గణాంకాలతో లాభాలు

15 Sep, 2018 02:52 IST|Sakshi

మళ్లీ 38వేలు దాటిన సెన్సెక్స్‌

10,500 దాటేసిన నిఫ్టీ

ప్రధాని సమీక్షపై అంచనాలు

కోలుకున్న రూపాయి

సానుకూల ద్రవ్యోల్బణం గణాంకాలు

తగ్గిన ముడి చమురు ధరలు

373 పాయింట్ల లాభంతో 38,091కు సెన్సెక్స్‌

145 పాయింట్లు పెరిగి 11,515కు  చేరిన నిఫ్టీ  

ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఆశావహంగా ఉండటంతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా లాభపడింది. రూపాయి రికవరీకి తోడు అంతర్జాతీయ సంకేతాలు కూడా సానుకూలంగా ఉండటంతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. దీంతో సెన్సెక్స్‌ 38,000, నిఫ్టీ 11,500 పాయింట్లపైకి ఎగబాకాయి. వినాయక చవితి సెలవు సందర్భంగా ఒక రోజు విరామం తర్వాత ప్రారంభమైన ట్రేడింగ్‌ ఆద్యంతం లాభాల్లోనే సాగింది. స్టాక్‌ సూచీలు వరుసగా రెండో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ లాభపడ్డాయి.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 373 పాయింట్ల లాభంతో 38,091 పాయింట్ల వద్ద, నిఫ్టీ 145 పాయింట్ల లాభంతో 11,515 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 408 పాయింట్లు, నిఫ్టీ 153 పాయింట్ల వరకూ పెరిగాయి. రియల్టీ, విద్యుత్తు, కన్సూమర్‌ డ్యూరబుల్స్‌ లోహ, వాహన షేర్లు లాభపడ్డాయి. ఐటీ మినహా అన్ని రంగాల షేర్లు పెరిగాయి. వారం పరంగా చూస్తే, వరుసగా రెండో వారమూ స్టాక్‌ సూచీలు నష్టపోయాయి. సెన్సెక్స్‌ 300 పాయింట్లు. నిఫ్టీ 74 పాయింట్ల చొప్పున క్షీణించాయి.

మార్కెట్లో ఆశావహ వాతావరణం...
ద్రవ్యోల్బణం తగ్గడం, రూపాయి కోలుకోవడంతో ఆశావహ వాతావరణం ఏర్పడిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ చెప్పారు. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుతాయనే అంచనాల కారణంగా అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయని వివరించారు.  

లాభాలు ఎందుకంటే...
ప్రధాని ఆర్థిక సమీక్ష: ఇటీవల డాలర్‌తో రూపాయి మారకం ప్రతి రోజూ జీవిత కాల కనిష్ట స్థాయికి పడిపోతున్న విషయం తెలిసిందే. రూపాయి పతనం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థికాంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. శుక్ర, శనివారాల్లో సాగే ఈ సమావేశంలో విధాన పరమైన నిర్ణయాలు కొన్ని తీసుకుంటారనే అంచనాలు నెలకొన్నాయి. దీంతో రూపాయి రికవరీ అవుతోంది. అందుకే స్టాక్‌ మార్కెట్‌ కూడా లాభపడుతోంది.  రూపాయి 65 పైసలు బలపడింది.

గణాంకాల ఉత్సాహం: ఈ ఏడాది జూలైలో  పారిశ్రామికోత్పత్తి 6.6 శాతానికి పెరగడం, ఆగస్టు రిటైల్‌ ద్రవ్యోల్బణం 10 నెలల కనిష్ట స్థాయి, 3.69 శాతానికి తగ్గడం, టోకు ధరల ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్ట స్థాయి, 4.53 శాతానికి తగ్గడం.. ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి.
ప్రపంచ మార్కెట్ల పరుగు: టర్కీ కేంద్ర బ్యాంక్‌ వడ్డీరేట్లను పెంచింది. దీంతో టర్కీ కరెన్సీ లిరా పుంజుకుంది. మరోవైపు చైనా–అమెరికాలు.. వాణిజ్య ద్రిక్తతలు తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా తాజాగా చర్చలకు శ్రీకారం చుట్టాయి. దీంతో ప్రపంచ మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొన్నది.  
తగ్గిన ముడిచమురు ధరలు: సరఫరా సమస్యలున్నప్పటికీ, డిమాండ్‌ తగ్గుతుందనే ఆందోళనతో ముడి చమురు ధరలు నాలుగు నెలల గరిష్ట  స్థాయి నుంచి పడిపోయాయి. వర్థమాన దేశాల కరెన్సీలు కుదేలవడం, వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా ముడి చమురుకు డిమాండ్‌ తగ్గుతుందనే అంచనాలు నెలకొన్నాయి.

ఎరువుల షేర్ల జోరు...
కాగా రైతులకు ప్రయోజనం కలిగేలా రూ.15,053 కోట్ల కొత్త ధాన్యం సేకరణ విధానానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలపడంతో ఎరువుల షేర్లు పెరిగాయి. రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్, ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్కూర్, నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ మద్రాస్‌ ఫెర్టిలైజర్స్‌ తదితర షేర్లు 18–4 శాతం రేంజ్‌లో పెరిగాయి.  
కేజీ బేసిన్‌ బ్లాక్‌లో సహజ వాయువు నిక్షేపాలను కనుగొనడంతో వేదాంత షేర్‌ 5.2 శాతం పెరిగింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్‌ ఇదే.

కొన్ని ముఖ్యాంశాలు...
 పంచదార షేర్ల పరుగులు వరుసగా రెండో రోజూ కొనసాగాయి. ఇధనాల్‌ ధరను 25 శాతం వరకూ పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సింభౌళి షుగర్స్, రానా షుగర్స్, మగధ్‌ షుగర్‌ అండ్‌ ఎనర్జీ, రాజశ్రీ షుగర్స్‌ అండ్‌ కెమికల్స్, కేఎమ్‌ షుగర్‌ మిల్స్, అవధ్‌ షుగర్‌ అండ్‌ ఎనర్జీ,  పొన్ని  షుగర్స్‌ (ఈరోడ్‌), దాల్మియా భారత్‌ షుగర్‌ అండ్‌ ఇండస్ట్రీస్, ఉత్తమ్‌ మిల్స్‌లు 20 శాతం వరకూ పెరిగాయి.
 బంగ్లాదేశ్‌ రోడ్‌ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ నుంచి మరో ఆర్డర్‌ లభించడంతో అశోక్‌ లేలాండ్‌ 3 శాతం ఎగసింది.  
 31 సెన్సెక్స్‌ షేర్లలో రెండు మాత్రమే(ఇన్ఫోసిస్, కోల్‌ ఇండియా) నష్టపోయాయి. మిగిలిన 29 షేర్లు లాభపడ్డాయి.  
 ఇక నిఫ్టీ 50లో 4 షేర్లు (ఇన్ఫోసిస్, కోల్‌ ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, గెయిల్‌) మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 46 షేర్లూ లాభాల్లో ముగిశాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా