లాభాల స్వీకరణతో మార్కెట్‌ పతనం

30 Nov, 2019 05:07 IST|Sakshi

జీడీపీ గణాంకాల వెల్లడి నేపథ్యంలో అప్రమత్తత

బలహీనంగా అంతర్జాతీయ సంకేతాలు

లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు

సెన్సెక్స్‌ 336; నిఫ్టీ 95 పాయింట్ల పతనం  

సెన్సెక్స్, నిఫ్టీలు జీవిత కాల గరిష్ట స్థాయిలకు చేరిన నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా నష్టపోయింది. మార్కెట్‌ ముగిసిన తర్వాత వెల్లడయ్యే ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక  జీడీపీ గణాంకాలు ప్రతికూలంగానే ఉండొచ్చన్న కారణంగా ఇన్వెస్టర్లు అప్రమ్త్తత పాటించారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 పైసలు పడిపోవడం, అంతర్జాతీయ సంకేతాలు సైతం బలహీనంగా ఉండటం ప్రతికూల ప్రభావం చూపించాయి. రోజంతా 479 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌ చివరకు 336 పాయింట్ల నష్టంతో 40,794 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 95 పాయింట్లు నష్టపోయి 12,056 వద్ద క్లోజయింది. వారం పరంగా చూస్తే మాత్రం సెన్సెక్స్, నిఫ్టీలు లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 434 పాయింట్లు, నిఫ్టీ 142 పాయింట్లు పెరిగాయి. ఇంధన, లోహ, వాహన, ఆయిల్, గ్యాస్, క్యాపిటల్‌ గూడ్స్, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు నష్టపోయాయి.  

479 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌: హాంకాంగ్‌లో చైనాకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న ఆందోళనకారులకు మద్దతుగా అమెరికా ఒక చట్టాన్ని తెచి్చంది. ఈ విషయంలో అమెరికా వైఖరికి చైనా రగిలిపోతోంది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అంశంపై అనిశ్చితి నెలకొనడంతో ఆసియా మార్కెట్లు పతనమయ్యాయి. ఇది మన మార్కెట్‌లో భారీ నష్టాలకు కారణమయ్యాయి. ఆరంభంలో 13 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, ఒక దశలో 466 పాయింట్లు పతనమైంది.  రోజంతా 479 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.

ఫ్యూచర్‌ షేర్ల జోరు: ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన ఫ్యూచర్స్‌ కూపన్స్‌లో అమెజాన్‌డాట్‌కామ్‌ ఎన్‌వీ ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్స్‌ 49 శాతం వాటా కొను గోలు చేయాలన్న ప్రతిపాదనకు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. దీంతో ప్యూచర్‌ గ్రూప్‌ కంపెనీ షేర్లు 20 శాతం వరకూ లాభపడ్డాయి. కాగా, రూ.10 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ను సాధించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఒక్క రోజులోనే ఆ ట్యాగ్‌ను కోల్పోయింది.

ఐపీఓకు హోమ్‌ ఫస్ట్‌ ఫైనాన్స్‌ !
తాకట్టు రుణాలిచ్చే హోమ్‌ ఫస్ట్‌ ఫైనాన్స్‌ కంపెనీ (హెచ్‌ఎఫ్‌ఎఫ్‌సీ) ఐపీఓ వస్తోంది. ఈ మేరకు ఐపీఓ పత్రాలను మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీకి సమరి్పంచింది. మొత్తం ఇష్యూ సైజు రూ.1,500 కోట్లు.  ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను భవిష్యత్తు మూలధన అవసరాలకు వినియోగిస్తారు.

మరిన్ని వార్తలు