లాభనష్టాల... ఊగిసలాట

15 Mar, 2019 05:39 IST|Sakshi

చివరకు అక్కడక్కడే ముగింపు...

3 పాయింట్లతో 37,755కు సెన్సెక్స్‌

2 పాయింట్లు పెరిగి 11,343కు నిఫ్టీ

ఆద్యంతం లాభ, నష్టాల మధ్య దోబూచులాడిన స్టాక్‌ సూచీలు గురువారం చివరకు అక్కడక్కడే ముగిశాయి. ఐటీ, ఇంధన, వాహన షేర్లలో భారీగా లాభాల స్వీకరణ చోటు చేసుకున్నప్పటికీ, ఆర్థిక, విద్యుత్, ఫార్మా రంగ షేర్లు ఆదుకోవడంతో స్టాక్‌ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 3 పాయింట్లు పెరిగి 37,755 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 2 పాయింట్లు పెరిగి 11,343 పాయింట్ల వద్దకు చేరాయి. స్టాక్‌ సూచీలు స్వల్పంగానే లాభపడినప్పటికీ, కీలకమైన స్థాయిలపైననే ముగియగలిగాయి. ఒక దశలో 156 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ మరో దశలో 58 పాయింట్లు నష్టపోయింది.  రోజంతా   214 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.  

బ్యాంక్‌ షేర్లు భళా....
ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలతో బ్యాంక్‌ షేర్లు పెరుగుతున్నాయి. డాలర్‌–రూపీ స్వాప్‌ యాక్షన్‌ మార్గంలో మూడేళ్లలో 500 కోట్ల డాలర్ల నిధులను ఆర్‌బీఐ అందించనుండటంతో రుణ వృద్ది మరింతగా మెరుగుపడుతుందనే భావనతో బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. బ్యాంక్‌ నిఫ్టీ ఆల్‌టైమ్‌ హై రికార్డ్‌లు గురువారం కూడా కొనసాగాయి. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, 29,070 పాయింట్లను తాకిన బ్యాంక్‌ నిఫ్టీ చివరకు 0.1 శాతం లాభంతో 28,923 పాయింట్ల వద్ద ముగిసింది.

ముఖ విలువ దిగువకు ఆర్‌కామ్‌....
యాక్సిస్‌ ట్రస్టీస్‌ సర్వీసెస్‌ తన వద్ద తనఖాగా ఉన్న  రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ కంపెనీకి చెందిన 4.34 శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను విక్రయించింది. దీంతో ఆర్‌కామ్‌ షేర్‌ ముఖ విలువ (రూ.5) కంటే తక్కువకు, రూ.4.65కు పడిపోయింది. ఆర్‌కామ్‌తో పాటు అనిల్‌ అంబానీకి చెందిన ఇతర కంపెనీ షేర్లు–రిలయన్స్‌ క్యాపిటల్, రిలయన్స్‌ పవర్, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్, రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ షేర్లు 2–7 శాతం రేంజ్‌లో పడిపోయాయి.
 

మరిన్ని వార్తలు