కొనసాగిన నష్టాలు..

17 Aug, 2018 00:30 IST|Sakshi

వీడని టర్కీ భయాలు  

ఆందోళన పరిచిన వాణిజ్య లోటు  

జీవిత కాల కనిష్టానికి రూపాయి  

188 పాయింట్లు పతనమై 37,664కు సెన్సెక్స్‌

50 పాయింట్లు క్షీణించి 11,385కు నిఫ్టీ  

టర్కీ ఆర్థిక సంక్షోభం, రూపాయి జీవిత కాల కనిష్ట స్థాయికి పడిపోవడం.. గురువారం స్టాక్‌ మార్కెట్‌ను నష్టపరిచాయి. వాణిజ్య లోటు ఐదేళ్ల గరిష్టానికి చేరడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. బ్యాంక్, లోహ షేర్లు పతనం కావడంతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన 11,400 పాయింట్ల దిగువకు, సెన్సెక్స్‌ 37,700 పాయింట్ల దిగువకు పడిపోయాయి.

నిఫ్టీ  50 పాయింట్లు పతనమై, 11,385 పాయింట్ల వద్ద ముగియగా,  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 188 పాయింట్లు క్షీణించి 37,664 పాయింట్లకు చేరింది. టర్కీ కరెన్సీ సంక్షోభం, చైనాలో అర్థిక మందగమనం చోటు చేసుకోగలదన్న భయాలతో ఆసియా మార్కెట్లు నష్టపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ కుదేలైంది. వాణిజ్య లోటు ఐదేళ్ల గరిష్ట స్థాయి,  1,800 కోట్ల డాలర్లకు పెరగడం, రూపాయి ఇంట్రాడేలో జీవిత కాల కనిష్ట స్థాయి, 70.40ను తాకడం ప్రతికూల ప్రభావం చూపించాయి.   

258 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌...
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం సెలవు అనంతరం సెన్సెక్స్‌ నష్టాల్లో ఆరంభమైంది. బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలే దీనికి ప్రధాన కారణం. చివరి రెండు గంటల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఒక దశలో 40 పాయింట్ల వరకూ లాభపడిన సెన్సెక్స్‌ మరో దశలో 218 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద 258 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.

ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా, టాటా మోటార్స్‌ షేర్లు లాభపడటంతో నష్టాలు తగ్గాయి. వాణిజ్య లోటు పెరగడంతో రూపాయి క్షీణించిందని, దీంతో స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌  వినోద్‌ నాయర్‌ పేర్కొన్నారు. రూపాయి బలహీనత, ద్రవ్యోల్బణ భయాలతో బాండ్ల రాబడులు పెరిగాయని వివరించారు. రూపాయి పతనం కారణంగా ఫార్మా, ఐటీ షేర్లు పెరిగాయని, లోహ, పీఎస్‌యూ బ్యాంక్‌షేర్లు నష్టపోయాయని పేర్కొన్నారు.  

21 ఏళ్ల గరిష్టానికి గెయిల్‌ ఇండియా
స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయినప్పటికీ, గెయిల్‌ ఇండియా షేర్‌ 3.6 శాతం లాభంతో రూ.394 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్‌కు 21 ఏళ్ల గరిష్ట స్థాయిని అధిగమించి ఆల్‌టైమ్‌ హై, రూ.399ను తాకింది.  నిఫ్టీ షేర్లలో బాగా లాభపడిన షేర్‌ ఇదే.  ఈ షేర్‌ 38.2 శాతం ఫిబోనాకి రిట్రేస్‌మెంట్‌ స్థాయి,రూ.392ను దాటేసిందని, మరింతగా ఎగియనున్నదని నిపుణులంటున్నారు. ఇటీవలే ఈ కంపెనీ అంచనాలను మించిన ఫలితాలను వెల్లడించింది.  
కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ప్రమోటర్‌ ఉదయ్‌ కోటక్‌ ఇటీవలి వాటా విక్రయం నిబంధనలకు అనుగుణంగా లేదని ఆర్‌బీఐ పేర్కొనడంతో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 3.6 శాతం నష్టపోయి, రూ.1,245 వద్ద ముగిసింది.  సెన్సెక్స్, నిఫ్టీ రెండు సూచీల్లో  బాగా నష్టపోయిన షేర్‌ ఇదే. ఈ ప్రభావంతో ఇతర బ్యాంక్‌ షేర్లూ నష్టపోయాయి.  
   లాభాల స్వీకరణ కారణంగా యస్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, ఎస్‌బీఐ షేర్లు 1 శాతం వరకూ నష్టపోయాయి.  
   నేత్ర వైద్యానికి సంబంధించిన ఔషధానికి అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం లభించడం, రూపాయి పతనం కారణంగా సన్‌ ఫార్మా షేర్‌ 2.9 శాతం లాభంతో రూ.618 వద్ద ముగిసింది. ఇది ఈ షేర్‌కు తాజా ఏడాది గరిష్ట స్థాయి.  
   మార్కెట్‌ నష్టపోయినప్పటికీ, పలు షేర్లు ఆల్‌టైమ్‌ హైలనుతాకాయి. ఇన్ఫోసిస్, గెయిల్‌ ఇండియా, బజాజ్‌ ఫైనాన్స్, బజాజ్‌ ఫిన్‌సర్వ్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, బాటా ఇండియా, బెర్జర్‌ పెయింట్స్, డాబర్‌ ఇండియా, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్, గెయిల్‌(ఇండియా), హావెల్స్‌ ఇండియా, ఇండియా బుల్స్‌ వెంచర్స్, జుబిలంట్‌ ఫుడ్, ఫైజర్, వరుణ్‌ బేవరేజేస్‌ షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

>
మరిన్ని వార్తలు