఉంది. మరోవైపు అబుదాబీ కంపెనీకి రెండు జల విద్యుత్ ప్లాంట్లను విక్రయిస్తున్న నేపథ్యంలో జేపీ పవర్ వెంచర్స్ 15%పైగా పతనమైంది.

రైల్వేలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్ లభిస్తుందన్న అంచనాలతో కెర్నెక్స్ మైక్రో, కాళిందీ రైల్, టిటాగఢ్ వ్యాగన్స్, టెక్సమాకో రైల్ 12%-3% మధ్య జంప్‌చేశాయి. ఇతర షేర్లలో జూబిలెంట్ లైఫ్, పేపర్     {పొడక్ట్స్ 10% చొప్పున పురోగమించాయి.
 
 రష్యా ఇండెక్స్ 9% పతనం
 ఉక్రెయిన్‌లోకి రష్యా మిలటరీ దళాల ప్రవేశం నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో  రష్యా కరెన్సీ రూబుల్ 2.5% పతనమై కొత్త కనిష్టం 36.5కు చేరింది. వెరసి మాస్కో ఇండెక్స్ ఎంఐసీఈఎక్స్ 9% దిగజారింది. రష్యా కేంద్ర బ్యాంకు ఉన్నపళాన రుణాలపై వడ్డీ రేట్లను 5.5% నుంచి 7%కు పెంచింది. అంతేకాకుండా రూబుల్‌కు బలాన్నిచ్చేందుకు 10 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలను విక్రయించింది. మరోవైపు ఆసియా, యూరప్ స్టాక్ మార్కెట్లు 0.5-2% మధ్య నీరసించాయి. కడపటి సమాచారం అందేసరికి అమెరికా సూచీలు 1 శాతంపైగా క్షీణతతో ట్రేడవుతున్నాయి.

మరిన్ని వార్తలు