క్రాష్ మార్కెట్!

17 Dec, 2014 00:39 IST|Sakshi
క్రాష్ మార్కెట్!

సెన్సెక్స్ 538 పాయింట్లు డౌన్

27,000 స్థాయి దిగువకు...
ఏడాదిన్నర కాలంలో అతిపెద్ద పతనం
152 పాయింట్లు దిగజారిన నిఫ్టీ
ఐదున్నరేళ్ల కనిష్టానికి చమురు ధరలు
సంక్షోభంలో రష్యన్ కరెన్సీ ‘రూబుల్’  
నష్టాలలో ప్రపంచ స్టాక్ మార్కెట్లు

 
ప్రపంచ స్టాక్ మార్కెట్ల నష్టాలకు తోడు తాజాగా కరెన్సీ ఆందోళనలు దేశీ స్టాక్ మార్కెట్లను పడగొట్టాయి. దేశీయంగానూ పారిశ్రామికోత్పత్తి క్షీణించడం, వాణిజ్యలోటు పుంజుకోవడం వంటి అంశాలు సెంటిమెంట్‌ను దెబ్బకొట్టాయి. వీటికి ఎఫ్‌ఐఐల అమ్మకాలు జత కలవడంతో సెన్సెక్స్ ఏడాదిన్నర కాలంలో లేనివిధంగా 538 పాయింట్లు పతనమైంది. 27,000 పాయింట్ల కీలక స్థాయికి దిగువన 26,781 వద్ద ముగిసింది. దాదాపు రెండు నెలల కనిష్టమిది! సెన్సెక్స్ ఇంతక్రితం 2013 సెప్టెంబర్ 3న మాత్రమే ఈ స్థాయిలో 651 పాయింట్లు కోల్పోయింది.  
 
ఏం జరుగుతోంది?
ఇటీవల నాలుగేళ్ల కనిష్టానికి చేరిన మలేసియన్ కరెన్సీ రింగిట్‌కు జతగా రష్యన్ కరెన్సీ రూబుల్ తాజాగా డాలరుతో మారకంలో చరిత్రాత్మక కనిష్టానికి పడిపోయింది. ఈ ఏడాది జనవరి నుంచీ 50% విలువ కోల్పోయింది. దీంతో 1998 తరువాత మళ్లీ రష్యా హుటాహుటిన వడ్డీ రేటును 10.5% నుంచి ఏకంగా 17%కు పెంచివేసింది. అక్కడి స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీ కూడా 14 శాతం పైగా కుప్పకూలింది. మరోపక్క రష్యా, మలేసియాసహా చమురు ఉత్పాదక దేశాల ఆదాయాన్ని దెబ్బతీస్తూ తాజాగా ముడిచమురు ధరలు ఐదున్నరేళ్ల కనిష్టాన్ని తాకడం కూడా ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంట్‌ను బలహీనపరచింది.

బ్రెంట్ చమురు బ్యారల్ ధర 58.5 డాలర్ల స్థాయికి దిగిరాగా, నెమైక్స్ రకం 54.5 డాలర్ల స్థాయిలో కదులుతోంది. ఇక ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న గణాంకాల నడుమ అమెరికా ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల పరపతి సమీక్షా సమావేశాలు మంగళవారం మొదలయ్యాయి. ఫెడ్ వడ్డీ రేట్లను పెంచే సంకేతాలు వెల్లడిస్తే డాలర్ నిధులు వెనక్కు మళ్లుతాయన్న భయాలు ఇప్పటికే వర్ధ మాన దేశాలను కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే చైనా తయారీ రంగ మందగమన ఆందోళనలు, జపాన్ మాంద్య పరిస్థితులు ఆసియా మార్కెట్లను వణికిస్తున్నాయి. ఈ అంశాల నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్‌లో యూరప్, అమెరికా మార్కెట్లు 2.5-1% మధ్య నష్టపోయాయి. మంగళవారం చైనా మినహా జపాన్ తదితర ఆసియా మార్కెట్లు కూడా నీరసించాయి.
 
దేశీయంగానూ...
దేశీయంగా చూస్తే నవంబర్‌లో వాణిజ్య లోటు 7 బిలియన్ డాలర్లమేర పెరిగి 18 నెలల గరిష్టాన్ని తాకింది. దీంతో డాలరుతో మారకంలో రూపాయి 13 నెలల కనిష్టమైన 63.53కు చేరింది. మరోవైపు గత రెండు రోజుల్లో రూ. 1,325 కోట్ల విలువైన షేర్లను విక్రయించిన ఎఫ్‌ఐఐలు తాజాగా రూ. 1,250 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ప్రపంచ మార్కెట్ల బలహీనతలకుతోడు ఇలాంటి పలు అంశాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేశాయి. దీంతో ట్రేడింగ్ గడిచేకొద్దీ అమ్మకాలు వెల్లువెత్తాయి. వెరసి ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీ సైతం 152 పాయింట్లు పడిపోయి 8,068 వద్ద నిలిచింది.

ఇతర ప్రధాన అంశాలివీ...
బీఎస్‌ఈలో ఐటీ మినహా అన్ని రంగాలూ 4-1.5% మధ్య పతనమయ్యాయి. డాలర్ బలోపేతంతో హెచ్‌సీఎల్‌టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా 4.5-1.5% మధ్య లాభపడ్డాయి.
ప్రధానంగా మెటల్, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్, హెల్త్‌కేర్ సూచీలు 4-3% మధ్య నీరసించాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు సైతం మార్కెట్లను మించుతూ 3% చొప్పున పడిపోయాయి.
సెన్సెక్స్ దిగ్గజాలలో సెసాస్టెరిలైట్, డాక్టర్ రెడ్డీస్, హిందాల్కో, ఎస్‌బీఐ, టాటా పవర్, ఐసీఐసీఐ, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్, ఓఎన్‌జీసీ 8-2% మధ్య తిరోగమించాయి.
ప్రతికూల పరిస్థితులను ప్రతిబింబిస్తూ ట్రేడైన షేర్లలో 2,327 నష్టపోతే, కేవలం 541 లాభపడ్డాయి.
రియల్టీ రంగానికి చెందిన షేర్లలో యూనిటెక్, హెచ్‌డీఐఎల్, అనంత్‌రాజ్, ఒబెరాయ్, డీబీ, ఇండియాబుల్స్, డీఎల్‌ఎఫ్ 11-4% మధ్య కుప్పకూలాయి.

మరిన్ని వార్తలు